‘సత్యం’ కేసులో సెబీ ఉత్తర్వులు చెల్లవు
► రామలింగరాజు వ్యవహారంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు
► ఆ జరిమానా; మార్కెట్ల నుంచి నిషేధించటం సరికాదు
► సెబీ సభ్యుడు తన బుద్ధిని ఉపయోగించినట్లు లేదు
► నాలుగు నెలల్లోగా తాజా ఉత్తర్వులివ్వాలి: శాట్
ముంబై: సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించి దాని వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో సహా మరికొందరికి వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ (శాట్) ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి వారు అక్రమంగా ఆర్జించిన మొత్తాన్ని వెనక్కివ్వాలని గతంలో సెబీ ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా వారిని స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనటం, అమ్మటం వంటి కార్యకలాపాల నుంచి నిషేధించింది కూడా. ‘‘సెబీ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని తోసిపుచ్చుతున్నాం. నాలుగు నెలల్లో తాజా ఉత్తర్వులివ్వాల్సిందిగా సెబీని ఆదేశిస్తున్నాం’’ అని శుక్రవారం శాట్ స్పష్టం చేసింది.
రామలింగరాజు తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్ప డ్డారని, మోసపూరిత కార్యకలాపాలకు దిగారని సెబీ ఇచ్చిన ఉత్తర్వులతో శాట్ కూడా ఏకీభవించింది. అయితే కారణాలు చెప్పకుండా వారందరికీ ఒకే రీతిలో జరిమానా వెయ్యటాన్ని మాత్రం తప్పుబట్టింది. సెబీ హోల్‌టైమ్ సభ్యుడిచ్చిన ఉత్తర్వులు చట్టానికి నిలబడవని, అవి ఆలోచించి ఇచ్చిన ఉత్తర్వుల్లా అనిపించటం లేదని శాట్ సభ్యుడు జస్టిస్ జె.పి.దేవధర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సత్యం వ్యవహారంలో లేని లాభాల్ని ఉన్నట్లుగా చూపించినట్లు 2009లో రామలింగరాజు అంగీకరించారు. అది జరిగిన ఎనిమిదేళ్లకు శాట్ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపిన సెబీ... సత్యంకు చెందిన ఐదుగురు ఉన్నతస్థాయి అధికారులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి మోసపూరితంగా లాభాలు ఆర్జించారని, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని పేర్కొంది.ఈ మేరకు 2014 జూలై 5న సెబీ ఉత్తర్వులిస్తూ... రామలింగరాజు, ఇతరులు కలిసి రూ.1,848.93 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించింది కూడా. ఈ ఉత్తర్వుల్ని ఇపుడు శాట్ పక్కనపెట్టింది.