కరీంనగర్ ‘సాలార్ జంగ్’కు జాతీయ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గత 60 ఏళ్లుగా వైద్య వృత్తిలో చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ దారం నాగభూషణంకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రదానం చేసింది. అరుదైన కళాఖండాలతో ఆయన ఒక మ్యూజియంనే ఏర్పాటు చేశారు. దీంతో ఆయన్ను ‘కరీంనగర్ సాలార్ జంగ్’గా పిలుచుకుంటారు.
అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వయో శ్రేష్ట్ సమ్మాన్-2016’ పేరిట ఈ అవార్డును ప్రదానం చేసింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థల కృషిని గుర్తిస్తూ అవార్డులను ప్రదానం చేసింది. శనివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో వయో వృద్ధులు 10.5 కోట్ల మంది ఉన్నారని, 2026 నాటికి ఈ సంఖ్య 17.2 కోట్లకు చేరుకుంటుందన్నారు.
అందువల్ల భవిష్యత్‌లో వృద్ధుల సంక్షేమానికి నిపుణుల సామర్థ్యం, వైద్య సాంకేతికత అవసరమని అభిప్రాయపడ్డారు. వృద్ధుల సమాజ భాగస్వామ్యం, వారి ఆర్థిక స్వేచ్ఛను, హక్కులను రక్షించడానికి మరిన్ని వనరులు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు టావర్‌చంద్ గెహ్లట్, విజయ్ సంప్లా తదితరులు పాల్గొన్నారు.