ప్రాన్స్ అధ్యక్షుడి పర్యటనపై బెదిరింపులు
బెంగళూరు: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె భారత పర్యటనను వ్యతిరేకిస్తూ బెదిరింపు లేఖ రావడం ఉద్రిక్తతను రాజేసింది. గుర్తు తెలియని దుండగలు ఈ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బెదిరింపు లేఖ వచ్చినట్టు గురువారం అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని దుండగులు వ్యతిరేకించారు. దీంతో అసలే ఉగ్రదాడులతో బెంబేలెత్తిపోతున్న అధికారుల్లో మరింత ఆందోళన మొదలైంది.
తాజా హెచ్చరికలపై నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. హోలండే పూర్తి భద్రత కోసం ఫ్రాన్స్ డైరక్టరేట్ జనరల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు పఠాన్ కోట్ ఉగ్రదాడి, ఉగ్రవాదులు జనవరి 26న దేశ రాజధానిలో దాడి చేయనున్నారనే వార్తల నేపథ్యంలో పదివేల మంది పారామిలిటరీ సిబ్బందిసహా మొత్తం 80వేల మంది పోలీసు బలగాలతో ఇప్పటికే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
జనవరి 26న జరగబోయే గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే హాజరు కానున్నారు. గత ఏడాది నవంబరు నెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లినప్పుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని హోలండేను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే పారిస్ ఉగ్రదాడి, ఎమర్జెన్సీ నేపథ్యంలో జీ20 సదస్సుకు కూడా హోలండే హాజరు కాలేదు. తాజా హెచ్చరికలతో హోలండే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా గత ఏడాది రిపబ్లిక డే వేడకులకు అమెరికా అధ్యక్షుడు ఒమాబా దంపతులు ముఖ్యంగా అతిధులుగా హాజరయ్యారు.