ఏకే 57లో అక్షరాహాసన్
కమల్‌హాసన్.. తిరుగులేని కథానాయకుడు. ఈ లోకనాయకుడికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కూతుళ్లిద్దరూ ముంబైలో పెరగడం వలనో ఏమో మాతృభాష తమిళంలో కాకుండా హిందీ సినిమాలతో తెరంగేట్రం చేశారు. అక్క శ్రుతీహాసన్‌లా చెల్లెలు అక్షరాహాసన్కీ తొలి చిత్రంతో హిందీలో చుక్కెదురైంది.
అమితాబ్ బచ్చన్, ధనుష్ హీరోలుగా నటించిన ‘షమితాబ్’తో అక్షరాహాసన్ హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో ఈ బ్యూటీ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. తాజాగా ఓ తమిళ చిత్రం అంగీకరించారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో అక్షరాహాసన్ నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ కథానాయిక. అక్షర మరో నాయిక.
తమిళంలో తనకిది మొదటి చిత్రం. అజిత్‌కి ఇది 57వ చిత్రం. ఇంకా పేరు ఖరారు చేయలేదు కాబట్టి, వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే 57’ అంటున్నారు. తెలుగులో ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ అజిత్ హీరోగా ‘వీరమ్’, ‘వేదాళం’ వంటి రెండు హిట్ చిత్రాలిచ్చారు. కాబట్టి.. హ్యాట్రిక్ ఖాయం అనే నమ్మకంతో అజిత్ ఫ్యాన్స్ ఉన్నారు.