Beef dispute
-
అధికారానికి మతాన్ని వాడుకోవద్దు
రాష్ట్రపతి ప్రణబ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను రాజేసిన బీఫ్ వివా దం నేపథ్యంలో.. విద్వేష ప్రసంగాలను, భయోత్పాతం సృష్టించటా న్ని అంతం చేయాలని.. కొందరు వ్యక్తుల అధికార దాహాన్ని తీర్చుకునేందుకు మతాన్ని ముసుగుగా వాడుకోరాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ఈ నెల పదో తేదీ నుంచి జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో చరిత్రాత్మక పర్యటనకు వెళ్లనున్న ప్రణబ్ గురువారం జోర్డాన్ టైమ్స్, అల్ ఘాద్ పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘సహనం, సహజీవనం మన నాగరికత మూలసూత్రాలు. మన విలువలు మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. మనం సంయమన గళాన్ని పెంపొందించాలి’’ అని అన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడ్డ ఉగ్రవాదులు అనే తేడా చూపుతూ కొన్ని దేశాలు అనుసరిస్తున్న చీలికల, పక్షపాతవిధానం విఫలమైందన్నారు. ఉగ్రవాదమనే విపత్తును సమగ్రమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారంతోనే తిప్పికొట్టగలమన్నారు. మధ్య ప్రాచ్యంలో అస్థిరత కారణంగా ప్రపంచంలో ఉగ్రవాదం పెరుగుతుండటంపై భారత్ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద సవాలును ఎదుర్కొనేందుకు భారత్ సమగ్ర విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎదుర్కొంటోం దన్న జోర్డాన్ రాజు అబ్దుల్లా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానంటూ.. దానిని అంతే తీవ్రతతో ఎదుర్కోవటం తప్పనిసరి అని అన్నారు. -
బీఫ్ ఫెస్టును సమర్థించినందుకే...
కేరళ విద్యా సంస్థల్లో బీఫ్ వివాదం ముదురుతోంది. ఓ కాలేజీలో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులను సమర్థించిన మహిళా ప్రొఫెసర్... వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ప్రొఫెసర్ దీపా నిశాంత్ ఖండించింది. శ్రీ కేరళ వర్మ కాలేజీ ప్రాంగణంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గో మాంసంతో విందు చేసుకోవడంతో యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడం.. విద్యార్థి సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అఖిల భారత విద్యా పరిషత్, రైట్ వింగ్ విద్యార్థి సంఘాల పిర్యాదు మేరకు కాలేజీ యాజమాన్యం... విద్యార్థులకు సపోర్ట్ చేసిన మలయాళం ప్రొఫెసర్ దీపా నిశాంత్ పై విచారణ ప్రారంభించింది. కేరళ వర్మ కాలేజీలో బీఫ్ వాడకం.. రాష్ట్రంలోని పలు కళాశాలల్లో నిరసనలకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలు వ్యతిరేకించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అయితే కాలేజీ యాజమాన్యం... విద్యాలయాన్ని దేవాలయంగా ట్రీట్ చేస్తున్నారు అని, దేవాలయాల్లోని ధార్మిక పద్ధతులను పాటించాల్సిన అవసరం విద్యా సంస్థలకు లేదని ప్రొఫెసర్ దీపా నిశాంత్ ఫేస్ బుక్ లో తన కామెంట్ ను పోస్ట్ చేశారు. విద్యా సంస్థలు మతపరమైన నియమాలను అనుసరించకూడదని, ఇప్పుడు మాంసాన్ని నిషేధించిన వారు.. మరోసారి ఏకంగా రుతుక్రమ సయంలో మహిళలు, వెనుకబడిన తరగతుల ప్రవేశాన్నీ నిషేధిస్తారని నిశాంత్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ వర్మ కాలేజీలో పరిపాలన విభాగం కూడ శబరిమళ ఆలయం నిర్వహిస్తోంది. అయితే శబరిమళ ఆలయంలో రుతు క్రమంలో మహిళల ప్రవేశం పూర్తి నిషిద్ధం అని.. కాలేజీ ప్రాంగణంలో అయ్యప్ప దేవాలయం ఉందని, బీఫ్ ఫెస్టివల్ నిర్వహణను నిషేధించడానికి అదో కారణమని దీపా నిశాంత్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా 1947 లో కళాశాల ప్రారంభించినప్పటినుంచీ ప్రాంగణంలో మాంసాహారం నిషేధాన్ని పాటిస్తున్నారని, నిబంధనలకు అనుగుణంగా తాము కూడ కాలేజీలో మాంసాహార వంటకాలను అందించడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ లత చెప్తున్నారు. నేను సోషల్ మీడియా ఎంతో శక్తి వంతమైనదని నమ్మాను. అందుకే నా వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాను. విద్యార్థులు సామాజిక మీడియా వినియోగదారులు నన్ను సమర్థించారు అంటున్నారు దీపా నిశాంత్. ఇప్పుడు దీపా పోస్ట్ కు ఫేస్ బుక్ లో సుమారు అరవై వేలమంది అనుచరులు కూడ ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా కేరళలో భారతీయ జనతా పార్టీ మాత్రం గొడ్డు మాంసం వినియోగంపై నిశ్శబ్దంగా ఉంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మురళీ ధరన్ ఇప్పటివరకూ రాస్టంలో గోవధ నిషేధంపై ఎటువంటి స్టాండ్ తీసుకోలేదని చెప్పారు. గోవధను కేరళలో నిషేధించలేదని, అక్కడ అదే ప్రసిద్ధ వంటకంగా ఉందని ప్రొగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రెటరీ కవితా కృష్ణన్ అంటున్నారు. చవక ధరలో అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే పోషకాహారం కూడ అని ఆమె చెప్తున్నారు.