335 అడుగుల లోతులో రైల్వేస్టేషన్!
బీజింగ్: 2022 శీతాకాలపు ఒలింపిక్స్ ను నిర్వహించనున్న చైనా ఏర్పాట్లలో భాగంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కింద హై స్పీడ్ రైల్వేస్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే బద్లింగ్ ప్రాంతంలో స్టేషన్ ను నిర్మిస్తామని చైనా ప్రకటించింది. భూమిపై భాగం నుంచి 335 అడుగుల లోతులో ఐదు ఫుట్ బాల్ మైదానాల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ నిర్మాణం ఉంటుందని చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
స్టేషన్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే భూ అంతర్భాగంలో ఉన్న అతి పెద్ద రైల్వేస్టేషన్, అతి పెద్ద హైస్పీడ్ రైల్వేస్టేషన్ గా పేరుగాంచుతుందని పలు పేపర్లు పేర్కొన్నాయి. మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ రైల్వేస్టేషన్ నుంచి బీజింగ్, ఝాంజియాకో నగరాలకు రైళ్ల మార్గాలను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనే చైనా శీతాకాలపు ఒలింపిక్స్ ను నిర్వహించనుంది. కాగా, రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని 2019కల్లా పూర్తి చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది.