గైరోస్కోప్స్పై పరిశోధనలు చేస్తున్నా
విదే శీ విద్య ప్రతి విద్యార్థి కల.. పరిశోధనలను తమ కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా విదేశీ యూనివర్సిటీలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు.. ముఖ్యంగా అమెరికా వర్సిటీల చుట్టూనే వీరి ఆలోచనలు సాగుతుంటాయి.. ఇలాంటి వర్సిటీల్లో కార్నెల్ యూనివర్సిటీ ఒకటి.. ఇథాకా (న్యూయార్క్)లో ఉన్న ఈ వర్సిటీలోనే అత్యధిక మంది విదేశీ విద్యార్థులు తమ పరిశోధనల కెరీర్ దిశగా అడుగులు వేస్తూంటారు.. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ ప్రత్యేకత, క్యాంపస్ లైఫ్, తదితర అంశాలపై ‘కార్నెల్’లో ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో పీహెచ్డీ చేస్తున్న అజయ్ కె. భట్ తన అనుభవాలను సాక్షితో ప్రత్యేకంగా పంచుకున్నాడు..
పరిశోధన పరంగా అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కార్నెల్ యూనివర్సిటీ ఒకటి. ఈ యూనివర్సిటీలో 4,089 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్కూల్ విద్యార్థుల సంఖ్య 2,346. ఈ యూనివర్సిటీలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే భారతీయ విద్యార్థులకు టాటా స్కాలర్షిప్స్ ద్వారా చేయూత లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడానికి కార్నెల్ యూనివర్సిటీ కూడా ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తోంది.
సిద్ధాంతపరంగా అధ్యయనం:
ప్రస్తుతం నేను కార్నెల్ నుంచి ఫిజిక్స్ (కార్నెల్ ఫిజిక్స్)లో పీహెచ్డీ చేస్తున్నా. ఇందులో భాగంగా ఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సునీల్ భావే (ఆక్సైడ్ ఎంఈఎంఎస్)తో కలసి తర్వాతి తరం గైరోస్కోప్స్ మీద పరిశోధనలు సాగిస్తున్నా. హైబ్రిడ్ సిస్టమ్ నిర్మాణంలో తోడ్పడే మైక్రోస్ట్రక్చర్స్, చల్లని అణు వాయువు మధ్యగల పరస్పర సంబంధాన్ని సిద్ధాంతపరంగా అధ్యయనం చేయడం నా పరిశోధనలో భాగం.
బిట్స్ నుంచి డిగ్రీ: బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)-పిలానీ నుంచి డ్యూయల్ డిగ్రీతో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఇందులో భాగంగా బీఈ (ఆనర్స్-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్), ఎంఎస్సీ (ఆనర్స్-ఫిజిక్స్) కోర్సులను చదివా. మాస్టర్స్ కోర్సులో భాగంగా థీసిస్‌ను మాత్రం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్-ముంబై, నుంచి డాక్టర్ మందర్ దేశ్‌ముఖ్ పర్యవేక్షణలో పూర్తి చేశా.
స్కాలర్షిప్స్: 2009లో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్సీఏఎస్ఆర్) సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్పీఎఫ్)కు ఎంపికయ్యాను. బిట్స్-పిలానీలో కూడా స్కాలర్షిప్ వచ్చింది. తద్వారా ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ లభించింది.
ఆహ్లాదకరం: కార్నెల్ యూనివర్సిటీ ఇథాకా (న్యూయార్క్)లో ఉంది. అకడమిక్ పరంగా చూస్తే చక్కటి సౌకర్యాలు ఉంటాయి. క్యాంపస్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కార్నెల్ యూనివర్సిటీ ప్రధాన నేపథ్యంగా ఉండే ఒక చిన్న పట్టణం ఇథాకా. కాబట్టి పట్టణ వాతావరణం (సిటీ లైఫ్) అంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఇక్కడి శీతాకాలం మాత్రం భారత్‌తో పోల్చితే చాలా చలిగా ఉంటుంది.
సర్వేల్లో ప్రముఖం: వివిధ విభాగాలకు సంబంధించి యూజీ, పీజీ, పరిశోధన (రీసెర్చ్) కోర్సులను ఈ యూనివర్సిటీ అందజేస్తోంది. ప్రపంచంలోనే ఒక యూనివర్సిటీ నుంచి అత్యధిక మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న యూనివర్సిటీల్లో కార్నెల్ది నాలుగో స్థానం. తర్వాత వీరిలో చాలా మంది అమెరికన్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, నేచురల్ సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ చేస్తుంటారు. 2012లో క్యూఎస్ సంస్థ నిర్వహించిన ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఈ వర్సిటీ 14వ స్థానంలో నిలిచింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వేలో 16వ స్థానాన్ని దక్కించుకుంది.
తోడ్పాటు: పరిశోధనలను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు చక్కగా సరిపోయే యూనివర్సిటీ కార్నెల్. అందుకే ఈ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేయాలని భావించా. ఈ విషయంలో బిట్స్-పిలానీ ఎంతో తోడ్పాటును అందించింది. ఎందుకంటే బిట్స్ విద్యార్థి అనే అర్హత కారణంగానే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్-ముంబై, నుంచి ఏడాది వ్యవధిగల రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం లభించింది. ఈ అంశం నా దరఖాస్తుకు మరింత బలాన్ని చేకూర్చింది. దాంతో కార్నెల్ దిశగా మార్గం సుగమమైంది.
నిరంతరం: మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరేందుకు నిరంతరం పట్టుదలతో శ్రమించాలి. అలా శ్రమిస్తేనే ఏ కెరీర్‌ను ఎంపిక చేసుకున్నా అందులో విజయం సాధ్యమవుతుంది. నా లక్ష్య సాధనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు.
స్కోర్లు:
జీఆర్ఈ: 1350/1600 (క్వాంటిటేటివ్-800/800: వెర్బల్-550/800)
జీఆర్ఈ ఫిజిక్స్: 900/900
టోఫెల్ ఐబీటీ: 115/120 (రీడింగ్-30/30; లిజనింగ్- 29/30; స్పీకింగ్-27/30; రైటింగ్-29/30).