యాంటీ హిల్లరీ యాడ్‌పై అలజడి!
'డియర్ హిల్లరీ క్లింటన్.. బెంఘాజిలో సాయం కోసం చేసిన అరుపులను మీరెందుకు వినిపించుకోలేదని అడుగదలిచాను. అక్కడ నలుగురు అమెరికన్లు హత్యకు గురయ్యారు' అంటూ మంగళవారం రాత్రి సీఎన్ఎన్ చానెల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థుల చర్చ సందర్భంగా ప్రసారమైన వాణిజ్య ప్రకటన ఇప్పుడు అమెరికాలో తీవ్ర వివాదాస్పదమైంది. హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా ప్రసారమైన ఈ ప్రకటనపై మృతుల కుటుంబసభ్యలు నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
యాడ్‌లో ఏమున్నది?
లిబియా బెంఘాజిలోని అమెరికా కార్యాలయాలపై 2012లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సీఐఏ కాంట్రాక్టర్ గ్లెన్ డోహెర్టీ, అమెరికన్ రాయబారి క్రిష్టోఫర్ స్టీవెన్స్తోపాటు మరో ఇద్దరు అమెరికన్లు మరణించారు. వారు సాయం కోసం అభ్యర్థించిన.. అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో హిల్లరీ తీరును ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఆ దాడిలో చనిపోయిన నలుగురు వ్యక్తులు సమాధి నుంచి మాట్లాడుతూ.. క్లింటన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్న విధంగా వాణిజ్య ప్రకటనను రూపొందించారు. వర్జీనియాకు చెందిన స్టాప్ హిల్లరీ పాక్ సంస్థ ఈ యాడ్ ను రూపొందించింది.
ఈ యాడ్ ప్రసారమైన వెంటనే ట్విట్టర్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. చనిపోయిన వారి గంభీరమైన గొంతుతో, విషాదకరమైన నేపథ్య సంగీతంతో ప్రసారమైన ఈ యాడ్‌ను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చనిపోయిన నలుగురు వ్యక్తుల ఫొటోలను ప్రదర్శించడం, దానిని జాతీయవాదానికి ముడిపెట్టడం ఏమిటని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. బాధిత వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా ఈ యాడ్ ప్రసారమైన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులను రాజకీయ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకొని యాడ్ రూపొందించడమేమిటని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.