ఇక పార్కింగ్ చార్జీలు ఇలా కట్టొచ్చు!
న్యూఢిల్లీ: ఇక విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను సులువుగా చెల్లించవచ్చు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు పార్కింగ్ చార్జీలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అందుబాటులోకి తీసుకువస్తున్నది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో పార్కింగ్ చార్జీలను ఈ నెల 28 (సోమవారం) అర్ధరాత్రి వరకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ 29 (మంగళవారం) నుంచి డిజిటల్ చెల్లింపుల విధానం విమానాశ్రయాల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న అన్ని విమానాశ్రాయల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కారు పార్కింగ్ చార్జీలను డెబిట్/క్రెడిట్ కార్డులను, పేటీఎం, ఫ్రీచార్జ్‌లను ఉపయోగించి ఈ-పేమెంట్ చేయవచ్చునని ఏఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటించిన ఉచిత పార్కింగ్ సేవలు ఈ నెల 29తో ముగియనున్నాయని పేర్కొంది.