వడదెబ్బకు వ్యక్తి మృతి
విజయనగరం: ఎండాకాలం మొదలవగానే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఎండలకు చాలామంది పేదలు ప్రాణాలు వదులుతున్నారు. అవగాహన లోపమా ? లేక తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లటం చేస్తుండటమే ప్రజలు చేస్తున్న తప్పిదంలా ఉంది. తాజాగా బుధవారం విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు ఓ కూలీ మృతిచెందాడు.
ఆ గ్రామ సమీపంలోని పనసలపాడు చెరువు పనులు చేస్తుండగా.. కోరాడ అప్పలస్వామి (62) అనే ఉపాధిహామీ కూలీ సొమ్మసిల్లి పడిపోయాడు. తన తోటి కూలీలు అతణ్ని గ్రామానికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే అప్పలస్వామి తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న ఎంపీడీవో రామారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
(సాలూరు)