మౌనప్రేమ
పాతకథ
ప్రసిద్ధ రచయిత్రి అమృతాప్రీతమ్, సుప్రసిద్ధ కవి సాహిర్ లుధియాన్వీల మధ్య గాఢమైన ప్రేమ ఉండేదని అంటారు. అమృతా ప్రీతమ్‌కు సాహిర్ వల్ల ఒక కొడుకు కూడా ఉన్నాడని మరో పుకారు. సాహిత్యలోకంలో విస్తృతంగా చక్కర్లు కొట్టే ఈ గాసిప్ వెనుక ఉన్న అసలు సంగతిని అమృతా ప్రీతమ్ మాటల్లోనే చదవండి.
1960లో నేను బొంబైలో వున్నప్పుడు నాకూ రాజేందర్‌సింగ్ బేడీకి (ప్రసిద్ధ ఉర్దూ కవి) స్నేహమేర్పడింది. తరచూ కలిసే వాళ్లం. ఒకనాడు అతడు అకస్మాత్తుగా ‘నీ కుమారుడు నవరాజ్కు తండ్రి సాహిర్ అని అందరూ అంటున్నారే’ అని పలికాడు.
‘ఊహామాత్రంగా ఆ మాట కరెట్టే; నిజానికైతే అది కరెట్టు కాదు’ అన్నాను.
13 ఏళ్ల వయసున్న నవరాజ్ కూడా ఒకసారి నాతో ‘మమ్మీ. నిన్నో ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా?’ అన్నాడు.
‘తప్పక చెప్తాను’
‘నేను అంకుల్ సాహిర్ కొడుకునా?’
‘కాదు’
‘అయివుంటే చెప్పమ్మా. అంకుల్ అంటే నాకిష్టమే’
‘నాకూ అంతే బాబూ. కానీ నువ్వనుకుంటున్నది నిజమయి వుంటే నీకు ‘నిజమే’నని చెప్పివుండేదాన్ని’ తాను సాహిర్ సంతానం కాదని నా పిల్లవాడికి నమ్మకం కుదిరింది.
కానీ ఊహాజనితమైన నిజం, అసలు నిజానికేమీ తీసిపోదని అనుకుంటాను.
సాహిర్ ఎప్పుడు లాహోర్ వచ్చినా నా మౌనముద్రకు సమ్మోహితుడయ్యేవాడనుకుంటాను. ఆ మౌనంలో అతడెంత భాగం పంచుకునేవాడంటే కుర్చీలో అలాగే మౌనంగా కూచునేవాడు. తాను కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయే వరకూ మాటామంతీ లేకుండా అలాగే వుండి పోయేవాడు. సిగరెట్టు వెంబడి సిగరెట్టు కాలుస్తూ వుండేవాడు. సిగరెట్టులో సగం కాల్చి, దాన్ని నొక్కి ఆర్పేసి, మళ్లీ మరొకటి వెలిగించుకునేవాడు. అతడు లేచి వెళ్లిపోయింతర్వాత, అతడు కూచున్న చుట్టుపట్టంతా సిగరెట్టు పీకలు పడి ఉండేవి.
ఒక్కోసారి అతణ్ణి ముట్టుకోవాలని నాలో తీవ్రంగా అనిపించేది. కానీ నా పరిమితులు నాకు ఉండేవి; వాటిని అతిక్రమించలేకపోయేదాన్ని. ఆ కాలంలో నేను అధికంగా నా ఊహాలోకంలో జీవిస్తుండేదాన్ని.
అతడు వెళ్లిపోయిన తర్వాత అక్కడ పడివున్న సిగరెట్టు పీకల్ని పోగుచేసి రహస్యంగా ఒక అల్మరాలో దాచేదాన్ని. అటు తర్వాత అడపా దడపా వాటిని ముట్టుకునేదాన్ని. ఆ సిగరెట్టు తుంపును చేత్తో పట్టుకుని, అంతకుమునుపు అతడి వేళ్లు ఆ సిగరెట్టును ముట్టుకున్నై అనేది గుర్తుంచుకొని, దానిని నేనూ ఇప్పుడు వేళ్లమధ్య ఉంచుకున్నాను కాబట్టి అతడి వేళ్లను నేను ముట్టుకున్నట్లు ఫీలయ్యేదాన్ని. సిగరెట్టు కాల్చడమనేది నాకా విధంగా అలవాటయింది. ఆ సిగరెట్టు సువాసనలో అతడు నా ముందు ఉన్నట్లు భావించుకునేదాన్ని. వెలిగించిన సిగరెట్టు నుండి ఉంగరాలు ఉంగరాలుగా పొగపైకి లేస్తుంటే, ఆ పొగలో నుండి అతడి ఆకారం తొంగి చూస్తున్నట్లుండేది.
ఈ ఊహాలోకం ఎవరైతే సృష్టించుకుంటారో అది కేవలం వారికే చెందుతుంది. కానీ ఈ లోకంలోని వ్యక్తులు ఓ వింత శక్తిని సంతరించుకుంటారు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్