కుంగ్ ఫూ బ్రదర్స్
♦ ఆత్మరక్షణకు నేర్చుకుని.. శిక్షకుల స్థాయికి ఎదిగిన సోదరులు
♦ మరిన్ని మెలకువల కోసం చైనా వెళ్లిన ‘నర్సాపూర్’వాసులు
నర్సాపూర్: ఒకప్పుడు ఆత్మ రక్షణ కోసం నేర్చుకున్న విద్యే.. ఇప్పుడు ఆ సోదరులను హీరోల్ని చేసింది. ప్రస్తుతం కుంగ్‌ఫూలో శిక్షణ ఇవ్వడమే వృత్తిగా పెట్టుకుని మాస్టర్లుగా స్థిరపడ్డారు. ఈక్రమంలో బ్లాక్‌బెల్ట్‌లో పలు డిగ్రీలు పొందారు నర్సాపూర్‌కు చెందిన పాముల శ్రీనివాస్, పాముల వినోద్. వీరిద్దరు 1994లో నిజామాబాద్‌కు చెందిన భూంరెడ్డి మాస్టర్ వద్ద కుంగ్ఫూను నేర్చుకోనారంభించారు. ప్రతిభ కనబరచడంతో సోదరులను మాస్టర్లుగా ఎదగాలని భూంరెడ్డి సూచించారు. దీంతో కుంగ్‌ఫూలో బ్లాక్‌బెల్టు సాధించి నర్సాపూర్‌తో పాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, పుల్కల్, సంగారెడ్డిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచే శారు.
ప్రాక్టీస్‌తో ఉన్నత స్థితి
శిక్షణ కేంద్రంలో చేరినవారికి శిక్షణ ఇస్తూనే ఇన్నదమ్ములు ప్రాక్టీస్ చేస్తున్నారు. పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. గత ఏడాది నవంబరులో ముంబైలో యూఎస్ గ్రాండ్ మాస్టర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ డిష్ కుంగ్‌ఫూ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో అన్నదమ్ములు కుంగ్‌ఫూలో బ్లాక్‌బెల్టు విభాగంలో అవార్డులు పొందారు. శ్రీనివాస్ కుంగ్‌ఫూలో బ్లాక్బె ల్ట్ 9వ డిగ్రీ, వినోద్ 8వ డిగ్రీ కైవసం చేసుకున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు సైతం ముంబై జరిగిన పోటీల్లో అవార్డులు సాధించారు. 9వ డిగ్రీ సాధించిన శ్రీనివాస్‌కు సీనియర్ కరాటే మాస్టర్ చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో సర్టిఫికెట్ అందజేశారు.
ఇటీవల చైనాకు పయనం
కుంగ్‌ఫూలో మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు అన్నదమ్ములు ఇటీవల చైనాకు వెళ్లారు. తమ వద్ద కుంగ్‌ఫూ చేర్చుకొని బ్లాక్ బెల్టులో 4వ డిగ్రీ పొంది.. మాస్టర్‌గా స్థిరపడిన డి.సుబ్బు సైతం చైనా వస్తున్నాడని చెప్పారు. చైనాలో షావోలిన్ టెంపుల్ ఏరియాలో కుంగ్‌ఫూలోని క్వాన్దావ్, రోప్డాట్ తదితర వెపన్స్, ఇతర విద్యలు నేర్చుకుంటామని, 15 రోజుల పాటు అక్కడే ఉంటామని కుంగ్‌ఫూ బ్రదర్స్ చెప్పారు.