భెల్ గయా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ భెల్ పరిశ్రమ మూతపడనుంది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటనతో ఈ విషయం రూఢీ అయింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా నష్టాలు చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ మూసివేతకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇదంతా తెలిసినా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు కనీసం స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో నెలూరు, చిత్తూరు జిల్లాల్లోని నిరుద్యోగులు, రియల్టర్లతో పాటు పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల గుండెలు గుభేల్మంటున్నాయి.
వెంకటగిరి: నెల్లూరు, చిత్తూరు జిల్లా వాసుల బతుకుతెరువు ప్రాజెక్ట్ మన్నవరం భెల్. వెంకటగిరి ప్రాంత అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతాయని ఆశించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎందరో ఆశలను వమ్ము చేస్తూ.. కలలను కల్లలు చేస్తూ మూతపడే దశకు చేరుకుంది. 2010 సెప్టెంబర్ 1వ తేదీన అప్పటి భారతప్రధాని మన్మోహన్సింగ్ వెంకటగిరి సమీపంలోని చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సంయుక్తగా నిర్మించే ఎన్బీపీపీఎల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ సాధనకు ఎంతో కృషి చేశారు. దురదుష్టవశాత్తు ఆయన అకాలంగా కాలం చేయడంతో ప్రారంభానికి కొంతకాలం జాప్యం జరిగింది. వైఎస్సార్ కలలను సాకారం చేసేందుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆయన స్మారకంగా మన్నవరానికి వైఎస్సార్పురంగా నామకరణం చేసి ఆ ప్రాజెక్ట్‌ను కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు తరలిపోతుందని రెండేళ్ల క్రితం వదంతులు వచ్చాయి. దీంతో అప్పట్లో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు స్పందించి ప్రాజెక్ట్‌ను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ స్వరూపం ఇదీ
విద్యుత్ ఉపకరణాల పరిశ్రమ అయిన ఎన్‌బీపీపీఎల్‌ను రూ.6000 కోట్లతో నిర్మించాలని అప్పట్లో అంచనా వేశారు. ఈ పరిశ్రమ ద్వారా 6వేల మందికి ఉద్యోగావకాశం కల్పించాలనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా మరో 400 చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ద్వారా సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావించారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే ఉపకరణాలు తయారు కాకపోవడం వల్ల మార్కెటింగ్ లక్ష్యం నీరుగారిపోయింది. ఈ పరిశ్రమను రూ.6000 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వినియోగించే టర్బయిన్లు, బాయిలర్లతో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్‌పీ) వాటర్ సిస్టంను తయారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం రూ.130 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్‌లో హైడ్లర్ రోలర్లు మాత్రమే తయారు చేయడం వల్ల తగినంత వార్షిక ఆదాయం సాధించలేక నష్టాల్లో కూరుకుపోయింది. సుమారు 763.85 ఎకరాల్లో ఏర్పాటు కావాల్సిన భారీ పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్ధాంతరంగా మూత పడిపోనుంది.
భూముల ధరలు భారీగా పతనం
2010 సంవత్సరంలో వెంకటగిరి సమీపంలోని మన్నవరం వద్ద భెల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుండటంతో అప్పట్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో ఎకరా రూ.కోటి వరకూ పలికింది. అనంతరం మన్నవరం భెల్ ప్రాజెక్ట్ తరలిపోతుందని, పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం లేదని సమాచారం అందడంతో ఒక్కసారిగా భూముల ధరలు బాగా తగ్గాయి. దీంతో రియల్ ఎస్టేట్ యజమానులు రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేసి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం భెల్ పరిశ్రమ పూర్తిగా మూతపడుతుందన్న సమాచారం. రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.