భైంసా/భైంసా రూరల్ : భైంసా మండలం పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన దేశెట్టి ఆనంద్‌బాబు(42) అనే రైతు అప్పులబాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. ఆనంద్‌బాబు తన తండ్రి పేరిట ఉన్న ఐదు ఎకరాల భూమితోపాటు తన పేరిట ఉన్న మరో మూడు ఎకరాల భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా వరుస పంట నష్టాలు అతడిని అప్పుల్లోకి నెట్టివేశాయి. బ్యాంకులో రూ.75 వేలతోపాటు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 2.25 లక్షలమేర అప్పులు చేశాడు. ఏటా బాకీ తీరుతుందన్న భరోసాతోనే సాగు చేసేవాడు.
తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో ఆనంద్‌బాబు మరింత ధైర్యం తెచ్చుకున్నాడు. ఎలాగో బ్యాంకు రుణం మాఫీ అయిపోతుందని కష్టపడి పంటలు పండిస్తే తెలంగాణలో మంచి ధరలు వస్తాయని ఆశగా నమ్ముకున్నాడు. జూన్ మొదటివారంలో అడపాదడపా కురిసిన చిరుజల్లులకు పత్తి విత్తనాలు వేశాడు.
సోయా పంట వేసేందుకు సన్నద్దమయ్యాడు. వేసవిలో దుక్కులు దున్ని భూములను సిద్ధంగా ఉంచాడు. పంట విత్తనం వేశాక వర్షాలు కురియలేదు. మొలకలు రాలేదు. మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయాయి. ఎంతో ఎదురుచూసి పూజలు చేసినా వరుణదేవుడు కరుణించడం లేదు. రెండవ మారు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియరాలేదు.
నలుగురికి ధైర్యం చెప్పి...
అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మదనపడుతున్న తన తోటివారికి ఆనంద్‌బాబు ధైర్యం చెప్పేవాడు. తనకూ అప్పులున్నాయని.. వ్యవసాయం చేసి తీరుస్తానంటూ ధైర్యంగా చెప్పేవాడు. కానీ ప్రస్తుతం తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక వారం రోజులుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చివరకు ఆదివారం ఇంటి వద్ద పశువుల పాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆనంద్‌బాబుకు భార్య చిట్టమ్మ, కుమారులు సాయికుమార్, ఉదయ్‌కుమార్ ఉన్నారు. పిల్లలిద్దరు చదువుతున్నారు. వయసు పైబడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు వీరి భారం భార్య చిట్టమ్మపై పడింది. భైంసా రూరల్ ఎస్సై గుణవంత్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పేండ్‌పెల్లిలో మరో రైతు...
Published Mon, Jul 7 2014 12:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement