Airports Authority of India
-
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ముందడుగు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి రన్‌వేతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ పనులు ప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలో మూడో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను కూడా కొలిక్కి తేవటానికి చర్యలు ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత మూడో విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించాయి. ఇది కూడా రాష్ట్రంలో కీలక విమానాశ్రయంగా మారుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ తరహాలో దీన్ని కూడా వేయి ఎకరాల్లో నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది. పది రోజుల్లో సర్వేకు ఏఏఐ బృందంవిమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి గత పదేళ్ల వాతావరణ (మెటియోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఏఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు మరో పదిరోజుల్లో ఏఏఐ సాంకేతిక బృందం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతోంది. అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పెద్ద రన్‌వే..వరంగల్‌లో దాదాపు 2,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. కొత్తగూడెంలో కూడా అలాంటి భారీ రన్‌వేను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా, భారీ విమానాలు దిగగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది. 950 ఎకరాల భూమి గుర్తింపు రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగులో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్్రస్టిప్స్ను పునరుద్ధరించటంతోపాటు మరో మూడు చోట్ల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించాలన్నది ప్రతిపాదన. వీటిల్లో తొలుత వరంగల్ శివారులోని మూమునూరు పాత ఎయిర్‌్రస్టిప్ ఉన్న స్థలంలో ఎయిర్‌బస్ వంటి భారీ విమానాలు కూడా దిగగలిగే రన్‌వేతో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పుడు దానితోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ తొలుత చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా.. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వరంగల్ తరహాలో వేయి ఎకరాల్లో నిర్మించాలని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భావిస్తోంది. గతంలో విమానాశ్రయం కోసం పాల్వంచ సమీపంలో గుడిపాడు–బంగారుజాల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఏఏఐ.. ఆ స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమరి్పంచింది. ఆ ప్రాంతంలో గుట్టలుండటంతోపాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఏఐ అధికారులతోపాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఏఐ సమ్మతించటంతో జిల్లా కలెక్టర్‌కు ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు మూడు మండలాల పరిధిలోకి వచ్చే 950 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండల పరిధిలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు. ఎన్నో ఉపయోగాలు కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న మా ప్రతిపాదనకు అంగీకరించిన కేంద్రం.. అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సమ్మతించింది. బొగ్గు గనుల కేంద్రం, సిమెంటు పరిశ్రమల నిలయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం.. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్నందున రెండు రాష్ట్రాల అనుసంధానం తేలికవుతుంది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 300 కి.మీ. దూరంలో ఉన్నందున ఎలాంటి నిబంధనలు అడ్డు రావు. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవాలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు ఇది దోహదపడుతుంది.– తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి -
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది. వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు -
9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి
ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. కోవిడ్ సమయంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రైవేటీకరణలో మరింత జాప్యం.. విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్ ఎఫెక్ట్’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ పేర్కొన్నారు. -
ఏఏఐకు ఎయిర్‌లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ – ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, గోఫస్ట్, ఎయిరేషియా ఇండియా, ఎయిర్ ఇండియా, విస్తారా కలసి 2021 అక్టోబర్ చివరికి రూ.2,636 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఎయిర్ నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ తదితర రూపాల్లో ఏఏఐకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐకు అత్యధిక బకాయిలు ఎయిర్ ఇండియానే చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 1 నాటికి రూ.2,184 కోట్ల మేర ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంటే.. 2021 అక్టోబర్ చివరి నాటికి రూ.2,362 కోట్లకు పెరిగినట్టు ఏఏఐ అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించడం తెలిసిందే. -
వాటా అమ్మకానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్..మరికొన్ని కూడా!
కరోనా కారణంగా దేశీయ విమానయాన రంగం భారీగా నష్టపోయింది.ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఏఐ కొన్ని ప్రైవేట్ సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలు ఎయిర్ పోర్ట్‌ల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే కోవిడ్ వల్ల విమానయాన రంగానికి నస్టం రావడంతో ఆయా ఎయిర్ పోర్ట్‌లలో ఉన్న వాటాల్న అమ్మేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన విమానశ్రయాల్లోని తన వాటాల్ని అమ్మాలని నిర్ణయించింది. మహమ్మారి వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ఇంధన ధరలు కొండెక్కి కూర్చోవడంతో దేశీయ విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ.9,500- రూ.10,000 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది.ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్ట్‌లలో 13శాతం వాటాను, హైదరాబాద్ - బెంగళూరుకు చెందిన ఎయిర్ పోర్ట్‌లలో మరో 13శాతం వాటాను అమ్మనుంది. అయితే వాటాల్ని అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనల్నిపంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటాల అమ్మకం' ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా,ఈ ప్రక్రియ తొలత బెంగళూరు - హైదరాబాద్‌తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ముంబై - ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ల వాటాను అమ్మనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి: కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు -
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ... జాబితాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఆస్తులివే
National Monetisation Pipeline ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు ప లు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఎన్ఎంపీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ (ఎన్ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్‌కి మాత్రమే ఎన్ఎంపీ పరిమితమని మంత్రి చెప్పారు. అమ్మేయడం లేదు.. ఎన్ఎంపీ విధానంలో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుంది. అలాగే మానిటైజేషన్ ద్వారా వచ్చిన నిధులను .. మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘ఆయా అసెట్స్ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదో అమ్మేస్తోందంటూ గందరగోళపడాల్సిన అవసరం లేదు. ఈ బ్రౌన్‌ఫీల్డ్ అసెట్లు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి‘ అని ఆమె స్పష్టం చేశారు. విభాగాలవారీగా చూస్తే.. రహదారులు..: అసెట్ మానిటైజేషన్‌లో సింహభాగం వాటా రహదారుల విభాగానిదే ఉండనుంది. సుమారు రూ. 1.6 లక్షల కోట్ల విలువ చేసే 26,700 కి.మీ. మేర జాతీయ రహదారులను (ప్రస్తుతమున్నవి, కొత్తగా రాబోయేవి) మానిటైజ్ చేయనున్నారు. దీన్ని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అమలు చేయనుంది. టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్విట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో ఇది ఉండనుంది. టీవోటీ విధానంలో టోల్ రాబడులను బిడ్డరు నుంచి ప్రభుత్వం ముందుగానే తీసుకుంటుంది. ఆ తర్వాత సదరు రహదారిని వినియోగించే వారి దగ్గర్నుంచి బిడ్డరు టోల్ ఫీజు వసూలు చేసుకుని, నిర్దిష్ట లీజు వ్యవధికి రహదారిని నిర్వహించి, తిరిగి ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. ఇక రాబడులు అందించగలిగే ఇన్ఫ్రా అసెట్స్‌లో ఇన్విట్ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది. విమానాశ్రయాలు..: నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల (విజయవాడ, తిరుపతి, చెన్నై, వడోదరసహా) మానిటైజేషన్ ద్వారా రూ. 20,782 కోట్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు (13 శాతం వాటా) ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ఉన్న వాటాలను విక్రయించే యోచన ఉంది. రైల్వే..: రైల్వేలకు సంబంధించి నిర్దిష్ట రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లు, ప్యాసింజర్ రైళ్లు, కొంకణ్ రైల్వే మానిటైజేషన్ విలువ సుమారు రూ. 1.52 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకోసం 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్ రైళ్లు, 1,400 కి.మీ. మేర ఉన్న 1 రైల్వే ట్రాక్, 741 కి.మీ. కొంకణ్ రైల్వే, 15 రైల్వే స్టేడియంలు, కొన్ని రైల్వే కాలనీలు, రైల్వేకి చెందిన 265 గూడ్స్–షెడ్లు మొదలైనవి ఎంపిక చేశారు. టెలికం..: సుమారు రూ. 35,100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అసెట్స్‌ను ఎన్ఎంపీ జాబితాలో నీతి ఆయోగ్ చేర్చింది. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ వేసిన 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ అసెట్స్ విలువ రూ. 26,300 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే, బీఎస్ఎన్ఎల్కి చెందిన 13,567 మొబైల్ టవర్లు, ఎంటీఎన్ఎల్కి చెందిన 1,350 టవర్ల విలువను రూ. 8,800 కోట్లుగా అంచనా వేసింది. మైనింగ్..: దాదాపు రూ. 28,747 కోట్ల విలువ చేసే బొగ్గు గనులను మానిటైజ్ చేయనున్నారు. ఇందుకోసం 160 అసెట్స్‌ను గుర్తించారు. 761 ఖనిజ బ్లాక్‌లను నాలుగేళ్ల వ్యవధిలో వేలం వేయనున్నారు. షిప్పింగ్..: వచ్చే నాలుగేళ్లలో రూ. 12,828 కోట్ల విలువ చేసే షిప్పింగ్ అసెట్ల మానిటైజేషన్ జరగనుంది. దీన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ అమలు చేయనుంది. ఇందుకోసం 31 ప్రాజెక్టులను గుర్తించారు. రియల్ ఎస్టేట్..: రియల్ ఎస్టేట్, హోటల్ అసెట్స్ మానిటైజేషన్ విలువ సుమారు రూ. 15,000 కోట్ల మేర ఉండగలదని అంచనా వేస్తున్నారు. దేశ రాజధానిలోని పలు హౌసింగ్ కాలనీలు, ఎనిమిది ఐటీడీసీ హోటళ్లు కూడా ఈ మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ఉభయతారకం.. ఈ ప్రణాళిక ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఇన్విట్ల(ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు) ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే నిర్దిష్ట కాలానికి అసెట్లను నిర్వహించి, అభివృద్ధి చేసి, ప్రభుత్వానికి బదలాయించే విధానంలోనూ రాబడులు అందుకోవచ్చు. గిడ్డంగులు, స్టేడియంలు మొదలైన కొన్ని అసెట్స్‌ను ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక లీజుకి తీసుకోవచ్చు. ఇటు ప్రైవేట్ పెట్టుబడులతో ఇన్ఫ్రా అభివృద్ధి చేయడంతో పాటు అటు ఇతర మౌలిక ప్రాజెక్టులకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వానికి ఎన్ఎంపీ ఉపయోగపడనుంది. రూ. 111 లక్షల కోట్లతో నిర్దేశించుకున్న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రణాళికలో ఎన్ఎంపీ విలువ 5.4%గా ఉండగా, ప్రతిపాదిత ఎన్ఐపీలో కేంద్రం వాటాలో (రూ. 43 లక్షల కోట్లు) 14 %గా ఉండనుంది. ఎన్ఎంపీలో చేర్చేందుకు ఆస్కారమున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ జాబితాను నీతి ఆయోగ్ రూపొందించింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) కడ్తాల్–ఆర్మూర్: 31 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి– చేగుంట: 52 కి.మీ. చేగుంట – బోయినిపల్లి: 62 కి.మీ. మహారాష్ట్ర /తెలంగాణ సరిహద్దు– ఇస్లాంనగర్ (ఎన్‌హెచ్ 7): 55 కి.మీ. ఆర్మూర్–కడ్లూరు ఎల్లారెడ్డి: 59 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి – గుండ్ల పోచంపల్లి: 86 కి.మీ. హైదరాబాద్–బెంగళూరు (తెలంగాణ): 75 కి.మీ. 2. రైల్వేలు దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న 12 క్లస్టర్లలోని 109 రూట్లలో 150 అధునాతన రైళ్ళను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతిస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి రద్దీ క్లస్టర్లతో పాటు సికింద్రాబాద్ క్లస్టర్ అభివృద్ధికి బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రం ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) ► కొత్తకోట బైపాస్– కర్నూలు: 75 కి.మీ. ► హైదరాబాద్ – బెంగళూరు(ఏపీ): 251 కి.మీ. ► చిలకలూరిపేట– విజయవాడ: 68 కి.మీ. 2. గ్యాస్‌పైప్ లైన్ నెట్వర్క్ ► కేజీ బేసిన్ పైప్‌లైన్ నెట్వర్క్ – 889 కి.మీ. పొడవు 3. ఎయిర్‌పోర్టులు ► విజయవాడ (2023–24) – విలువ అంచనా: రూ. 600 కోట్లు ► తిరుపతి (2023–24) – విలువ అంచనా: రూ. 260 కోట్లు ► రాజమండ్రి (2024–25) – విలువ అంచనా: రూ. 130 కోట్లు 4. నౌకాశ్రయాలు ► పోర్టులకు సంబంధించి 2022–25 మధ్య దేశంలోని పోర్టుల్లో మొత్తం 31 ప్రాజెక్టులను పీపీపీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అందులో విశాఖపట్టణం పోర్టుకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ. 988 కోట్ల మేర ఉండనుంది. 5. రైల్వేలు ► స్టేషన్ల పునర్అభివృద్ధి కింద తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల మానిటైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. - సాక్షి, న్యూఢిల్లీ -
విమానాశ్రయాల నిర్వహణలో ‘అదానీ’ ఉల్లంఘనలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాల నిర్వహణలో బ్రాండింగ్, రాయితీల ఒప్పందాల నిబంధనలను అదానీ గ్రూపు ఉల్లంఘించినట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కమిటీలు గుర్తించాయి. దీంతో అదానీ గ్రూపు ఏఏఐతో చేసుకున్న ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బ్రాండింగ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో లోగోల ప్రదర్శనలకు సంబంధించి మార్పులు చేసింది. ఈ విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను గతేడాదే అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) చేపట్టింది. 2020 డిసెంబర్లో ఈ మూడు విమనాశ్రయాలకు సంబంధించి బ్రాండింగ్, డిస్ప్లే నిబంధనలకు అనుగుణంగా లేవని ఏఏఐ గుర్తించి ఆయా విమానాశ్రయ నిర్వహణ కంపెనీలకు లేఖలు రాసింది. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, తామేమే నిబంధనలను ఉల్లంఘించలేదంటూ అదానీ గ్రూపు విమానాశ్రయాలు బదులిచ్చాయి. దీంతో ఏఏఐ ఈ ఏడాది జనవరిలో మూడు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి అదానీ గ్రూపు నిర్వహణలోని మూడు విమానాశ్రయాల్లో హోర్డింగ్‌లు,డిస్ప్లే, బ్రాండింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో, లేవో? తేల్చాలని కోరింది. ఈ కమిటీలో తమ అధ్యయనం అనంతరం నిబంధనల ఉల్లంఘనను నిర్ధారించాయి. ఏఏఐ పేరు, లోగో ప్రముఖంగా కనిపించడం లేదంటూ.. ఏఏఐ లోగో, పేరు చిన్నగాను, అదానీ కంపెనీల పేరు పెద్దగాను ఉన్నాయంటూ నివేదికలు ఇచ్చాయి. మెరుగైన సదుపాయాలకు కట్టుబడి ఉన్నాం ఏఏఐ కమిటీలు గుర్తించిన వాస్తవాలతో అదానీ గ్రూపు అంగీకరిస్తోందా? అన్న ప్రశ్నకు.. ‘‘ఒప్పందం ప్రకారం ఇరు సంస్థల లోగోలు (అదానీ, ఏఏఐ) ఒకే సైజులో ప్రముఖంగా కనిపించే విధంగా ఉండాలి. రెండు బలమైన బ్రాండ్లు ప్రముఖంగా కనిపించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పంద స్ఫూర్తి ఫరిడవిల్లుతుంది’’ అని అదానీ గ్రూపు ప్రతినిధి స్పందించారు. -
తెలంగాణలో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్టుల ఏర్పా టుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
అదానీ బ్రాండింగ్... నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తన సొంత బ్రాండ్ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్సెషన్ ఒప్పంద (సీఏ) నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొంది. ఒప్పందం ప్రకారం విమానాశ్రయాలను నిర్వహించే కంపెనీలు తమ పేరు లేదా షేర్‌హోల్డర్ల పేర్లతో బ్రాండింగ్ చేసుకోరాదని తెలిపింది. దీనికి విరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ డిస్ప్లే బోర్డులన్నింటిలోనూ అదానీ ఎయిర్‌పోర్ట్స్ పేరు ప్రత్యేకంగా కనిపిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం మంగళూరు ఎయిర్పోర్ట్ చీఫ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్‌కు ఏఏఐ లేఖ రాసింది. అటు లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు కూడా ఇలాంటి లేఖలే పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పంద నిబంధనల ప్రకారం.. విమానాశ్రయంలో ఎక్కడా కూడా నిర్వహణ సంస్థ లేదా దాని షేర్‌హోల్డర్ల పేర్లతో ప్రకటనలు ఉండకూడదు. ఒకవేళ అలా చేయదల్చుకున్న పక్షంలో ఏఏఐ పేరును కూడా పొందుపర్చి, సముచిత ప్రాధాన్యమివ్వాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనలకు అనుగుణంగానే.. ఏఏఐ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తాము నిబంధనలకు కట్టుబడే ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘బాధ్యతాయుతమైన సంస్థగా మేము ఒప్పంద నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉంటాము. ఆన్–సైట్ బ్రాండింగ్‌పై ఏఏఐ స్పష్టత కోరింది. వివరణ ఇస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా విమానాశ్రయాల చట్టబద్ధమైన పేర్లను యథాప్రకారం ప్రముఖంగా కనిపించేలాగానే ప్రకటనలు ఉంటున్నాయి. మూడు విమానాశ్రయాల పేర్లు మార్చేందుకు ప్రయత్నమేమీ చేయలేదు. చేసే యోచన కూడా లేదు’’ అని అదానీ గ్రూప్ తెలిపింది. మరోవైపు, ఈ వివాదం సామరస్యంగానే పరిష్కారం కాగలదని భావిస్తున్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. లీజు గడువు తీరిపోయిన తర్వాత అంతిమంగా ఆయా ఎయిర్‌పోర్టులు తిరిగి తమ చేతికే వస్తాయి కాబట్టి వివరణ కోరినట్లు పేర్కొన్నాయి. లీజుకు ఆరు విమానాశ్రయాలు ... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద విమాశ్రయాలను ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆరు విమానాశ్రయాలను (తిరువనంతపురం, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, మంగళూరు, గువాహటి) లీజుకిచ్చింది. 50 ఏళ్ల పాటు నిర్వహణకు అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. ప్రస్తుతం మంగళూరు, లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా, మిగతావాటికి ఇంకా భద్రతాపరమైన క్లియరెన్సులు రావాల్సి ఉంది. -
విమానయానం.. కొత్త కొత్తగా...
న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా పలు ఆంక్షలను ప్రకటించింది. విమానం ప్రయాణించిన కాలం ఆధారంగా కనిష్ట, గరిష్ట చార్జీలను నిర్ధారించింది. దేశవ్యాప్తంగా విమాన మార్గాలను ఏడు బ్యాండ్స్‌గా విభజించామని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం వెల్లడించారు. విమాన ప్రయాణ సమయం 40 నిమిషాల లోపు ఉంటే తొలి బ్యాండ్‌గా, 40–60 నిమిషాల మధ్య ఉంటే రెండో బ్యాండ్, 60–90 నిమిషాల మధ్య ఉంటే మూడో బ్యాండ్, 90–120 నిమిషాల మధ్య ఉంటే నాలుగో బ్యాండ్, 120–150 నిమిషాల మధ్య ఉంటే ఐదో బ్యాండ్, 150–180 నిమిషాల మధ్య ఉంటే ఆరో బ్యాండ్, 180–210 నిమిషాల మధ్య ఉంటే ఏడో బ్యాండ్‌గా నిర్ధారించామన్నారు. కనిష్ట, గరిష్ట ధరలను నిర్ధారించేందుకే ఇలా బ్యాండ్స్‌గా విభజించామన్నారు. ఈ విభజన, చార్జీలపై పరిమితి ఆగస్ట్ 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రతీ విమానంలో కనిష్ట– గరిష్ట ధరలకు మధ్య సరిగ్గా సగం ధరకు 40% టికెట్లను అమ్మాల్సి ఉంటుందని విమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం 33% ఆపరేషన్లకే అనుమతించామని హర్దీప్ చెప్పారు. కరోనా కట్టడికి, చార్జీల వసూలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా పాటించాలన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘వందేభారత్’ కార్యక్రమంలో ప్రైవేటు విమానయాన సంస్థలూ త్వరలో పాలుపంచుకుంటాయన్నారు. ఇప్పటివరకు ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రమే ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన మార్చి 25 నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణీకులు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవీ నిబంధనలు.. ► 14 ఏళ్ళు దాటిన ప్రయాణికులంతా తమ మొబైల్స్‌లో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్దనే సీఐఎస్ఎఫ్, లేదా వైమానిక సిబ్బంది యాప్ ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకోని వారిని ప్రత్యేక కౌంటర్‌కి పంపి, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. అరోగ్య సేతు స్టేటస్‌లో రెడ్ మార్క్ కనిపిస్తే వారిని లోనికి అనుమతించరు. ► ఫ్లైట్ బయలు దేరడానికి కనీసం రెండు గం టల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చే యాలి. ఫ్లైట్ బయలుదేరేందుకు 4 గంటల ముం దు మాత్రమే టెర్మినల్ బిల్డింగ్‌లోనికి అనుమతిస్తారు. ► కేవలం వెబ్ చెక్–ఇన్ చేసుకున్న వారిని మాత్రమే విమానాశ్రయం లోనికి అనుమతిస్తారు. విమానాశ్రయాల్లో ఫిజికల్ చెక్–ఇన్ కౌంటర్లు ఉండవు. ► కేవలం ఒక చెక్–ఇన్ బ్యాగేజ్‌ని మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ► ఫ్లైట్‌లో భోజన సదుపాయం ఉండదు. ► ఫ్లైట్ బయలుదేరడానికి గంట ముందు బోర్డింగ్ ప్రారంభం అవుతుంది. ► టెర్మినల్‌లోకి ప్రవేశించడానికి ముందు తగు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం మొత్తం మాస్క్, గ్లవ్స్ ధరించడం తప్పనిసరి. ► కంటెయిన్మెంట్ జోన్లలోని వారికి, కరోనా పాజిటివ్ వచ్చినవారికి అనుమతి లేదు. ► ఆరోగ్య సేతు యాప్ ద్వారా, లేదా స్వీయ హామీ పత్రంద్వారా తాము ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రుకరించాలి. ► వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. ► కోవిడ్–19 అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు, వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ప్రత్యేక సౌకర్యాలు విమానాశ్రయాల్లో కల్పించాలి. ► విమానయాన సిబ్బందికి పీపీఈ కిట్లు తప్పనిసరిగా అందించాలి. ► విమానాశ్రయాల్లో పీపీఈ కిట్లు మార్చుకోవడానికి సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ► అన్ని ప్రవేశ ప్రాంతాల్లో ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి. ► విమానాశ్రయాల్లో న్యూస్‌పేపర్ గానీ, మ్యాగజైన్లు గానీ అందుబాటులో ఉండవు. అనుమతించరు. ► ఎయిర్‌పోర్టులో ఫుడ్ అండ్ బేవరేజెస్ అందుబాటులో ఉంటాయి. అన్ని కోవిడ్–19 జాగ్రత్తలతో అమ్మకాలు జరగాలి. ► ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న ఫుట్ మ్యాట్స్, కార్పెట్స్‌ని నిత్యం శుద్ధి చేస్తుండాలి. ► ప్రయాణికులు విమానాశ్రయంలో, విమానంలో భౌతిక దూరం పాటించాలి. ► విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల లగేజ్‌ను వారు టెర్మినల్ బిల్డింగ్‌లోకి వచ్చేముందే శానిటైజ్ చేయాలి. ► డిపార్చర్, అరైవల్ ప్రాంతాల్లో ట్రాలీల వినియోగాన్ని ప్రోత్సహించవద్దు. అవసరమని భావిస్తేనే ట్రాలీ ఇవ్వాలి. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం, ప్రయాణికులను విమానంలోనికి అనుమతించాలి. -
నింగిలో సయ్యాట
సనత్‌నగర్: నింగిలో అద్భుతానికి హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర పౌర విమానయాన సంస్థ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రెండేళ్లకోసారి ‘వింగ్స్ ఇండియా’పేరిట నిర్వహించే ఏవియేషన్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు ఈ షో జరగనుంది. ఇందులో ప్రధానంగా సరంగ్ టీమ్, మార్క్ జెఫ్రీ బృందాల విన్యాసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉండనుంది. గతంలో పోలిస్తే ఈసారి ఎయిర్ షోకు అధిక ప్రాధాన్యత కల్పించారు. గతంతో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలే విన్యాసాలు జరిగేవి. మార్క్ జెఫ్రీ బృందం మాత్రమే విన్యాసాలు చేసేది. ఈసారి అదనంగా సరంగ్ టీం కూడా అదరగొట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు సరంగ్ టీమ్, మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు మార్క్ జెఫ్రీ టీం, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు సరంగ్ టీం, సాయంత్రం 4 నుంచి మార్క్ జెఫ్రీ బృందం విన్యాసాలు చేయనున్నాయి. ఈ రెండు బృందాలు గత రెండు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాయి. సకల విమాన ఉత్పత్తుల ప్రదర్శన.. కమర్షియల్, రీజనల్, బిజినెస్, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు హెలికాప్టర్స్, మోటార్ గ్లైడర్స్, బెలూన్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మిషనరీ, ముడి ఉత్పత్తుల కంపెనీలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ ఉత్పత్తులు, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలు, స్పేస్ ఇండస్ట్రీలు, డ్రోన్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్ సర్వీసెస్, కార్గో ఉత్పత్తులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు సైతం కొలువుదీరనున్నాయి. 13న సీఎం కేసీఆర్ సందర్శన మొదటిరోజు రిజిస్ట్రేషన్స్, చిన్నచిన్న సమావేశాలు, ఎగ్జిబిషన్ ప్రారంభంతో పాటు సరంగ్, మార్క్ జెఫ్రీ టీంలు నింగిలో సందడి చేయనున్నాయి. 13న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఈ షోకు హాజరవుతారు. ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోరలా, ఫిక్కీ చైర్మన్ ఆనంద్‌స్టాన్లీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అర్వింద్‌సింగ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. సామాన్య ప్రజలకు నో ఎంట్రీ.. ప్రతిసారి చివరి రోజున ఏవియేషన్ షో వీక్షించేందుకు సామాన్యులకు అవకాశం కల్పించేవారు. అయితే ఈసారి కరోనా ప్రభావంతో సామాన్య ప్రజలను అనుమతించరన్న వార్తలు వస్తున్నాయి. వ్యాపార సంబంధ వ్యక్తులకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. -
ఇక అదానీ ఎయిర్‌పోర్టులు..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ దిగ్గజం అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్‌లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఆరోదైన గౌహతి ఎయిర్పోర్ట్ బిడ్‌ను మంగళవారం తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రయాణికుడిపై చెల్లించే ఫీజు ప్రాతిపదికన బిడ్డింగ్ సంస్థను ఎంపిక చేసినట్లు అధికారి చెప్పారు. మిగతా సంస్థలతో పోలిస్తే అదానీ గ్రూప్ అత్యధిక ఫీజు కోట్ చేయడంతో అయిదు ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టు దానికి దక్కినట్లు పేర్కొన్నారు. ఏఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు అదానీ గ్రూప్ ప్యాసింజర్ ఫీజు కింద అత్యధికంగా రూ. 177 ఆఫర్ చేసింది. అలాగే జైపూర్‌కు రూ. 174, లక్నో ఎయిర్‌పోర్టుకు రూ. 171, తిరువనంతపురం విమానాశ్రయానికి రూ. 168, మంగళూరు ఎయిర్‌పోర్టుకు రూ. 115 మేర ప్యాసింజర్ ఫీజు కింద ఏఏఐకి అదానీ గ్రూప్ చెల్లించనుంది. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ ఇవే విమానాశ్రయాలకు వరుసగా రూ. 85, రూ. 69, రూ. 63, రూ. 63, రూ. 18 ఆఫర్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన ఏఏఐ అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్రం గతేడాది నవంబర్‌లో ఆమోదముద్ర వేసింది. ఆయా విమానాశ్రయాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందించగలగడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. 10 కంపెనీలు .. 32 బిడ్లు.. ప్రస్తుతం ఏఏఐ నిర్వహణలో ఉన్న ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణకు 10 కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్లు వచ్చాయి. వీటిలో ఆటోస్ట్రేడ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఐ–ఇన్వెస్ట్మెంట్ మొదలైన సంస్థలు ఉన్నాయి. అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాలకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), జ్యూరిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ రెండో అతి పెద్ద బిడ్డర్స్‌గా నిల్చాయి. అటు లక్నో ఎయిర్‌పోర్టు విషయంలో ఏఎంపీ క్యాపిటల్, తిరువనంతపురం విమానాశ్రయానికి సంబంధించి కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఐడీసీ), మంగళూరు ఎయిర్‌పోర్టు విషయంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థలు రెండో స్థానంలో నిలిచాయి. -
చాంపియన్ ఏఏఐ
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. రైల్వేస్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో ఏఏఐ 3–2తో విజయం సాధించింది. జోనల్ స్థాయిలో టోర్నీలు నిర్వహించి విజేత జట్లకు ఈసారి టీమ్ చాంపియన్‌షిప్‌లో అవకాశం కల్పించారు. డిఫెండింగ్ చాంపియన్ పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఈసారి టీమ్ విభాగంలో బరిలోకి దిగలేదు.రైల్వేస్‌తో జరిగిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ (ఏఏఐ) 21–17, 21–17తో శుభాంకర్ డే (రైల్వేస్)పై... రెండో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 21–12, 21–14తో అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్)పై నెగ్గడంతో ఏఏఐ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హేమనాగేంద్ర బాబు–కబీర్ కంజార్కర్ (రైల్వేస్) జోడీ 21–18, 17–21, 21–18తో శ్లోక్ రామచంద్రన్–చిరాగ్ సేన్ జంటపై... మహిళల డబుల్స్ మ్యాచ్‌లో రియా ముఖర్జీ–అనురా ప్రభుదేశాయ్ (రైల్వేస్) ద్వయం 21–8, 21–8తో శ్రేయాన్షి పరదేశి–స్నేహ జంటపై గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో శ్రేయాన్షి పరదేశి–శ్లోక్ రామచంద్రన్ జంట 21–9, 17–21, 21–8తో కనిక కన్వల్– అక్షయ్ రౌత్ జోడీపై గెలిచి ఏఏఐ జట్టుకు టైటిల్‌ను ఖాయం చేసింది. -
3 నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదా?
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయం మార్గంలో గత మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత ముఖ్యమైన మార్గంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ జాతి భద్రతకు సంబంధించి ఏదైనా జరగరాని ఘటన జరిగితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంటుందని నిలదీసింది. మనిషి సృష్టించే విపత్తుల నుంచి రక్షించుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని న్యాయస్థానం పేర్కొంది. విమానాశ్రయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీలున్నాయి..? వాటి ఫుటేజీ వివరాలపై కోర్టు ఆరా తీసింది. వీఐపీ లాంజ్, రెస్టారెంట్లో సీసీ కెమేరాలు లేవనే విషయాన్ని గుర్తించింది. విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బాధ్యతలు ఏమిటి..? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బాధ్యతలు ఏమిటి? అనే అంశాలను ఆరా తీసింది. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యాయవాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సీఐఎస్‌ఫ్ ఐజీ, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, విశాఖపట్నం విమానాశ్రయ ప్రధాన భద్రతాధికారి, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రతివాదులుగా చేర్చింది. వీరితోపాటు ఇప్పటికే ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, విశాఖ పోలీస్ కమిషనర్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌కు కూడా నోటీసులు జారీ చేస్తూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్, వైఎస్సార్ జిల్లాకు చెందిన గుమ్మా అమర్నాథ్రెడ్డిలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఇది ఒక్కరు చేసే పని కాదని, దీని వెనక మరికొంత మంది ఉండి ఉంటారని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బాధ్యతాయుతుడైన అధికారి సాయం తీసుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ తమకు ఇక్కడున్న న్యాయవాదులపై నమ్మకం ఉందని, అధికారుల సాయం ఎంత మాత్రం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఐఎస్ఎఫ్ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. సీఐఎస్ఎఫ్ బాధ్యత అంతవరకే ... ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారిని విమానాశ్రయం లోపలకు పంపడం, ఆ తరువాత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వరకే సీఐఎస్ఎఫ్ బాధ్యతని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్ కోర్టుకు నివేదించారు. వీఐపీ లాంజ్ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి రాదని, అది ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల నియంత్రణలో ఉంటుందన్నారు. గాయపడిన వ్యక్తులకు చికిత్స అందించే అంశం కూడా ఆ అ«థారిటీ పరిధిలోకే వస్తుందన్నారు. సీఐఎస్ఎఫ్ ఐజీ సి.వి.ఆనంద్ ఘటన తరువాత విశాఖ విమానాశ్రయానికి వెళ్లి విచారణ జరిపారని చెప్పారు. విమానాశ్రయం లోపల ఏ భాగాలు ఎవరి పరిధిలో వస్తాయో నిర్ధిష్టంగా చెప్పాలని ధర్మాసనం కోరగా.. కొంత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని లక్ష్మణ్ నివేదించారు. కావాల్సినంత సమయం తీసుకోవచ్చని, ఈ విషయంలో తాము ఎవరినీ తొందరపెట్టబోమని, సీఐఎస్ఎఫ్ను శాసించజాలమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తరువాత ధర్మాసనం సీసీ టీవీలు, వాటి ఫుటేజీల గురించి ఆరా తీసింది. ఘటన తరువాత విమానాశ్రయంలో ఉన్న సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ప్రశ్నించగా... తీసుకున్నామని ఏజీ చెప్పారు. లాంజ్ లోపల, బయట, రెస్టారెంట్ లోపల, బయట సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే లాంజ్‌లో సీసీ టీవీ లేదని, బయట కొద్ది దూరంలో ఉన్న సీసీ టీవీ నుంచి ఫుటేజీ తీసుకున్నామని ఏజీ చెప్పారు. రెస్టారెంట్లో కూడా సీసీ టీవీ లేదన్నారు. అందుకే జగన్ వాంగ్మూలం ఇవ్వలేదు... ఆ తరువాత దర్యాప్తు అధికారుల ముందు వైఎస్ జగన్ వాంగ్మూలం ఇచ్చారా? అంటూ ధర్మాసనం ఆరా తీసింది. ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని... డీజీపీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు కాబట్టి వాంగ్మూలం ఇవ్వరాదని ఓ స్పష్టమైన వైఖరి తీసుకున్నామని జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసమే ఈ ఘటన జరిగిందని, దీనికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తంటూ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జగన్‌పై హత్యాయత్నాన్ని డ్రామాగా అభివర్ణిస్తూ దర్యాప్తును ఏ దిశగా చేయాలో పోలీసులకు నిర్దేశించారని, అలాగే దర్యాప్తు ఫలితం ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆ తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలను తెలుసుకునే మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందని చెప్పాడని, అందుకు సంబంధించి సీడీలు కూడా ఉన్నాయని, వాటిని కూడా వ్యాజ్యాలతో జత చేశామని మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గాయపడిన వ్యక్తిని విమానం ఎక్కేందుకు ఎవరు అనుమతించారంటూ లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. దీంతో సీఐఎస్ఎఫ్కు సంబంధం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. అది ఎయిర్పోర్ట్ వారి పరిధిలోని అంశమన్నారు. వైఎస్ జగన్ విమానం ఎక్కే సమయానికి అక్కడ ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీసులు కూడా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా తనకున్న విస్తృత ప్రజాభిమానం దృష్ట్యా వైఎస్ జగన్ తాను హైదరాబాద్ వెళ్లాలని కోరి ఉండొచ్చునని, అయితే నిబంధనలు తెలుసుకోకుండా ఆయన్ను విమానం ఎలా ఎక్కనిచ్చారని ప్రశ్నించింది. విమానంలో జగన్‌కు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. మేం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది... ఆ తరువాత సిట్ నివేదికను మరోసారి పరిశీలించిన ధర్మాసనం అందులో సీసీటీవీ కోర్ టీం అని పేర్కొని ఉండటాన్ని గమనించి కోర్ టీం ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఇదే సమయంలో విమానాశ్రయ మార్గంలో గత మూడు నెలలుగా సీసీ టీవీలు పనిచేయడం లేదన్న విషయాన్ని నివేదికలో పేర్కొని ఉండటాన్ని గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను నిలదీసింది. సిట్ నివేదిక పరిశీలించిన తరువాత తాము మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలను పరిశీలించేందుకు సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన పలువురు అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ విచారణను వాయిదా వేసింది. -
జస్ట్ మిస్.. లేకుంటే పెను ప్రమాదమే!
న్యూఢిల్లీ : భారత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారుల అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే గాల్లో రెండో విమానాలు ఢీకొని పెను ప్రమాదం సంభవించేదని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పేర్కొంది. గువాహతి నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి గువాహతి వస్తున్న రెండు ఇండిగో విమానాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒకదానికి ఒకటి ఢీకునేలా దగ్గరకు వచ్చాయి. తొలుత కోల్‌కతా ఫ్లైట్ 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. చెన్నై విమానం 35,000 అడుగుల్లో ప్రయాణిస్తోంది. అయితే కోల్‌కతా విమానంకు బంగ్లాదేశ్ ఏటీసీ అధికారులు 35,000 అడుగుల్లో ప్రయాణించాలని సూచించడంతో ఈ రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి.( చదవండి: టేకాఫ్‌కు కొన్ని నిముషాల ముందు..) ఇది గుర్తించిన భారత ఏటీసీ అధికారులు వెంటనే చెన్నై-గువాహతి ఫ్లైట్‌ను కుడివైపు టర్న్ తీసుకుని, కోల్‌కతా విమానంకు దూరంగా వెళ్లాలని సూచించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనల ప్రకారం రెండు విమానాల మధ్య ఎత్తు వెయ్యి అడుగుల వ్యత్యాసం ఉండాలి. అయితే కోల్‌కతా విమానం బంగ్లా అధికారులు సూచనలతో కిందికి రావడంతో రెండు విమానాలు ఒకే లెవల్లో ప్రయాణించాయి. ఈ ఘటనపై ఏఏఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇండిగో అధికారప్రతినిధి మాత్రం ఈ సంఘటనపై ఎలాంటి సమాచారం అందలేదన్నాడు. ఇటీవల ఇండోనేషియాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) -
స్త్రీలోక సంచారం
►ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎ.ఐ.) ఇటీవల కాలంలో నియమించిన మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య 2,000 వరకు ఉందని, ఐదేళ్ల క్రితం ఒక శాతంగా ఉన్న ఎ.ఎ.ఐ. మహిళల నియామకాలు నేటికి 10 శాతానికి పెరిగాయని.. ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే – ఇండియా’ (సెప్టెంబర్ 19) సందర్భంగా గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూపేష్ సి.హెచ్.నేగీ తెలిపారు. వాస్కోలోని సెయింట్ ఆండ్రూస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థినులు హాజరైన ఈ కార్యక్రమంలో నేగీ మాట్లాడుతూ.. త్వరలోనే కోల్‌కతాకు చెందిన ఒక యువతి తొలి ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటర్’గా వైమానిక దళంలో చేరబోతున్నారని, మహిళలకు ఈ రంగంలో ఇప్పుడు తమ సామర్థ్య నిరూపణకు తగిన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ►సమాన వేతనం, సాధికారతల విషయంలో పాశ్చాత్య దేశాలు మహిళలకు సానుకూలంగా తమ ధోరణులను మార్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో కూడా స్త్రీల ఉద్దేశాలను, స్త్రీల ఉద్యమాలను గుర్తించి, గౌరవించి, వారి అభీష్టానికి తగినట్లుగా సామాజిక పరివర్తన తెచ్చుకోవడం అవసరమైన అనివార్య దశలో మనం ఇప్పుడు ఉన్నామని సెప్టెంబర్ 21న విడుదలైన తన తాజా చిత్రం ‘మాంటో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోస్‌ను సందర్శించిన ఆ చిత్ర కథానాయకుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘‘శతాబ్దాలుగా మహిళల్ని మనం ఎలా అణిచివేస్తూ వస్తున్నామో ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పుడిది మారే దశ. వారి పట్ల మన సంకుచిత, ఆధిక్య దృక్పథాన్ని మార్చుకోవాలి. వారి ఆలోచనలను, కోర్కెలను, మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలి’’ అని సిద్ధిఖీ అన్నారు. ►‘ఆషా’ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్) కార్యకర్తలకు, అంగన్వాడీ కార్మికులకు పారితోషికం పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తొమ్మిది రోజులకు ఢిల్లీ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.. ఆ పారితోషికాన్ని తిరస్కరించింది! ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్స్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యూనియన్ అధ్యక్షురాలు శివానీ కౌల్ మాట్లాడుతూ, ‘‘అంగన్వాడీలను పర్మినెంట్ చెయ్యాలని, వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం.. కంటి తుడుపుగా పారితోషికాన్ని ప్రకటించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ► ఘర్వాల్ ప్రాంతంలోని డెహ్రాడూన్‌లో ‘గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జి.డి.ఎం.సి.హెచ్.)లో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో ఆరు రోజులుగా హాస్పిటల్ కారిడార్‌లో నేల పైనే పడుకుని ప్రసవం కోసం ఎదురుచూసిన 27 ఏళ్ల ముస్సోరీ మహిళ.. నొప్పులు రావడంతో చివరికి అక్కడే ప్రసవించి, వైద్య సంరక్షణ అందక, అధిక రక్తస్రావంతో మరణించిన కొద్ది సేపటికే.. ఆమెకు పుట్టిన బిడ్డ (మగశిశువు) కూడా శ్వాస కోసం ఇరవై నిముషాలు కొట్టుకుని కన్నుమూయడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. అయితే.. ఆమె భయంతో ప్రసూతి వార్డు నుంచి పరుగులు తీసిందని, బహుశా ఆ కారణంగానే రక్తస్రావం జరిగి ఉంటుందని వివరణ ఇచ్చిన ఆసుపత్రి మహిళా విభాగం చీఫ్ మెడికల్ సూపర్వైజర్ డాక్టర్ మీనాక్షీ జోషి.. బిడ్డ మరణానికి మాత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ►హరి యాణాలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆ రాష్ట్రంలోని బి.జె.పి. ప్రభుత్వం 2 లక్షల రూపాయలను మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడాన్ని విమర్శిస్తూ.. ‘బీజేపీ నేత ఎవరైనా పదిమంది చేత దాడికి గురైతే తాను 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని’ ఆమ్ ఆద్మీ పార్టీ హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ జైహింద్ అనడాన్ని ఆయన భార్య, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. తన భర్త మాటల్లోని ఉద్దేశాన్ని తను అర్థం చేసుకోగలనని, అయితే ఆయన అలా మాట్లాడ్డం సరికాదని స్వాతి అన్నారు. -
భోగాపురం నుంచి బాత్రూం వరకు..
సాక్షి, న్యూఢిల్లీ : భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి బాత్రూం వరకు టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. భోగాపురం మిమానాశ్రయం నిర్మాణ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్‌ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ప్రైవేట్ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పాల్గొనకుండా సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు. -
భారీ లూటీకి బాబు సర్కారు స్కెచ్
-
టార్గెట్ భోగాపురం
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయలు కమీషన్లు కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి అనుకూలంగా అస్మదీయులకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు రూపొందిస్తున్న విధానంలోనే ఈ ఎయిర్పోర్ట్ పనులను కూడా అప్పగించేందుకు రెడీ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని కూడా గతంలో దాఖలు చేసిన బిడ్లలో పేర్కొంది. అయితే ఆ సంస్థ నుంచి కమీషన్లు రావని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారు. తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా వ్యూహం పన్నారు. ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా దూరంగా ఉంచవచ్చో అదే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. బిడ్లలో పాల్గొనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుండాలనే నిబంధన పెట్టడం వెనుక ఏఏఐని నిలువరించే ఉద్దేశం స్పష్టమవుతోంది. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కమీషన్లు రావనే పాత టెండర్లు రద్దు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనాన్షియల్ బిడ్లను 2017 ఆగస్టు 21వ తేదీన తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఏఏఐ తెలిపింది. ఈ బిడ్లలో పాల్గొన్న జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలని ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సిఫార్సు చేశారు. అయితే ఏఏఐ నుంచి ముడుపులు, కమీషన్లు రావని ఉద్దేశంతో ముఖ్యనేత.. అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు కూడా తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా బిడ్లను ఆహ్వానించినా ఏఏఐ మళ్లీ పాల్గొంటే తమ లక్ష్యం నెరవేరదని చాకచక్యంగా అర్హత నిబంధనలను రూపొందించారు. ఈ షరతుల ద్వారా బిడ్లలో ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘రియల్’ వ్యాపారం చేసి ఉంటేనే... సాధారణంగా ప్రైవేట్ సంస్థలైతే వాణిజ్య, రియల్ ఎస్టేట్ నిర్మాణాలను చేపట్టి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావటంతో ఏఏఐ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టదు. దీన్ని ఆసరాగా తీసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం బిడ్లలో పాల్గొనే వారు గత పదేళ్లలో 1.50 లక్షల చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉండాలనే నిబంధన విధించారు. అలాగే కనీసం 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కమ్ వాణిజ్య వ్యాపారం చేసి ఉండాలని, కనీసం 100 ఎకరాల్లో మూడు లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో రెసిడెన్షియల్ అండ్ టౌన్షిప్ నిర్మించి ఉండాలనే షరతులను పొందుపరిచారు. ఈ నిబంధనల ద్వారా ఏఏఐని బిడ్లలో పాల్గొనకుండా నిలువరించారని, కావాలనే ఇలాంటి మెలిక పెట్టారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన సంస్థను ఎంపికచేసి పనులు కట్టబెట్టేందుకే ఇలాంటి నిబంధనలను తెరపైకి తెచ్చారని వారు చెబుతున్నారు. మూడు దశల్లో పనులు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలుత 5,311 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించాలని భావించారు. తర్వాత ఒక దశలోనే 2,708 ఎకరాల్లో రూ. 2,461 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించి 2016 జూలైలో బిడ్లను ఆహ్వానించారు. అయితే ఇప్పుడు 3 దశల్లో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు దశలకు నిర్మాణ వ్యయం రూ. 4,209 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశకు రూ. 2,302.51 కోట్లు, రెండో దశకు రూ. 989.58 కోట్లు, మూడో దశ పనులకు రూ. 917.01 కోట్లు వ్యయం అవుతుందని ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పనులను అనుకూల కంపెనీకి అప్పగించి తద్వారా రూ. కోట్లు కొల్లగొట్టడానికి ముఖ్యనేత వ్యూహం పన్నారని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఇక పార్కింగ్ చార్జీలు ఇలా కట్టొచ్చు!
న్యూఢిల్లీ: ఇక విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను సులువుగా చెల్లించవచ్చు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు పార్కింగ్ చార్జీలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అందుబాటులోకి తీసుకువస్తున్నది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను ఈ నెల 28 (సోమవారం) అర్ధరాత్రి వరకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ 29 (మంగళవారం) నుంచి డిజిటల్ చెల్లింపుల విధానం విమానాశ్రయాల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న అన్ని విమానాశ్రాయల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కారు పార్కింగ్ చార్జీలను డెబిట్/క్రెడిట్ కార్డులను, పేటీఎం, ఫ్రీచార్జ్‌లను ఉపయోగించి ఈ-పేమెంట్ చేయవచ్చునని ఏఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటించిన ఉచిత పార్కింగ్ సేవలు ఈ నెల 29తో ముగియనున్నాయని పేర్కొంది. -
దరఖాస్తు చేశారా?
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-చివరి తేదీ మే 20 నావల్ డాక్ యార్డ్, విశాఖపట్నం.. చార్జిమెన్ పోస్టులు -చివరి తేదీ మే 15 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో.. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు -చివరి తేదీ మే 15 జామియా మిలియా ఇస్లామియాలో.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - చివరి తేదీ మే 5 -
ఏఏఐ చైర్మన్ గా సుధీర్ రహేజాకు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సుధీర్ రహేజా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పదవీ కాలంతో గతేడాది జనవరిలో ఏఏఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్ కే శ్రీవాత్సవను కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా పదవి నుంచి తప్పించింది. దీంతో ఆయన బాధ్యతలను సుధీర్ రహేజాకు అప్పగించింది.