Bhainsa zone
-
భరోసా ఇచ్చినా.. తొలగని భయం!
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రెండు రోజులుగా పరిస్థితి మెరుగు పడింది. ఆదివారం జరిగిన అల్లరి మూకల దాడుల తర్వాత వదంతుల వ్యాప్తి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పోలీసులు భరోసా ఇచ్చినా.. వదంతులతో భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్ల ఘటనకు కారకులైన 55 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ స్థానికంగా ఆ సందడి కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నామని, ఎన్నికలయ్యే వరకూ భైంసాలో అదనపు బలగాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 240 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 150 మంది స్పెషల్ పోలీసులు, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు ప్రత్యేక బలగాలతో కలిపి 900 మంది బందోబస్తులో ఉన్నారు. ప్రతిరోజు భైంసాలో కవాతు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్ ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇస్తున్నారు. కర్ఫ్యూ, 144 సెక్షన్ ఎత్తివేసినప్పటికీ దుకాణాలు మాత్రం తెరుచుకోవడంలేదు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈనెల 22న జరిగే పోలింగ్‌పై ఈ ప్రభావం పడనుందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు గురువారం రాత్రి నిజామాబాద్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై సమీక్షించేందుకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
పేండ్‌పెల్లిలో మరో రైతు...
భైంసా/భైంసా రూరల్ : భైంసా మండలం పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన దేశెట్టి ఆనంద్‌బాబు(42) అనే రైతు అప్పులబాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. ఆనంద్‌బాబు తన తండ్రి పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమితోపాటు తన పేరిట ఉన్న మరో మూడు ఎకరాల భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా వరుస పంట నష్టాలు అతడిని అప్పుల్లోకి నెట్టివేశాయి. బ్యాంకులో రూ.75 వేలతోపాటు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 2.25 లక్షలమేర అప్పులు చేశాడు. ఏటా బాకీ తీరుతుందన్న భరోసాతోనే సాగు చేసేవాడు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో ఆనంద్‌బాబు మరింత ధైర్యం తెచ్చుకున్నాడు. ఎలాగో బ్యాంకు రుణం మాఫీ అయిపోతుందని కష్టపడి పంటలు పండిస్తే తెలంగాణలో మంచి ధరలు వస్తాయని ఆశగా నమ్ముకున్నాడు. జూన్ మొదటివారంలో అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి విత్తనాలు వేశాడు. సోయా పంట వేసేందుకు సన్నద్దమయ్యాడు. వేసవిలో దుక్కులు దున్ని భూములను సిద్ధంగా ఉంచాడు. పంట విత్తనం వేశాక వర్షాలు కురియలేదు. మొలకలు రాలేదు. మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయాయి. ఎంతో ఎదురుచూసి పూజలు చేసినా వరుణదేవుడు కరుణించడం లేదు. రెండవ మారు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియరాలేదు. నలుగురికి ధైర్యం చెప్పి... అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మదనపడుతున్న తన తోటివారికి ఆనంద్‌బాబు ధైర్యం చెప్పేవాడు. తనకూ అప్పులున్నాయని.. వ్యవసాయం చేసి తీరుస్తానంటూ ధైర్యంగా చెప్పేవాడు. కానీ ప్రస్తుతం తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక వారం రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు ఆదివారం ఇంటి వద్ద పశువుల పాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్‌బాబుకు భార్య చిట్టమ్మ, కుమారులు సాయికుమార్, ఉదయ్‌కుమార్ ఉన్నారు. పిల్లలిద్దరు చదువుతున్నారు. వయసు పైబడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు వీరి భారం భార్య చిట్టమ్మపై పడింది. భైంసా రూరల్ ఎస్సై గుణవంత్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.