B.Matam
-
మొబైల్ ఫోన్ పేరుతో మోసం
– రూ.16వేలు విలువ చేసే మొబైల్ ఫోన్ రూ. 4500కే మీ సొంతం అంటూ మెసేజ్ - పార్సిల్ విప్పి చూస్తే అందులో రూ.50 విలువ చేసే బొమ్మలు బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో హెచ్ఆర్ఏగా పనిచేస్తున్న ఎస్.గౌస్‌పీర్ తన మొబైల్ ఫోన్లో కొత్తగా వొడాఫోన్ సిమ్‌ను వేసుకొన్నాడు. వేసుకొన్న మరుక్షణమే ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో రూ.16వేలు విలువ చేసే స్యామ్సంగ్ మొబైల్ ఫోన్ కేవలం రూ.4500కే వస్తుందని ఉండటంతో ఆశపడిన గౌస్‌పీర్ కుటుంబ సభ్యులు ఆన్లైన్లో బుక్ చేశారు. గురువారం స్థానికంగా ఉన్న పోస్టల్ ఉద్యోగి పార్సిల్‌ను తీసుకొని వచ్చి ఇచ్చి రూ.4500 డబ్బు తీసుకున్నాడు. సెల్ ఫోన్ వచ్చిందనే ఆశతో ఆ పార్సిల్‌ను తెరచి చూడగా అందులో రెండు చిన్న బొమ్మలు ఉన్నాయి. వాటి విలువ రూ.50 ఉంటుంది. బిత్తర పోయిన గౌస్‌పీర్ కుటుంబ సభ్యులు రూ.4500 డబ్బులు తిరిగి ఇస్తారా అని పోస్టుమాస్టర్‌ను అడిగారు. పార్సిల్ ఇవ్వడమే తమ డ్యూటీ అని తిరిగి డబ్బులు వెనక్కు ఇవ్వలేమని చెప్పడంతో లబోదిబోమన్నారు. కాగా, ఆ పార్సిల్ దిల్లీ నుంచి శివ ఎంటర్ ప్రైజస్ పేరుతో వచ్చింది. -
యువకుడి హత్య - మరో వ్యక్తిని తగులబెట్టారు
కడప: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలలో రెండు హత్యలు జరిగాయి. ఒక యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేయగా, మరో ఘటనలో ఒక వ్యక్తిని హత్య చేసి తగులబెట్టారు. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దొడ్ల డైయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. కొందరు దుండగులు యువకుడి గొంతును కత్తితో కోసేశారు. దాంతో యువకుడు దుర్మరణం చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఈపురుపాలెం స్ట్రైట్‌కట్ వద్ద మరో హత్య జరిగింది. కొందరు దుండగులు ఒక వ్యక్తిని చంపేసి, ఆ తరువాత తగులపెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ మొదలు పెట్టారు.