కమలా హారిస్‌కు అండాదండా ఆమే!
Laurene Powell Jobs: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకున్నాక ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కొంటున్న కమలా హారిస్ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగుతోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హారిస్‌పై నమ్మకం నిలుపుకున్న ఏకైక వ్యక్తి లారెన్ పావెల్ జాబ్స్. వాళ్లది 20 ఏళ్ల స్నేహం. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన కాలం నుంచి ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగడం దాకా హారిస్‌కు చోదకశక్తిగా ఉన్నది లారెన్ పావెల్ అని చాలా మందికి తెలీదు. హారిస్‌కు ఆర్థిక, హార్దిక బలమూ ఆమే. ఆడదానికి ఆడదే శత్రువనే మూస ప్రచారాలను వెనక్కు నెట్టి ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల మరెంతో మంది మహిళలకు బాసటగా నిలుస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళిద్దరి స్నేహం.ఎవరీ లారెన్ పావెల్? 60 ఏళ్ల లారెన్ పావెల్ జాబ్స్... ఎమర్సన్ కలెక్టివ్ అనే దాతృత్వ, పెట్టుబడి సంస్థ వ్యవస్థాపకురాలు. ది అట్లాంటిక్ మేగజైన్లో పెద్ద వాటాదారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి ఈమె. పావెల్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఇక్కడే 1989లో స్టీవ్ జాబ్స్‌ను కలిశారు. 1991లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు రీడ్, ఎరిన్, ఈవ్. స్టీవ్‌జాబ్స్ మరణానంతరం ఆపిల్, డిస్నీ సంస్థల్లో వాటాలను ఆమె వారసత్వంగా పొందారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, పావెల్ ప్రస్తుత నికర విలువ 11.5 బిలియన్ డాలర్లు. ఆమె సిలికాన్ వ్యాలీలో అత్యంత సంపన్న మహిళగా పేరొందారు.హారిస్, లారెన్ స్నేహం.. ప్రజాజీవితం గడుపుతూ రాజకీయాలు, కళలు, సంస్కృతి పట్ల ఇద్దరూ ఒకే అభిరుచి కల్గిఉండటం ఇద్దరినీ స్నేహితులుగా మార్చింది. హారిస్‌కు నిధులు, సలహాలు అందించడమే కాకుండా ప్రజల్లో ఆదరణ పెరగడానికి లారెన్ దోహదపడ్డారు. లారెన్ కొన్నేళ్లుగా డెమొక్రటిక్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారు. 2020 నుంచి డెమొక్రటిక్ నామినీలకు, పార్టీకి దాదాపు రూ.29 కోట్ల విరాళం ఇచి్చనట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన సమయం నుంచే లారెన్.. హారిస్ వెన్నంటి ఉన్నారు. ఆ సమయంలో పావెల్ 500 డాలర్లు విరాళం ఇచ్చారు.తర్వాతి ఏడాది బే ఏరియాకు చెందిన ఇతర మహిళా నాయకులతో కలిసి వాషింగ్టన్లో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ ఉమెన్స్ లైవ్స్’లో ఇద్దరూ పాల్గొన్నారు. హారిస్ కోసం లారెన్ అనేక నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. గత ఏడాది కమల ప్రచారానికి ఆమె దాదాపు రూ.8.37 కోట్ల విరాళాలు ఇచ్చారు. 2017లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి లారెన్‌ను ప్రశ్నించగా.. ‘‘నా ఓటు హారిస్‌కే’ అంటూ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న తన స్నేహితురాలు హారిస్‌ను చూపించారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న చీలికలుహారిస్ను తెరపైకి తెచ్చి.. వాస్తవానికి జూన్‌లో బిగ్ డిబేట్ తర్వాత ప్రభ కోల్పోయిన బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించడానికి తెరవెనుక నుంచి లారెన్ పనిచేశారని అప్పట్లో వదంతులు వినిపించాయి. డిబేట్లో బైడెన్ పేలవ ప్రదర్శన చూశాక ట్రంప్‌ను ఓడించలేమేమో అని డెమొక్రటిక్ పార్టీ ప్రధాన దాతల వద్ద లారెన్ అభిప్రాయం వ్యక్తించేశారని వార్తలొచ్చాయి. పోటీలో కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టడంతో హారిస్ సలహాల కోసం లారెన్‌ను సంప్రదించినట్లు సమాచారం. హారిస్‌కు మద్దతుగా ఇతర మహిళా టెక్ నాయకుల మద్దతు కూడగట్టే బాధ్యతను లారెన్ తన భూజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ గెలిస్తే డెమొక్రాట్ల పాలనలో లారెన్ ఏదైనా పాలనా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారిక పదవిలో లేకపోయినా ‘ఇన్సైడర్’గా ఉంటారని తెలుస్తోంది.