చైనాకు వెళ్లిన హైదరాబాదీ గుండెపోటుతో..
చైనా నుంచి మృతదేహం తెప్పించండి
ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం వెళ్లి గుండెపోటుతో
మరణించిన నగరవాసి బాలన్ వెల్లా
మృతదేహం తెప్పించేందుకు అయ్యే ఖర్చును
ప్రభుత్వమే భరించాలంటూ వేడుకోలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం చైనాకు వెళ్లి గుండెపోటుతో మరణించిన నగరానికి చెందిన బాలన్ వెల్లా మృతదేహన్ని తెప్పించేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అతని కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జెజ్లాంగ్ ప్రావిన్స్‌లోని తైజువాలో ఈ నెల 15న బాలన్ వెల్ల మృతిచెందినట్లు చైనాలోని భారత రాయభార కార్యాలయం అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మృతదేహన్ని భారత్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని, అయితే కార్గోలో తీసుకొచ్చేందుకు రూ.7,50,000 ఖర్చవుతుందన్నారు. ఆ ఖర్చును భరించే స్థోమత తమకు లేదని తెలిపారు. ప్రభుత్వం మృతదేహన్ని నగరానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్ డై, స్టూల్ డై పనులు చేసే బాలన్ వెల్లా కుటుంబం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బోయిన్‌పల్లిలోని స్వాతినికేతన్ అపార్ట్మెంట్లో ఉంటోంది.
ఇటీవల చైర్ డై, స్టూల్ డైకు సంబంధించిన మోల్డ్ కొనుగోలు చేసేందుకు వెళుతున్న ఢిల్లీకి చెందిన వ్యాపారుతో కలిసి బాలన్ వెల్లా ఈ నెల7న చైనా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారని, గుండెపోటుతో ఈ నెల 15న మరణించాడని భారత రాయభార అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. మృతుడికి భార్య శ్యామల, కుమారుడు, కుమార్తె ఉన్నారు.