పారిశుధ్యంపై అధ్యయనం
కలెక్టర్‌ను కలిసిన యూఎస్ఏ బృందం
ముకరంపుర: యూఎస్ఏ స్మిత్ కాలేజీలో ప్రొఫెషనల్ మానిటర్ టౌన్ ఇంజినీర్ డానియల్ మర్ఫి, విద్యార్థినులు మిరాయలా, జేఫర్సన్ విద్యార్థినుల బృందం బుధవారం క్యాంపు ఆఫీసస్‌లో కలెక్టర్‌ను కలిశారు. టౌన్ ఇంజినీర్ డానియల్ మర్పీ మాట్లాడుతూ శానిటేషన్‌పై సర్వే చేసేందుకు ఇండియాకు వచ్చామని వివరించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఆహ్వానం మేరకు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాలో శానిటేషన్‌పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గురువారం ఎంపీ దత్తత గ్రామం వీర్నపల్లిలో సర్వే చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛభారత్ పథకంలో బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలుగా మార్చుటకు చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు సత్ఫలితాలిస్తుందన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వీర్నపల్లి 3వేల జనాభాగల మారుమూల వెనుకబడిన గ్రామమని, అక్కడ వంద శాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. వందశాతం అక్షరాస్యత, గుడుంబా రహిత గ్రామంగా మార్చామని తెలిపారు. గుడుంబాపై జీవనోపాధి పొందేవారికి వివిధ రకాల రుణాలిప్పించి స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు. అంతర్గత రోడ్లు నిర్మించామని, మెడికల్ క్యాంపులు నిర్వహించామని వివరించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.