ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!
ఐదు వేల వస్తువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టి రావడానికి కనీసం రెండు గంటల సమయం కావాలి. పదిహేడు దేశాలను ఒక్క చోట ప్రతిక్షేపించిందీ మ్యూజియం. అందులో మన దేశమూ ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మనదేశంలో చూడలేకపోయిన బౌద్ధక్షేత్రాల ప్రతీకలను ఇక్కడ చూద్దాం.
ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం... శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది. క్యాండీలోని నేషనల్ మ్యూజియం భవనంలోనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యూజియంలో శ్రీలంక, ఇండియా, జపాన్, చైనా , భూటాన్ దేశాలతోపాటు మొత్తం 17 దేశాల బౌద్ధ విశేషాలున్నాయి. ఇండియా గ్యాలరీ ఏర్పాటు బాధ్యతలను మన విదేశీ వ్యవహారాల శాఖ పూర్తి చేసింది. నిర్వహణ బాధ్యతను పదేళ్ల కిందట ‘శ్రీ దలాడ మలిగవ’కు అప్పగించింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం ఇది. బౌద్ధానికి చెందిన ఫొటోలు, శిల్పాలు, ప్రతీకాత్మక శిల్పాలు, చిత్రాలు, నేషనల్ మ్యూజియంలో క్యాండీ రాజులు (17,18 శతాబ్దాల నాటివి) ఉపయోగించి ఆయుధాలు, ఆభరణాలు, దైనందిన జీవనం ఉపయోగించిన వస్తువులు, చారిత్రక శకలాలు... అన్నీ కలిసి ఐదు వేలకు పైగా ఉంటాయి. క్యాండీ రాజ్యం 1815లో బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రతిని కూడా చూడవచ్చు. మ్యూజియంలోపల బ్రిటిష్ ఆనవాళ్లు మరేవీ కనిపించవు. కానీ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పని చేసిన సిలోన్ గవర్నర్ సర్ హెన్రీ వార్డ్ విగ్రహం ఉంది.
తెలుగు– సింహళ బంధం
ఇండియా విభాగంలో మన అమరావతి బౌద్ధ స్థూపం నమూనా కూడా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బౌద్ధం విలసిల్లిందని చెప్పడానికి దోహదం చేసే ఆధారాలను, ఆనవాళ్లను చూడవచ్చు. సాంచి స్థూపం నమూనా, సారనాథ్ స్థూపం దగ్గర అశోకస్తంభం మీద గర్జించే సింహం నమూనా శిల్పం, ఎల్లోరా గుహలు వాటిలోని శిల్పాలు, అజంతా గుహలు– అందులోని వర్ణ చిత్రాలు, అశోకుని ధర్మచక్రం, మనం జాతీయ చిహ్నం నాలుగు సింహాల ప్రతిమలను చూడవచ్చు. ఇంకా... చైనా బుద్ధుని విగ్రహాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిగిలిన అన్ని దేశాల బుద్ధుడి ప్రతిమల్లోనూ ఏకరూపత ఉంటుంది.
కానీ చైనా బుద్ధుడు భిన్నంగా ఉంటాడు. పెంగ్షుయ్ వాస్తులో భాగంగా లాఫింగ్ బుద్ధ మనకు పాతికేళ్ల కిందటే పరిచయమై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని బుద్ధుడిగా స్వీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడమన్నమాట. ఇక ఆశ్చర్యంతోపాటు ఒకింత అయోమయానికి గురి చేసేది భవిష్యత్తు బుద్ధుడి ఊహాశిల్పం. ఆ బుద్ధుడు మల్టీటాస్కింగ్‌కి ప్రతీకగా ఉంటుందా శిల్పం. మ్యూజియంతోపాటు ఈ భవనంలోనే కొన్ని గదుల్లో సావనీర్ విభాగం ఉంది. శ్రీలంక గుర్తుగా కప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నట్ల వంటివి చాలా రకాలున్నాయి.
అప్పటి అతిథిభవనం!
ఈ మ్యూజియం రెండస్థుల భవనం. మ్యూజియంగా మార్చకముందు ఈ భవనం గెస్ట్‌హౌస్‌గా రాజ్యాతిథుల విడిదిగా ఉండేది. రాణివాస మహిళలకు కూడా కొంతకాలం ఇందులో నివసించినట్లు చెబుతారు. క్యాండీ రాజ్యం ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి సగౌరవంగా అభివాదం చేయాల్సిందే. మ్యూజియం భవనం, యునెస్కో గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్ టూత్ రిలిక్ టెంపుల్, రాజుల ప్యాలెస్‌లు ఒకే క్లస్టర్లో ఉంటాయి.
– వాకా మంజులారెడ్డి
(చదవండి: ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!)