టెలికం రంగంలోకి ఏరోవాయిస్
వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా కార్యకలాపాలు
⇒ ఏప్రిల్ 14న 3 సర్కిల్స్‌లో షురూ
⇒ రూ. 300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ప్రవాస భారతీయుడు శివకుమార్ కుప్పుసామికి చెందిన యాడ్‌పే మొబైల్ పేమెంట్ సంస్థ తాజాగా ఏరోవాయిస్ పేరిట టెలికం సర్వీసులు ప్రారంభించనుంది. వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా (వీఎన్‌వో) వచ్చే నెల ప్రారంభించే ఈ సేవల ద్వారా తొలి ఏడాదిలో అయిదు లక్షల కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. మొబైల్ సర్వీసులపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్లు యాడ్‌పే మొబైల్ పేమెంట్ వ్యవస్థాపక సీఈవో శివకుమార్ కుప్పుసామి తెలిపారు.
ముందుగా తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి సర్కిల్స్‌లో ఏప్రిల్ 14న కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. తమకంటూ ప్రత్యేకంగా స్పెక్ట్రం లేనందున ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోనున్నట్లు శివకుమార్ చెప్పారు. తాను ఇప్పటికే స్విట్జర్లాండ్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా తదితర దేశాల్లోని పలు టెలికం కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
భారత్‌లో ఏరోవాయస్ కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు శివకుమార్ చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్ వంటి పూర్తి స్థాయి టెలికం ఆపరేటర్లకు ఇవి రిటైలర్లుగా వ్యవహరించే వీఎన్‌వోలు.. మొబైల్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ వంటి టెలికం సంబంధ సేవలను అందిస్తాయి. వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) మార్గదర్శకాలు ప్రకటించిన అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో టెలికం శాఖకు 70 పైగా దరఖాస్తులు వచ్చాయి.