asthanam
-
తిరుమలలో దీపావళి ఆస్థానం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశరక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు. కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామి వారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతియేటాలాగే ఈ సారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్ర బద్దంగా నిర్వహించామని చెప్పారు. తెలుగు ప్రజలకు వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్ధానం
-
తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం
పంచాంగ శ్రవణం తిరుమల: శ్రీ హేమలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. వేకువజాము 3 గంటలకు సుప్రభాత సేవతోనే ఉగాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వైదిక పూజల తర్వాత ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్థానం.. పర్వదినాల్లో ప్రత్యేకం ఉగాది, శ్రీరామ నవమి, దీపావళి వంటి పర్వదినాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా తిరుమల ఆలయంలో ప్రత్యేకంగా ‘ఆస్థానం’ ఉత్సవాలను కన్నుల పండవలా నిర్వహించడం ఆనవాయితీ. ► ఈ తెలుగు పండుగ ఉగాది రోజున తొలివేకువలోనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, విష్వక్సేనులవారికి వేర్వేరుగా ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి , పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదించారు. ► తర్వాత ఆరు నూతన పట్టువస్త్రాలతో ఊరేగింపు నిర్వహించారు. వాటిలో నాలుగు నూతన వస్త్రాలను గర్భాలయ మూలమూర్తికి.. కిరీటం, నందక ఖడ్గం, మాల, ఉత్తరీయంగా సమర్పించారు. అనంతరం మరో రెండు పట్టువస్త్రాల్లో మలయప్ప, విష్వక్సేనులవారికి సమర్పించారు. ► అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్తాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేసారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపించారు. ‘‘ ఓ స్వామీ!! వేంకటాచలపతి. ముక్కోటి నమస్కారాలు. ఈ నూతన సంవత్సరంలో మరింత దయాతరంగులై భక్తుల పాపాలు పొగొడతారు. సకల సంపదలు కలిగిస్తారు. శుభ పరంపరలు గుప్పిస్తారు. మీ అనుగ్రహం చేత మీ కనుసన్నల్లో మెలిగే నవగ్రహదేవతుల అందరూ తమ భక్తుల్ని కాపాడతారు. రక్షిస్తారు. దేశమంతా సస్యశ్యామలమై వర్థిల్లుతుంది. అందుకే స్వామీ! ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు మీ దర్శనం కోసం అర్రులుచూస్తూ తిరుమలయాత్ర చేస్తారు. మీ భక్తులు సర్వవేళల్లో, సర్వదేశాల్లో రక్షింప బడతారు.’’ అంటూ సిద్దాంతి పంచాంగ శ్రవణం చేస్తుండగా స్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇలా ఆస్థానంలో ఆగమోక్తంగా వైదిక ఆచారాలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయంగార్లు, అర్చకులు, ఆలయ అధికారులకు ప్రత్యేకంగా శఠారీ మర్యాదలు చేశారు. -
తిరుమలలో 15న శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి, తిరుమల: ఈనెల 15వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఆ రోజు నిర్వహించే నిజపాద దర్శనం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దుచేశారు. అలాగే, 16వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఆరోజు వసంతోత్సవ సేవ రద్దు చేయగా, మిగిలిన సేవలు యథావిధిగా కొనసాగుతాయి.