ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ!
మున్సిపాల్టీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్
సిద్దిపేట జోన్: జిల్లాలోని మున్సిపాల్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొండి బకాయిల వసూళ్లు తలకు మించిన భారంగా పరిగణించే మున్సిపల్ యంత్రాంగానికి సర్కార్ కల్పించిన అవకాశం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు ప్రతి యేటా మార్చి నెలాఖరులో కేవలం పది హేను రోజుల గడువును వడ్డీ మాఫీ కోసం విధిస్తూ బకాయిదారులకు కొంత మేర వెసులు బాటు కల్పించేవి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల చివరి వారంలో మాసం రోజుల పాటు ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలో సుమారు రూ. 3 కోట్ల వడ్డీ మాఫీ కానుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.
వీటిలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో సుమారు 50 లక్షలు మాఫీ కానున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట పురపాలక సంఘాలతో పాటు గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జోగిపేట నగర పంచాయతీలు ఉన్నాయి. ప్రతి యేటా మున్సిపల్ పరిధిలో అర్థవార్షిక, నగర పంచాయతీల్లో వార్షిక ఆస్తి పన్ను డిమాండ్‌ను అధికారులు అమలు చేస్తుంటారు. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలో, రెండు నగర పంచాయతీల్లో సుమారు పది కోట్ల వరకు ప్రతి యేటా ఆస్తి పన్ను రూపంలో వసూలవుతున్నట్లు సమాచారం.
ఈ లెక్కన సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోనే 19, 310 నివాస, నివాసేతర గృహాల నుంచి ప్రతి అర్థవార్షికంలో రూ. 2.67 కోట్ల ఆస్తి పన్ను వసూలు నిర్దేశిత లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. గత ఐదేండ్లుగా సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను బకాయిలు మున్సిపల్‌కు గుదిబండగా మారాయి. ఈ క్రమంలో మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం వడ్డీ మాఫీ పేరిట వినూత్న ప్రక్రియకు తెరలేపింది. అందులో భాగంగానే గత మూడేళ్ల క్రితం మార్చి నెలలో బకాయి దారుల డిమాండ్‌పై ఉన్న ఆస్తి పన్ను బకాయిలను నిర్ణీత సమయంలో చెల్లిస్తే వాటిపై ఉన్న వడ్డీని పూర్తి స్థాయిలో మాఫీ చేయనున్నట్లు జీఓ వెలువరిచింది.
దీంతో అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు ప్రతి యేటా మున్సిపల్ పరిధిలోని మొండి బకాయిలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ల పేరిట విస్తృతంగా క్యాంప్‌లను నిర్వహించి మొండి బకాయిల గుట్టను సాధ్యమైనంత వరకు తగ్గించిందనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణ సముదాయాలు, నివాస గృహాలకు సంబంధించి మొండి బకాయిలు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రతి యేటా సిబ్బందికి బకాయిల వసూళ్లు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.