గోదారమ్మ పంపిస్తోంది .. కృష్ణమ్మ పిలుస్తోంది
గోదావరి అంత్యపుష్కర సంరంభం పరిసమాప్తమైంది. ఇక కృష్ణమ్మ చెంతకు వెళ్లిరావయ్యా అంటూ పుష్కరునికి పావనవాహినీ తీరం వీడ్కోలు పలికింది. ఆఖరి రోజు పుణ్యస్నానాలకు భక్తజనం పోటెత్తింది. నదీమతల్లి ఒడిలో జలకాలాడి తరించింది. సకల, సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించింది. పసుపు, కుంకుమతో అర్చించింది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్యపుష్కరాల ఆఖరి రోజు గురువారం జిల్లాలోని నదీతీరం కిక్కిరిసింది. ఏ ఘాట్ వద్ద చూసి భక్తుల సందడి కనిపించింది. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో అంత్యపుష్కరాల ముగింపు సభ జరిగింది. మళ్లీ 11 ఏళ్లకు గానీ పుణ్యస్నానం చేసే అవకాశం రాదని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరి తీరంలోని ప్రధానమైన ఘాట్లతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్లూ కళకళలాడాయి. అంత్యపుష్కరాల 12 రోజులూ భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సుమారు ఆరు,ఏడు లక్షల మంది పుణ్యస్నానాలు చేసి ఉంటారని అధికారులు చెబుతున్నారు.
ఆఖరి రోజు గురువారం సుమారు 75 వేల మంది స్నానాలు ఆచరించి ఉంటారని అంచనా. ఎంతమంది వస్తారో అంచనాలు లేకుండానే అధికారులు అంత్యపుష్కర సంరంభాన్ని ప్రారంభించారు. అయితే తరలివచ్చిన భక్తుల సంఖ్యను చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడూ అంత్యపుష్కరాలకు ఇంతమంది రాలేదని వృద్ధులు చెబుతున్నారు. వీటిపై ప్రభుత్వం అసలు శ్రద్ధపెట్టలేదు. ఆఖరికి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. కృష్ణాపుష్కరాల బందోబస్తు పేరుతో ఇక్కడి నుంచి సిబ్బందిని అక్కడకు పంపింది. అయితే ఉన్న సిబ్బందే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సాయంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వారానికిపైగా గోదావరిలో వరద పోటెత్తినా, కొన్ని ఘాట్లను మూసివేయాల్సి వచ్చినా అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా అంత్యపుష్కరాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి.
రాత్రి వరకూ పుణ్యస్నానాలు
కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నరసాపురంలోని వలంధర్రేవులు గురువారం తెల్లవారుజాము నుంచి , మధ్యాహ్నం వరకూ కిటకిటలాడాయి. రాత్రి వరకూ భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. కొవ్వూరులో 30వేల మందిపైనే భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా కట్టారు. నరసాపురంలో 25వేల మందివరకూ స్నానాలు చేసినట్టు అంచనా. తెల్లవారుజామున భారీ, వర్షం పడినా లెక్కచేయకుండా భక్తులు గోదారమ్మ ఒడిలో తడిసిముద్దయ్యారు. తాళ్లపూడి మండలంలో వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక ఘాట్లకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మహిళలు పసుపు, కుంకుమతో గోదారమ్మను అర్చించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తాళ్లపూడి గ్రామంలో వివిధ దేవాలయాల ఆధ్వర్యంలో భారీ రథయాత్ర జరిగింది. నదీమతల్లికి భక్తజనం హారతులిచ్చారు. కోడేరు పుష్కరఘాట్‌కు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత 12 రోజులలో మండలంలోని కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కరఘాట్లలో సుమారు 50 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. సిద్ధాంతం ఘాట్‌లో సుమారు 15 వేలమందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. శుక్రవారం కృష్ణాపుష్కరాలు ప్రారంభం కానుండడంతో గురువారం ముగిసే అంత్య పుష్కర స్నానాలు చేసి ఇక్కడి నుంచి కృష్ణా నదీమతల్లి చెంతకు వెళ్లి అక్కడా స్నానం చేసి పుణ్యఫలం పొందాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సిద్ధాంతం జాతీయ రహదారిపై ఉండడంతో కేదారీఘాట్‌లో అంత్య పుష్కర స్నానాలు చేసి, కృష్ణా పుష్కర స్నానానికి పయనమయ్యారు. అన్ని ఘాట్లలోనూ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి భక్తులకు సదుపాయాలు కల్పించాయి. ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లూ చేశాయి.