appannadorapalem
-
ఆ తోటల్లో...
నర్సీపట్నం : నర్సీపట్నానికి కూత వేటు దూరం.... విశాఖ వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల దూరంలో అప్పన్నదొరపాలెం తోటలు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. చీకటి కార్యకలాపాలకు అనువుగా... సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి, సరుగుడు తోటలు ఉన్నాయి. అందువల్ల చీకటి కార్యకలాపాలకు అనువుగా మారాయి. ఇక్కడికి మోటార్ సైకిళ్లపై వచ్చి కార్యకలాపాలు ముగించుకుని వెళ్తుంటారు. పాత నేరస్తులు కూడా వస్తుంటారు. యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి మధ్య గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. హత్యకు దారి తీసిన సందర్భాలు..: పరిస్థితి విషమిస్తే హత్యలకు దారితీసిన పరిస్థితులు లేకపోలేదు. విశాఖ నగరంలో చంపేసిన వారిని సైతం ఇక్కడికి తీసుకువచ్చి పడేస్తుంటారు. ఇదే తోటలో ఏడాది క్రితం ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మరో రెండు మూడు నెలలు గడిచిన తరువాత విశాఖలో భూ తగాదాకు సంబంధించి మరో యువకుడిని చంపేసి ఇక్కడ రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు. తాజాగా శనివారం ఒక మహిళను కర్కశంగా గొంతు కోసి చంపేశారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. పోలీసుల నిఘా కరువు నేరాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మార్చుకున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తున్నా పోలీసుల నిఘా కరువైంది. కనీసం రోజూ సాయంత్రం వేళల్లోనైనా వీరు దృష్టి సారిస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. గస్తీ ఏర్పాటు చేస్తాం అప్పనదొరపాలెం తోటలపై దృష్టి సారిస్తాం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్టుకట్ట వేస్తాం. గస్తీ ఏర్పాటుచేసి నిఘా పెంచుతాం. నేరాల నియంత్రణకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.సింహాద్రినాయుడు, పట్టణ సీఐ -
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు
విజయనగరం రూరల్ : కొత్తవలస ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అప్పన్నదొరపాలెం పంచాయతీ అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడుమెరక గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులు గురువారం దాడులు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి. విజయలక్ష్మి ఆదేశాల మేరకు అధికారులు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా తుమ్మన్నమెరకలో పది లీటర్ల నాటు సారా, 200 లీటర్ల బెల్లం ఊట.. అప్పన్నదొరపాలెంలో 25 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. 13 సీసాల మద్యం బాటిళ్ల స్వాధీనం కొత్తవలస మండలంలోని రామలింగాపురం గ్రామంలో బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్న జి.అప్పలరాజు నుంచి 13 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ భీమ్‌రెడ్డి, ఏఈఎస్ త్యాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ లోకేశ్వరరావు, కొత్తవలస సీఐ వెంకటరావు, ఈఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. సారా మానండి నవోదయం కార్యక్రమంలో భాగంగా అప్పన్నదొరపాలెం గ్రామంలో సర్పంచ్ అమ్మతల్లి ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు సారాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సారా తయారీకి గ్రామస్తులు దూరంగా ఉండాలన్నారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.