లింకు పోయింది
ఆకివీడు : వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే లింకు రోడ్లకు గ్రహణం పట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న లింకు రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతించిన సర్కారు ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో తీసేసుకున్నట్టుగా గడువు మీరిపోయిం దంటూ నిధుల్ని వెనక్కి మళ్లిపోయేలా చేసింది. ఏలూరు మినహా జిల్లాలోని 17 మార్కెట్ కమిటీల పరిధిలో 334 లింకు రోడ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదించింది. వాటి నిర్మాణానికి మార్కెట్ కమిటీల నిధులు రూ.11.18 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.11.18 కోట్లు కలిపి మొత్తం రూ.22.36 కోట్లను కేటాయించారు. మార్కెట్ కమిటీల వాటా నిధులు రూ.11.18 కోట్లను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించారు. ఒక్కొక్క రహదారి నిర్మాణానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ కేటాయించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు
కాకపోవడం, ఆ తరువాత వర్షాల వల్ల పనులు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది. జూన్ 30వ తేదీలోపు పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి.
తుస్సుమన్న రూ.కోటి పనులు
ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో రూ.కోటికి పైగా విలువైన పనుల్ని చేపట్టేందుకు అనుమతులు లభించాయి. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 18 లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ నిధులతో లింకు రోడ్లను పూర్తిగా గ్రావెల్‌తో నిర్మించాల్సి ఉంది. అయితే, పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అతి తక్కువ గడువు ఇవ్వడంతో నిధులు మంజూరైనా వెనక్కి మళ్లిపోయాయి.
రైతుల సొమ్ము వారికి అక్కరకు రావడం లేదు
రైతుల నుంచి మార్కెట్ సెస్ రూపంలో వసూలు చేసే నిధులు వారికి అక్కరకు రాకుండాపోతున్నాయి. ధాన్యం, బియ్యం, నూకలు, చేపలు, రొయ్యల ఎగుమతుల నుంచి మార్కెట్ కమిటీలు సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి మార్కెట్ కమిటీకి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇందులో 20శాతాన్ని ప్రభుత్వం తీసుకుం టోంది. మిగిలిన నిధులను రైతుల అవసరాల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా ఒక్క పైసా కూడా రైతుల కోసం వెచ్చించడం లేదు. సెస్ రూపంలో వసూలయ్యే సొమ్ము 80 శాతం నిధులను రైతులకు అవసరమయ్యే నూర్పిడి కళ్లాలు, లింకు రోడ్ల నిర్మాణం, ఇతరత్రా పనులకు వినియోగించాల్సి ఉంది. కనీసం పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
వాళ్లకేమీ తెలియదట
లింకు రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా, జిల్లాస్థాయి అధికారులు ఆ పనుల వివరాలేమీ తమకు తెలియదని చెబుతున్నారు. జిల్లాలో ఎన్ని లింకు రోడ్లకు నిధులొచ్చాయి, ఎన్ని పనులను ప్రారంభించారనే వివరాలను చెప్పడానికి ఆ శాఖ అధికారులు సంకోచిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఈఈ ఎస్.రఘుబాబును సంప్రదించగా, పూర్తి సమాచారం తమవద్ద లేదని ఎస్ఈని అడగాలని సూచించారు. ఎస్ఈ ఇ.మాణిక్యంను అడిగితే ఈఈ వద్దే సమాచారం ఉంటుందని దాటవేశారు.