Buddha
-
హాలీడే టూర్ : బుద్ధుని చెంత ప్రశాంతంగా బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు (ఫోటోలు)
-
దానంలో ఘటికుడు
పూర్వం కశ్యపు బుద్ధుని కాలంలో వేగళింగ అనే నగరం ఉండేది. అ నగర శివారులో ఘటికారుడు అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి జ్యోతిపాలుడు అనే మిత్రుడు ఉండేవాడు. అప్పుడు ఆ ్రపాంతాన్ని కికీలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఘటికారుడు కశ్యప బుద్ధుని ఉపాసకుడు. కశ్యపుని ధర్మ ప్రబోధాలు విని ధార్మికంగా జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేయడానికి కావలసిన మట్టిని పలుగు పారలతో తవ్వి తీసేవాడు కాదు. క్రిమికీటకాలు తన పలుగు కింద పడి చనిపోతాయని. ఎలుకలు తవ్విపోసిన మట్టిని మాత్రమే తీసుకుని పోయి కుండలు చేసేవాడు. ఆ కుండల్ని కూడా ఎక్కువ ధరకు అమ్మేవాడు కాదు. వాటిని ఆరుబయట ఉంచేవాడు. కావలసిన వాళ్లు కుండల్ని తీసుకుని అక్కడ ఉంచిన గంపల్లో తాము చెల్లించాల్సిన ధరకు సరిపడే ధనాన్ని గానీ, నూకల్ని గానీ, ధాన్యాన్ని గానీ ఉంచి వెళ్ళేవారు. అలా... నిజాయితీగా, ధర్మబద్ధంగా తాను జీవిస్తూ అందరూ జీవించాలని కోరుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఆలనా ΄ాలనా చూసేవాడు. వారు కూడా ధార్మికులే. ఇతరులు లేని సమయంలో ఎవరైనా భిక్షువులు గానీ, యోగులుగానీ భిక్షకు వస్తే...‘‘అయ్యా! మేము ఇద్దరం గుడ్డివాళ్ళం. లేవలేని ముసలివాళ్ళం. అదిగో ఇంట్లో ఉట్టిమీద ఆహారం ఉంది. మీకు కావలసినంత మీరే తీసుకోండి. మేము ఇచ్చే భిక్షగా భావించండి’’ అనేవారు. ఒకరోజున కికీలుడు తన రాజభవనం ముందు నిలబడ్డాడు. అటుగా కశ్యపబుద్ధుడు తన శిష్యగణంతో వెళ్తున్నాడు. కికీలక మహారాజు వారి ముందుకు వచ్చి నమస్కరించి– ‘‘భగవానులు మమ్ము అనుగ్రహించాలి. భిక్షుసంఘంతో వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి’’ అని వేడుకున్నాడు. ‘‘లేదు మహారాజా! నేను వేరొకరికి మాట ఇచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరికి భగవాన్? నేను ఈ దేశానికి రాజుని. ప్రభువుగా వెళ్ళి వారిని అర్థిస్తాను. ఈరోజు ఆ అవకాశం నాకు ఇవ్వమంటాను. మరోమారు వారిని తీసుకోమంటాను’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! ఈ రోజు నేను వారి ఇంటనే భిక్ష స్వీకరించాలి’’ అని ముందుకు నడిచాడు. భిక్షుగణం ఊరి చివరకు వెళ్ళింది. అప్పటికే పట్టిన మబ్బుల్నుండి సన్నని చినుకులు రాలుతున్నాయి. భిక్షు సంఘం వెళ్ళేసరికి... ఘటికారుని పూరి΄ాక మీద పరచిన ఎండు గడ్డిని తీసివేసి కట్టలు కట్టారు. ఆ కట్టల్ని ఎవరో మోసుకుపోతున్నారు. గడ్డి తీయడంతో పాక మీద ఖాళీలు కనిపిస్తున్నాయి. కశ్యప బుద్ధుణ్ణి వారు గౌరవంగా ఇంటి వసారాలోకి ఆహ్వానించారు. ఆ చూరు కిందే కూర్చుని పచ్చడి మెతుకుల భిక్ష స్వీకరించారు. వర్షం పెరిగింది. తడుస్తూనే ధర్మోపదేశం చేశాడు కశ్యపుడు. ఘటికారుడు కశ్యపునికి పాదాభివందనం చేశాడు. భిక్షాగణం తిరిగి బయలుదేరింది. దారిలో చెట్టుకింద కికీలమహారాజు కనిపించాడు. ‘‘చూశావా! మహారాజా! ఘటికారుడు ఎంతటి దానపరుడో! ఎవరో గడ్డి అడిగారు. తన దగ్గర లేదు. అయినా తన ఇంటి మీద పరచిన గడ్డిని తీసి దానం చేశాడు. అతను మహాదాత. అతని భిక్ష స్వీకరించడం మాకు ఎంతో సంతోషం’’ అంటూ ముందుకు కదిలాడు. తాను సమర్పించే గొప్ప భోజనాన్ని కాదని, పూరిగుడిసెలో పచ్చడి మెతుకుల కోసం కశ్యపు బుద్ధుడు ఎందుకు వెళ్ళాడో రాజుకి అర్థమైంది. తనకంటే ఘటికారుడే గొప్పవాడని గ్రహించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నవ్వుతున్న బుద్ధుడు..
‘రమణీ, ఈరోజైనా వెళ్లిన పనయిందా ?’ రాంబాబు ఇంటిలోకి వస్తూనే భార్యను అడిగాడు. లక్షలు పెట్టి కొన్న షేర్లు వేలకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ కళ్ళల్లో కనపడే దిగులు రమణి ముఖంలో తారాటలాడింది. ‘ఆ..ఆ.. అర్థమయిందిలే! ఇవ్వాళ కూడా నీ అన్వేషణ ఫలించలేదన్నమాట.’ ‘అవునండీ.. ఒక చోట ఉన్నవి మరోచోట లేవు, పిచ్చెక్కిపోతోంది. ఇలా చూస్తుండగానే వాడికి మూడో ఏడు తగులుతుంది.’‘నా మాట వినవే.. ముందు మన ఇంటి దగ్గరలో చేరుద్దాం, కాస్త పెద్దయిన తరువాత నువ్వు చెప్పినట్టు చేద్దాం’ అంటూనే సడన్‌గా ఆపేశాడు. చెవులు రిక్కించాడు.. ఖర్, ఖర్.. ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు.. అది రాంబాబు చెవులకు బాగా పరిచితమైన చప్పుడే.. భార్యా(ర)మణి పళ్లు కొరుకుతోంది. ‘నీకో దండం పెడతా! అలా నమలకే! పళ్ళు అరిగిపోతాయి. నీకు నచ్చినట్లే చేద్దాంలే. రేపయినా నీ వేట పూర్తి చెయ్యి.’రాంబాబు ఎమ్సీఏ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే 7 గంటలకు క్యాబ్ వస్తుంది. దాంట్లో వెళ్ళి రాత్రి పదిగంటలకు వస్తాడు. మంచి జీతం. మేనమామ కూతురు, రమణిని పెళ్లి చేసుకున్నాడు. రమణి ఇంటర్ చదివింది. ఎమ్సెట్ రాస్తే ఆరంకెల ర్యాంకు వచ్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాసింది. ఈసారీ ఆరంకెలే. అందులోనూ ఇంకాస్త గరిష్ఠ సంఖ్య. ‘ముచ్చటగా మూడోసారి రాయనా’ అనబోయి, వాళ్ళ అమ్మ చేతిలో అట్లకాడ చూసి నోరు మూసింది. మూసే ముందు, ప్రపంచంలో ఇంజినీరింగ్ తప్ప నేను చదవగలిగే కోర్సేదీ లేదని తేల్చి మరీ.. మూసింది. ఇక ఎన్ని చెప్పినా లాభం లేదని పెళ్లి చేశారు.ఆ పెళ్లి జరగడానికి రమణి వాళ్ళ అమ్మమ్మ తనదైన శైలిలో చెప్పిన సెంటిమెంటు డైలాగులు కూడా ఇతోధికంగా సాయపడ్డంతో చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ.. రమణి పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. అయినా రాంబాబంటే రమణికీ ఇష్టమే. రాంబాబుకు మరదలన్నా, ఆమె అమాయకత్వమన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇంటిపని, వంటపనిలో మంచి నైపుణ్యం ఉంది. రాంబాబుకు ఉద్యోగం చేసే అమ్మాయి కాకుండా ఇల్లు దిద్దుకొనే అమ్మాయినే చేసుకోవాలని వ్యక్తిగత అభిప్రాయం. ఇద్దరూ ఉదయం నుండి రాత్రి దాకా జాబులు చేస్తే వచ్చే డబ్బులు చూసి మురవడం తప్ప, సంసారంలో సారం ఉండదంటాడు. స్వతహాగా రమణి మంచిదే. మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనేది మనసులో తీరని కోరికలాగా ఉండిపోయింది. అంతే! ఎలాగైనా టాప్ కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనే తన లక్ష్యం నెరవేరకుండా పెళ్లి పేరుతో అడ్డుకున్నందుకు అమ్మమ్మను కసితీరా శపించింది. ఆ శాపం తగిలి రమణి పెళ్లయి ఏడాది తిరక్కుండానే, మనవడికి తన పేరు పెట్టాలని ఒట్టు పెట్టించుకొని మరీ బాల్చీ తన్నేసింది.రమణి.. రాంబాబును కూడా శపించేదే, కానీ ‘మనకు పుట్టబోయే బిడ్డను అక్కడా ఇక్కడా ఏం ఖర్మ.. ఐఐటీలోనే చదివించి నీ కోరిక తీర్చుకుందువుగాని’ అన్న సలహా పుణ్యమాని వదిలేసింది. ఆ సలహా వల్ల భవిష్యత్‌లో వచ్చే ఉత్పాతాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు రాంబాబు.కాస్త ఆలస్యంగానైనా, రమణి వాళ్ల అమ్మమ్మ కోరుకున్నట్లు మగపిల్లాడే పుట్టాడు. పాపం వాడికేం ఎరుక.. తనకోసం అప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని! అప్పటికీ అనుమానంతో పుట్టగానే ఏడ్చాడు గానీ, అందరూ ఎత్తుకొని ఉంగా.. ఉంగా అని సముదాయించే సరికి ‘వీళ్ల మొహం, అన్ని కుట్రలు చేసే తెలివితేటలు వీళ్లకెక్కడివని’ అప్పటికూరుకున్నాడు. కానీ తల్లి సంగతి పసిగట్టలేకపోయాడు.అందరూ వాడ్ని ‘చిటుకూ’ అని పిలవసాగారు. వాడు కూడా తన పేరు అదే అనుకున్నాడు. ‘అమ్మమ్మా, అమ్మమ్మా’ అని తప్ప.. ఆమె పేరు ఎవరికీ గుర్తులేకపోవడం ఓ కారణమై ఉంటుంది. తన పేరు మునిమనవడికి పెట్టలేదనే సంగతి పైనున్న అమ్మమ్మకు ఇంకా తెలియదు.చిటుకూ మొదటి సంవత్సరం పూర్తి కాక ముందే వాడికి తగిన స్కూలుకోసం వేట మొదలుపెట్టింది రమణి. ఒకానొక శుభ ముహూర్తాన చిటుకూని పక్కింటివాళ్లకిచ్చి, వెంటనే వస్తానని చెప్పి వాళ్ల కాలనీ దగ్గరలో ఉన్న ఓ మోస్తరు స్కూలుకు వెళ్లింది పొద్దున్నే. స్కూలు గేటు దగ్గర వచ్చి పోయే పిల్లలను పరిశీలిస్తూ నిలబడింది. కాసేపటికి నిట్టూరుస్తూ ఇంటికి వచ్చింది. రాంబాబుకు రిపోర్ట్ కూడా యిచ్చింది. ‘ఎక్కువ మంది పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు లేవు. కాబట్టి చిటుకూ ఆ స్కూలులో చేరబోయేది లేదు’ అని! రాంబాబు బిత్తరపోయాడు. ‘అదేమిటే సోడాబుడ్డి కళ్లద్దాలకు చదువుకు ఏం సంబంధం?’ రాంబాబు గొణుగుడు విని ‘పాపం అమాయకుడు’ అనుకొని నవ్విన రమణి నవ్వుకి ఈసారి బిత్తర మీద బిత్తరపోయాడు.మరో ముహూర్తంలో మరో స్కూలుకు ఉదయాన్నే వెళ్లింది. తృప్తి్తపడి సాయంత్రమూ వెళ్లింది. రాంబాబుకు సాయంకాలానికి మరో రిపోర్ట్ సమర్పించింది..‘స్కూలు నుండి సాయంకాలం ఇంటికి వెళ్లే పిల్లలు పెద్దగా బరువు లేని బ్యాగులతో ధిలాసాగా ఉన్నారనీ, పిల్లలకు కనీస గూని అయినా కనపడని కారణంగా ఈ స్కూలు కూడా చిటుకూకి పనికిరాదు’ అంటూ! రాంబాబు నవనాడులూ ముక్కలు ముక్కలై, వక్కలై సహస్రాలైన భ్రమ కలిగింది. ‘అసలు నీకు కావలసిన స్కూలులో నువ్వు కావాలనుకుంటున్న లక్షణాలేవో చెప్పమ’ని పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని రమణారెడ్డి అడిగినట్టు, నాలుగో మెట్టు మీద నిలబడి మొదటి మెట్టు అందుకున్న పోజులో అడిగాడు రాంబాబు. వరమిస్తున్న దేవతమాదిరిగా ఒక్కో వేలు ముడుస్తూ.. ‘మందపాటి అద్దాలున్న కళ్ల జోళ్లు, నిలబడితే వాలిపోయే నడుములు, పిల్లాడి బరువుకి కనీసం అయిదు రెట్ల బరువుతో బ్యాగు, మొహం చేతులు తప్ప ఏవీ కనిపించని స్కూలు డ్రెస్సు, బోండాకు కాళ్లుచేతులూ అమర్చినట్లు శరీరాలు, సూర్యుడిని చూడటానికి వీలుపడని టైమింగ్స్, అగరువత్తుల పొగ కమ్ముకున్న మాదిరి ముఖాలున్న టీచర్లు..’ అలా చెబుతూ రెండు చేతుల వేళ్లన్నీ ముడిచింది. కూల్‌గా నోట్లో వేలు వేసుకొని నిద్ర పోతున్న చిటుకూని చూసి రాంబాబుకు ఎనలేని జాలి కలిగింది. ఇలా స్కూళ్ల వేటా, చిటుకూ గాడి వయసూ క్రమంగా ఒక దశకు చేరుకున్నాయి. పనిలో పని, పక్కింటి వాళ్లు కూడా ‘అమ్మయ్య’ అనుకొని రిలాక్స్ అయ్యారు.. చిటుకూని కాపలా కాసే శ్రమ తగ్గినందుకు.తనది పల్లెటూరు చదువు గాబట్టి ఇంజినీరింగ్ సీటు రాలేదని రమణి గాఢమైన అభిప్రాయం. ‘తను అలాంటి పొరపాటు చేయదు గాక చేయదు’ అని మనసులోనే శపథం చేసి, ఆ సిటీలో ఉన్న అన్ని స్కూళ్లు జల్లెడ వేసి, వేసి చివరికి ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు.ఒకరోజు, దగ్గరలో ఉన్న గుడిలో సరస్వతీపూజ చేసి చిటుకూని అటు నుండి అటే స్కూల్‌కి తీసుకుపోయారు. ఆరోజే మూడో ఏడు తగిలిన ఆ బాలరాజు ఇదంతా సరదాగా చూస్తున్నాడు. చివరాఖరికి స్కూల్ దగ్గరికి వచ్చేసరికి వీళ్లేదో చేస్తున్నారనే అనుమానం వచ్చి, ఆరున్నొక్క రాగం మొదలుపెట్టేశాడు. వాడిని సముదాయించే సరికి తాతలు దిగొచ్చారు. అటో ఇటో నర్సరీ క్లాసులో కూర్చోబెట్టారు. రమణి కూడా తోడుగా కూర్చోవాల్సి వచ్చింది. రాంబాబు ఆఫీసు గదిలో కూర్చున్నాడు. కిటికీలో నుండి చిటుకూ క్లాస్ రూమ్ కనబడుతోంది. లంచ్ బెల్ తర్వాత, ఇవ్వాల్టికి చిటుకూని తీసుకెళ్లి, మళ్లీ రేపు తీసుకువస్తామని ప్రిన్సిపల్‌ని అడిగాడు. ‘అయ్యో! అలా ఎలా కుదురుతుంది? ఇవ్వాళ్టి సిలబస్ మిస్ అయిపోతే ఎలా?’ ఆమె గాభరా పడిపోయింది. ‘సిలబసా? నర్సరీకా?’ అయోమయంగా చిటుకూ క్లాసు వైపు చూశాడు రాంబాబు.టీచర్ బోర్డు మీద థామ్సన్ అటామిక్ మోడల్ పటం గీస్తోంది. అదే తరగతిలో చిటుకూకి తోడుగా కూర్చున్న రమణి బోర్డు వైపు తన్మయంగా చూస్తోంది. కళ్ళు నులుముకొని బోర్డు వైపు మళ్లీ చూశాడు రాంబాబు. ‘థామ్సన్ అటామిక్.. కాదులే.. పుచ్చకాయ బొమ్మ గీస్తోందేమోలే! నేను మరీ అతిగా ఆలోచిస్తున్నా’ అనుకున్నాడు.ఇక్కడే ఉంటే తనకేదో అయిపోద్దనిపించి ప్రిన్సిపల్ కాళ్లూ గడ్డం పట్టుకొని ఆరోజుకి చిటుకూతోనే బయటపడ్డారు. ‘ఈరోజంటే మొదటి రోజు కాబట్టి ఫరవాలేదు, రేపట్నుంచి స్కూల్ డ్రెస్‌లోనే రావాలి. లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది’ ఆఫీసు తలుపు దాటుతూంటే వినపడింది. ఎదురుగా వస్తున్న కుర్రాణ్ణి చూస్తే ప్రెషర్ కుక్కర్ విజిల్ లాగా వాడి తలకాయ, కాయమేమో కుక్కర్లో ఉడుకుతున్నట్టు అనిపిస్తే.. రమణి మాత్రం వాడి వైపు అబ్బురంగా చూస్తోంది.వెనక్కి తిరిగి చూస్తే .. ప్రిన్సిపల్ కఠినమైన చూపుతో.. మొహంపై మట్టి గోడ మీద వేసిన డిస్టెంపర్ లాంటి నవ్వుతో లకలక అంటున్న చంద్రముఖిలా కనపడ్డాడు రాంబాబుకు. ఇంటికి రాగానే రమణి కాళ్లమీద పడ్డంత పనిచేశాడు రాంబాబు. ఆ స్కూలు వద్దంటే వద్దని. అంతకంటే కఠినంగా, తన ట్రేడ్ మార్కు చప్పుడు చేస్తూ చెప్పింది రమణి ‘తన నిర్ణయం మారదని. ఇప్పుడు రమణి మొహం కంటే, అక్కడ ప్రిన్సిపల్ మొహమే ప్రశాంతంగా ఉందనిపించింది.చూస్తుండగానే రోజులు, నెలలు గడుస్తున్నాయి. తన లైఫ్‌లో జరిగిన పొరపాట్లు చిటుకూ లైఫ్‌లో జరగవద్దని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది రమణి. వాడు బాత్రూమ్లోకి వెళ్లినప్పుడు కూడా, వాడికి వినపడేలా ఆడియో లెస్స¯Œ ్స మొదలుకొని– వాడు టీవీ చూడాలనుకున్నపుడు వీడియో లెస్స¯Œ ్స వరకు ఎక్కడా చిన్న పొరపాటు జరగనివ్వలేదు.మాటిమాటికీ గోళ్లు చూసుకుంటూ కోరుక్కుంటున్నాడని, ఆ గోళ్లపై కూడా పర్మనెంట్ మార్కర్‌తో వివిధ ఫార్ములాలు రాసేది. కారప్పూసలో త్రికోణమితిని, చపాతీలపై కెమిస్ట్రీని, వాడే వస్తువులపై ఫిజిక్స్నీ.. అలా చిటుకూ తినే పదార్థం.. వాడే వస్తువూ.. దేన్నీ వదలిపెట్టలేదు రమణి. ఈ విషయంలో అదీ, ఇదీ అనే సందేహం వలదు దేన్నైనా ఉపయోగించుకోవచ్చనే సూత్రాన్ని.. రమణి క్రియేటివిటీతోనే నమ్మగలం. లంచ్ బాక్స్‌లో మొదటి గిన్నెలో కూడా వివిధ నిర్వచనాలు, సింబల్స్ లాంటివి రాసిన స్లిప్స్ ఉంచేది. ఈ చదువేదో రమణి తన కాలేజ్‌లో చదివుంటే రమణికి పక్కాగా ర్యాంక్ వచ్చేదని రాంబాబు లోపల లోపల అనుకున్నాడు. ఇంట్లో సిట్టింగ్ రూమ్ అంతా చిటుకూ పుస్తకాలతో నిండిపోయింది. కంప్యూటర్, ట్యాబ్లూ వచ్చి చేరాయి. గోడల మీద డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేష¯Œ ్స ఫార్ములాలు, పీరియాడిక్ టేబుల్స్ తిష్ట వేశాయి. క్రమంగా ఆ గదిలో ఉన్న సామగ్రి హాలులోకి ఆ తరువాత బెడ్ రూములోకి ఒక్కొక్క అడుగే వేస్తున్నాయి.కళ్లు మూసి తెరిచేసరికి మరో నాలుగేళ్లూ కరిగిపోయాయి. ప్రతి సంవత్సరం ఐఐటీ ర్యాంకర్ల ఫొటోలు కూడా భద్రంగా గోడ మీద ఎక్కిస్తోంది రమణి. చిటుకూ ముక్కు మీదికి కళ్ల జోడెక్కింది. ఆరోజు రమణి ఎంత సంబరపడిందో! గోడ మీద ఉన్న ర్యాంకర్ల ఫొటోల్లో కూడా అన్నీ కళ్ల జోళ్లే మరి! శారీరక వ్యాయామం లేక గుండ్రంగా అయ్యాడు.వివిధ రకాల పేపర్, డిజిటల్ మెటీరీయల్ రాంబాబుకు ఇంట్లో కాలు మెదపడానికి కూడా వీలుపడకుండా చుట్టుముడుతున్నాయి. రాంబాబూ, చిటుకూ మాట్లాడుకొని ఎంతకాలమయ్యిందో! కానీ బయట మాత్రం రాంబాబు ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఓపీ టాండన్ కెమిస్ట్రీ, హెచ్‌సీ వర్మ ఫిజిక్స్ అంటూ ప్రైమరీ స్కూలు పిల్లలు భయపడే మాటలు మాట్లాడుతున్నాడు.చిటుకూ కూడా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. మాటిమాటికీ కళ్ల జోడు పైకి నెట్టుకోవడం, కుడిచేతి చూపుడు వేలుతో ముక్కు నులుపుకోవడం, నిద్ర మధ్యలో ఇంగ్లిష్‌లో ఏ, బి, సి, డి, ఈ సెక్షన్లు అంటూ జెడ్ వరకూ కలవరించడం వగైరా. రమణి ఈ అలవాట్ల గురించి తన పేరెంట్స్‌తో ‘మీ మనవడు ఇప్పుడే టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఆలోచించడమేం ఖర్మ.. నిద్ర కూడా అలాగే పోతున్నాడు’ అని చెబుతూ మురిసిపోతోంది.వాళ్లేమో ‘వీడు మామూలు పిల్లల్లా అల్లరి చేయడు, మాట్లాడడు, ఏదో లోపం ఉందేమో’ అని అనుమానపడ్తున్నారు. ‘పోనీ వీడికి తోడుగా ఉంటారు మరొకరిని కనండి అంటే ఒక్కడే చాలని ఆపేశారు అంటూ లోలోపలే సణక్కోసాగారు. ఆ మాటలు పైకి అంటే అంతే సంగతులు. తను ఇంజినీర్ కాకపోవడానికి మీరే కారణమని తేల్చి నేను ఆ పొరపాటు చేయనని ర్యాంకర్ల ఫొటోలున్న గోడ మీద గట్టిగా గుద్ది మరీ చెబుతుంది రమణి.చూస్తుండగానే కాలయంత్రపు చక్రాలు గిర్రున తిరిగాయి. ఏళ్లు గడిచాయి. ఇంటర్ రిజల్ట్ వచ్చింది. ఫరవాలేదు ఓ మాదిరి మార్కులతో పాసయ్యాడు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అంటూ ఏవో కారణాలు వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. జెఈఈలు గట్రా ‘మీకూ, నాకూ సంబంధం లేదని’ బుద్ధిగా సైలెంట్ అయిపోయాయి. ఇక ఎమ్సెట్.. హిస్టరీ రిపీట్ అయింది. రమణి పేరు నిలబెట్టాడు చిటుకూ. మళ్ళీ లాంగ్ టర్మ్. హిస్టరీ మళ్ళీ రిపీట్. వాక్యం మార్చాల్సిన అవసరం రానివ్వలేదు.రమణి ఆలోచించింది. ఇన్నాళ్లూ ప్రతి క్లాసులోనూ బాగానే మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడేమైంది? ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఒకసారి క్లాసులో ఫస్ట్ ర్యాంక్‌లు పది మందికి వచ్చాయి. ‘అదేంటి? ఎంతమంది ఉన్నా ఒకరికే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేద’ని అడిగితే మార్కులు సమానం, వయసు సమానం, ఎర్రర్స్ సమానం అంటూ అర్థం కానివేవో చెప్పారు. ‘పోనీలే, నా కొడుకుకైతే ర్యాంక్ వచ్చింది కదా’ని ఆనాడు తృప్తిపడింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని లోపల గంట కొడుతోంది. స్కూళ్లలో, కాలేజీలలో జరిగిన నమ్మక ద్రోహం అర్థమైంది. పలురకాలుగా ఆలోచించింది. చిన్నగా రాంబాబు దగ్గరకొచ్చి ‘పోనీలెండి.. చిటుకూకి త్వరగా పెళ్లి చేద్దాం. అప్పుడు వాడికి పుట్టే కొడుకో, కూతురో మన కోరిక నెరవేర్చకపోరు?’ అంది అప్పటికి ఆ కోరికతో రాంబాబే సతమతమైపోతున్నట్టు.అప్పుడు.. రమణికి ఏదో శబ్దం వినపడింది. చెవులు వెడల్పు అయ్యాయి. ఖర్..ఖర్..ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు. అది రమణి చెవులు ఎప్పుడూ వినని చప్పుడు. తన ప్రమేయం లేకుండానే రాంబాబు పళ్లు కొరుకుతున్నాడు. ఎదురుగా అటక మీద కనపడుతున్న వస్తువు వైపు అతని చూపులు సాగడాన్ని రమణి పసిగట్టింది. ఆ వస్తువు ఎప్పుడో తమ పెళ్లప్పుడు సంప్రదాయం కోసం వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అప్పటివరకూ ఎప్పుడూ అవసరపడనిది.. రోకలి బండ. గోడ మీద పీరియాడిక్ టేబుల్లో సిల్వర్ మెటాలిక్ కలర్లో యురేనియం మెరిసిపోతోంది.అప్పుడెప్పుడో రాంబాబు పుట్టడానికి కొన్ని నెలల ముందు ‘నవ్వుతున్న బుద్ధుడు’ అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ మొదటి అణుపరీక్ష జరిగింది. దాని తాలూకు పేలుడు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయ్. ఇవేమీ పట్టనట్టు చిటుకూ బయట ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళాడు. ఇలాగే జరుగుతుందని వాడికి ఎప్పుడో తెలుసు. కాకపోతే చెప్పడానికి అవకాశమెక్కడిది?ప్రహరీ గోడపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. పై పెదవిపై సన్నని పెన్సిల్ గీతలా మీసాల జాడ.. వాడి చూపు.. ముక్కుపైకి నెట్టుకుంటూన్న కళ్లద్దాల గుండా గోడ మీదుగా .. ఎదురుగా కనిపిస్తున్న గ్రౌండ్ వైపు ఉరికింది. అక్కడ పరుగులు పెడుతూ ఆడుతున్న పిల్లలపై నిలిచింది. ఆశ్చర్యంగా, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మేను మరచిపోయాడు.ఇంటికి కొద్ది దూరంలోనే ఇలాంటి గ్రౌండ్ వుందని ఇప్పటివరకూ వాడు గమనించనేలేదు. సరిగ్గా అప్పుడే మైదానం నుండి పిల్లల లేత పాదాల తాకిడికి లేచిన ఓ ధూళి మేఘం... చూస్తుండగానే గాలిలో కలిసిపోయింది.. వాడి బాల్యంలా! – బాడిశ హన్మంతరావు -
బౌద్ధవాణి: ఆమెకు గుండె ఆగినంత పని అయింది..
ఆ ఇంట్లో ఇల్లాలు వంటచేస్తూ అందులో నిమగ్నమై పోయింది. ఆ రోజు భిక్షు సంఘాన్ని భిక్ష కోసం ఆహ్వానించారు ఆ గృహస్తులు. ఆమెకు ఒక నెలల బిడ్డ. ఆ బిడ్డడిని ఇంటిముందు దుప్పటి మీద పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు ఆడిస్తున్నారు. ఆ పసివాడు వెల్లకిలా పడుకుని, కాళ్ళూ చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు చిందిస్తున్నాడు.ఆమె వంటగదిలోంచి అప్పుడప్పుడూ ఆ పిల్లలకేసి చూస్తూనే ఉంది. కొంత సమయం గడిచింది. ఇంటి యజమాని కావడితో మంచినీరు తెచ్చి ఇంట్లో విశాలమైన మధ్య గదిలో ఉంచాడు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు పెద్దగా అరిచాడు.‘‘అమ్మా! భిక్షువులు వస్తున్నారు’’ అంటూ ఆ వీధి చాలా ΄÷డవైంది. ఆ వీధిలోకి అప్పుడే వచ్చారు భిక్షుగణం. భిక్షగా సమర్పించే ఆహార పదార్థాలన్నీ పూర్తయ్యాయి. వాటిని గిన్నెల్లోకి సర్దుతోంది. ఇంతలో బయట ఏదో శబ్దం వినపడింది. కోడె దూడ ఒకటి చెంగుచెంగున ఎగురుతూ, తోక ఎత్తి అటుకేసి వచ్చింది. పసి పిల్లవాణ్ణి అక్కడే ఉంచి, మిగిలిన ఇద్దరు పిల్లలూ ఇంట్లోకి పరుగు తీశారు. ఇల్లాలికి విషయం అర్థమై, వేగంగా బైటికి పరుగు తీసింది.కానీ... అప్పటికే ఆ గిత్తదూడ వచ్చేసింది. ఆరుబయట పడుకున్న పిల్లవాడి మీదగా దూకి వెళ్ళిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయింది. ఆమె వెళ్ళేసరికి... చిరునవ్వులు చిందిస్తూ బోసి నోటితో ఊ కొడుతున్నాడు ఆ బిడ్డ. కొంతసేపటికి భిక్షువులు వచ్చారు. వారు భిక్ష పూర్తి చేశాక ధర్మోపదేశం చేశారు. అప్పుడు వారికి ప్రమాదం తప్పిన పిల్లవాని గురించి తెలిసింది.‘‘చేశారా! ఆ బాలుడు స్థిరచిత్తుడు. స్థిత ప్రజ్ఞుడు. చావు ముందుకొస్తున్నా చిరునవ్వు చెదరనివాడు’’ అన్నాడు ఆ భిక్షువు. ‘‘అవును. కుశల సంపన్నుడు అజేయుడు’’ అన్నాడు మరో భిక్షువు. పాపకర్మలు చేయనివాడు, మోసపు మాటలు ఎరుగని వాడు, పాప సంకల్పాలు తెలియని వాడు. అందుకే స్థిరచిత్తుడు’’ అన్నాడు మొదటి భిక్షువు. వారు అలా వాద సంవాదాలు చేసుకుంటూ ఆరామానికి చేరారు. అక్కడా ఇదే సంఘటన చెప్పి, అదే చర్చ కొనసాగించారు. అలా చర్చించే వారంతా కొత్తగా వచ్చిన వారే. వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగా బుద్ధుడు అక్కడికి వచ్చాడు. భిక్షువులందరూ నిశ్శబ్దం పాటించారు. ‘‘భిక్షువులారా! ఇపుడు మీరు వాదులాడుకుంటున్న విషయం ఏమిటి?’ అని అడిగాడు. విషయమంతా తెలుసుకున్నాడు.‘‘భిక్షువులారా! శరీరంతో పాప కర్మలు చేయని వారు, పాపపు మాటలు మాట్లాడనివారు, పాప సంకల్పాలు చేయని వారు, పాప జీవనం కొనసాగించనివారు ఈ నాలుగు ధర్మాల్ని పాటించేవారు కుశల సంపన్నులే. అజేయులే! అత్యున్నత స్థితిని పొందినవారే! అయితే పసివారు ఇవేవీ చేయరు కాబట్టి వారు అజేయులు కారు. ఎందుకంటే.... వారు వెల్లకిలా పడుకుని మాత్రమే ఉండగలరు. వారు తమ శరీరంతో ఏ కర్మలూ చేయలేరు. వారికి నోరుంటుంది.నవ్వు, ఏడుపులు ఉంటాయి తప్ప, తప్పు ఒప్పులు మాట్లాడలేరు. అంటే... మాటల ద్వారా కర్మలాచరించలేరు. అలాగే... అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచనలు వారికి ఉండవు. కాబట్టి సంకల్పాలూ ఉండవు. ఇక, తాను అది తినాలి ఇది తినాలిఅని ఎలా ఉండదో... ఆ తిండిని ఏదో ఒక మార్గంలో, మంచిగానో చెడుగానో సంపాదించి తినాలి అనే కోరికా ఉండదు. తల్లిపాలు తాగడం తప్ప... మరే విధమైన జీవన కర్మలు చేయరు. పసిపిల్లవాణ్ణి కర్మలతో కొలవకూడదు.పెరిగి పెద్దయ్యాక కలిగే అనేక వికారాల నుండి, దోషాల నుండి, స్వార్థాల నుండి బైటపడిన వారినే కుశల సంపన్నులుగా, అజేయునిగా భావించాలి. అలాంటి నిస్వార్థ జీవనాన్ని కీర్తించాలి. అ నాలుగు ధర్మాల్ని ధరించిన వారికి అపజయం కలగదు. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా చిరునవ్వు చెరగదు.’’ అన్నాడు. పాపకర్మలు చేసే అవకాశం ఉన్నా చేయని వారు పాపపు జీవన విధానం ఎదుటే ఉన్నా దాన్ని స్వీకరించని వారు... ఇలాంటి వారు మాత్రమే అజేయులు. ఎందుకంటే వారు తమని తాము జయించుకుంటారు కాబట్టి అనే విషయం వారికి అర్థమైంది. ఆ కొత్త భిక్షువులు బుద్ధునికి ప్రణమిల్లారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ధర్మ జ్ఞానోదయం
సూర్యోదయం అయ్యింది. సూర్యుని చేత కిరణాలు దట్టమైన చెట్ల చిటారు కొమ్మలపై పడుతున్నాయి. లేలేత ఎరుపు రంగులో ఉన్న కొమ్మల చివుర్లు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. చల్లని గాలి చెట్ల మధ్య దూరి కొమ్మల్ని తాకుతూ పయనిస్తుంది. అప్పుడే నదిలో స్నానం చేసి వచ్చి పాలవృక్షం క్రింద కూర్చున్నాడు బుద్ధుడు. ఆ ఉషోదయ తేజస్సు అంతా అతని ప్రశాంత వదనంలోంచి ఉదయిస్తోంది! పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కనురెప్పలు మెల్లగా వాలాయి! ఆలోచనల ΄÷రలు తెరచుకున్నాయి!తాను జ్ఞానోదయం ΄పొంది ఇది నలభై తొమ్మిదో రోజు. అంటే సిద్దార్థుడు బుద్ధిని పొంది, బుద్ధుడైన రోజు. అప్పటికి రెండు నెలల క్రితం నిరంజనా నదీ తీరంలో తన ఐదుగురు మిత్రులతో కలిసి కఠోర తపస్సు చేశాడు. చిక్కిశల్యమై నీరసించి పడిపోయాడు. జ్ఞానసాధనకు అది సరైన మార్గం కాదని నిర్ణయించుకున్నాడు. నిరాహార వ్రతం మానాడు. మిత్రులు తనని దూషించి వెళ్ళిపొంయారు. అయినా నిరాశపడలేదు. గయకు చేరాడు. అక్కడ నదీతీరంలోని రావిచెట్టు కింద ధ్యానదీక్ష కొనసాగించాడు. అంతకాలంగా వెదుకుతున్న దుఃఖానికి కారణం తెలిసింది కాబట్టి దానికి నివారణ మార్గం కూడా తెలిసింది. ఆ నిదారణా మార్గమే అష్టాంగ మార్గం! అష్టాంగమార్గ ఆవిష్కరణే బుద్ధునికి జ్ఞానోదయం. ఏ విషయంలోనూ అతి ఉండకూడదు అనేది అవగతం అయ్యింది. తిండి మాని శరీరాన్ని ఎండగట్టుకోవడం ఎంత త΄్పో, అతిగా తిని శరీరాన్ని సోమరిగా చేయడం అంతే తప్పు. నిద్రాహారాలు మాని పగలూ రేయి అవిశ్రాంతంగా పని చేయడం ఎంత త΄్పో, పనీ ΄ాటా మాని తిని తిరగడం అంతే తప్పు. ఇలా... రెండు అంచులకు చేరకుండా మధ్యస్థంగా ఉండడం వల్ల కర్తవ్య ΄ాలన చిరకాలం సాగించగలం. దీన్నే మధ్యమమార్గం అంటాం. ఈ మార్గమే బుద్ధుని బోధనలకు పునాది. ఈ మార్గాన్ని ఎంచుకునే అష్టాంగ మార్గాన్ని రూపొందించాడు. అదే బుద్ధునికి జ్ఞానోదయం. బుద్ధుని ఆలోచనల్లో ప్రశాంత వెలుగులు నింపిన ఆరోజు వైశాఖ పున్నమి. బుద్ధత్వం సిద్ధించిన రోజు. బుద్ధుడు సంబోధిని పొందిన రోజు. నేడు ప్రపంచానికి పండుగరోజు. దుఃఖ నివారణా మార్గాన్ని సాధించిన బుద్ధుడు వెంటనే అక్కడినుంచి లేచి వెళ్ళి΄ోలేదు. తాను ΄పొందిన జ్ఞానాన్ని ప్రకటించుకోలేదు. ఆ మార్గాన్ని దాని ఆచరణలో కలిగే అవరోధాల్ని, అసలు ఆ మార్గం ప్రజలకు అర్థమవుతోందా? లేదా? అనే విషయాల్ని పలు పలు విధాలుగా తర్కించుకున్నాడు. తర్కించి తర్కించి.. చివరికి తనది సరైన మార్గమే అని నిర్ణయించుకున్నాడు.మెదటివారం అంతా తనకు ఏ చెట్టుకింద జ్ఞానోదయం కలిగిందో.. ఆ చెట్టుకిందే కూర్చున్నాడు. మానవుల పుట్టుక, మరణాల మధ్య ఉన్న దశల్ని పన్నెండు భాగాలుగా విభజించుకుని ఒక్కో దశ గురించి దీర్ఘంగా ఆలోచించాడు. అవిద్య, సంస్కారాల పరంపరలో ముసలితనం, మరణం కలుగు తాయని, ఆ మరణం వల్లే శోకం, రోదనం, దుఃఖం, బాధలు కలుగుతాయని తెలుసుకున్నాడు. ఈ దుఃఖ బాధలకు కారణం అలవిమాలిన కోరిక (తృష్ణ), కాబట్టి కోరికల్ని నశింపచేసుకుంటే మనస్సు దుఃఖ రహితమవుతుందని గ్రహించాడు. దానితో తన ఆలోచనలకి మరింత బలం చేకూరింది. అలా మొదటి వారం గడిచింది. రెండోవారం కూడా ఆ బోధి వృక్షం కిందే ఉండి ధ్యానానందాన్ని పొందాడు. మూడోవారం ఆ చెట్టుకు కొద్ది దూరంగా వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చొని, బోధివృక్షాన్ని పరిశీలిస్తూ తన మార్గాన్ని మరింత విస్తృత పరుచుకుంటూ గడి΄ాడు. అక్కడి నుండి లేచి, అక్కడికి దగ్గరలో ఒక కొలనుగట్టున ఉన్న ఒక మందిరంలో చేరాడు. అక్కడే ‘అభిధర్మాన్ని’ పరిష్కరించాడు. ధ్యానసాధనా సో΄ానాల్ని, మనస్సుని కేంద్రీకరించే విధానాన్ని రూపొందించుకున్నాడు. మనస్సు నిర్మలం అయింది. బుద్ధుని ముఖంలోంచి తేజస్సు ప్రకాశించింది. తల చుట్టూ ఆరు రంగుల కాంతి .... వెల్గులు ప్రసరించింది. అది ఒక జ్ఞాన కాంతిపుంజం.మరలా ఆ తేజోమూర్తి అక్కడి నుండి లేచాడు. అజ΄ాల అనే మర్రి చెట్టు కిందికి చేరాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో – చెడ్డ పనులు ఎవరు చేయరో, మోహరాగాల నుండి ఎవరు ముక్తులవుతారో, స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ, సర్వోన్నత జ్ఞానిగా ఎవరు ఉంటారో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణత్వం అలా సిద్ధిస్తుంది గాని, పుట్టుకను బట్టి కాదు. అని బుద్ధుడు చె΄్తాడు. ‘సత్యాన్ని తెలుసుకుని, ఏకాంతంగా గడపడం సుఖం. మంచి పనులు చేయడం అంతకంటే సుఖం. జీవుల పట్ల కరుణ, మైత్రి కలిగి జీవించడం అన్నింటికంటే పరమసుఖం. అని బోధిస్తాడు. జనులు కోర్కెలతో, క్లేశాలు అనే వాసాలతో ఇల్లు నిర్మించుకుంటారు. వాటిని తృష్ణ అనే తాళ్ళతో గట్టిగా బంధించుకుంటారు. ఆ తాళ్ళను తెంచి, వాసాలు దించి, ఆ కోర్కెల కొంపను కూల్చుకుంటేనే దుఃఖం నుండి విముక్తి అనే విషయాన్ని ఆవిష్కరించగలుగుతారు. కోర్కెల వాసాలతో దుఃఖం అనే ఇంటిని నిర్మించుకుని ప్రజలు అందులో జీవిస్తున్నారు. ఆ ఇంటికి బలం కోర్కెలనే వాసాలు. జ్ఞానం అనే గొడ్డలితో ఆ కోర్కెల్ని కూల్చితే దుఃఖం దూరమై΄ోతుంది. ఇదే బుద్ధునికి కలిగిన జ్ఞానోదయం. దుఃఖం లేని జగతికి సూర్యోదయం. ధర్మ అరుణోదయం.– డా. బొర్రా గోవర్ధన్(23, గురువారం బుద్ధ పూర్ణిమ) -
బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం
విదిశా నగర సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం సువర్ణపురి. ఆ పట్టణం లో ప్రజోతుడు పేరున్న ధనిక వ్యాపారి. ప్రజోతునికి మణిమాలుడు అనే కుమారుడు. అతనూ పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. మణిమాలుడు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచాడు. ప్రజోతుడు వృద్ధుడయ్యాడు. కుమారునికి వ్యాపార పద్ధతులు, సుదూర రాజ్యాల ప్రజల తీరు తెన్నులు చెప్పుతూ... కాలం గడపసాగాడు. అప్పుడప్పుడూ జైన సాధువుల్ని, బౌద్ధ భిక్షువుల్ని పిలిచి దానాలు ఇచ్చేవాడు. నగరం లో కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.కొన్నాళ్ళకు మణిమాలుడు కూడా పెద్ద వ్యాపారి అయ్యాడు. ధనం పెరిగిన కొద్దీ అతనికి ధనదాహం కూడా పెరిగింది. అక్రమ వ్యాపారాలు సాగించాడు. దానితో ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దానధర్మాలు మానాడు. ధనంతోపాటు మానసిక అశాంతీ పెరిగింది. నిద్ర సుఖానికి దూరం అయ్యాడు. భయానికీ, ఉలికిపాటుకూ చేరువయ్యాడు. తండ్రి తన కుమారునిలో పెరిగిపోతున్న అశాంతిని గమనించాడు. ఒకరోజున పిలిచి– ‘‘నాయనా! నీవు నైతికతకి దూరమవుతున్నావు. మనోవేదనకి దగ్గరవుతున్నావు. నీవు ఇక నాతోపాటు బుద్ధ సందేశాలు వినడానికి రా.. ప్రస్తుతం భగవాన్ బుద్ధుడు ఇక్కడకు సమీపంలోనే ఉంటున్నారు’’ అని అనునయంగా చెప్పాడు. అలా... తనతో రెండు మూడుమార్లు మణిమాలుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ప్రజోతుడు. ఆ తర్వాత తానే స్వయంగా బుద్ధుని దగ్గరకు వెళ్ళసాగాడు మణిమాలుడు. ఒకరోజు మణిమాలుడు బుద్ధునితో ‘‘భగవాన్! నేను నా తండ్రిలా దానాలు చేయలేదు. సాధువుల్ని గౌరవించలేదు. వారిని సత్కరించలేదు. వ్యాపారాన్నీ ధర్మబద్ధంగా చేయనూ లేదు. ఇప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. కానీ... నాకు ఒక బెంగ ఉంది. మరణానంతరం నా తండ్రికి గానీ, నాకు గానీ స్వర్గం లభిస్తుందా?’’ అని అడిగాడు.అతని ఆంతర్యం గ్రహించాడు బుద్ధుడు. ‘‘మణిమాలా! రేపు వచ్చేటప్పుడు ఒక మట్టికుండ, కొంత వెన్నపూస, కొన్ని గులకరాళ్ళు తీసుకుని రా’’ అన్నాడు. మరునాడు అవి తీసుకువచ్చాడు మణిమాలుడు. కుండలో గులకరాళ్ళు పోయించి, వాటిమీద వెన్నముద్ద పెట్టించి,‘‘మణిమాలా! దగ్గరలో ఉన్న తటాకం దగ్గరకు తీసుకుపోయి ఈ కుండను నీటిమీద ఉంచి, కర్రతో పగలగొట్టు. వెన్న మునిగితే నీ తండ్రికి స్వర్గ్రపాప్తి, రాళ్ళు తేలితే నీకు స్వర్గ్రపాప్తి..’’ అని చెప్పి పంపాడు. మణిమాలుడు గబగబా వెళ్ళి నీటిపై కుండను ఉంచి కర్రతో పగలగొట్టాడు. వెన్న తేలింది. రాళ్ళు మునిగాయి. దానితో ఆందోళనపడుతూ బుద్ధుని దగ్గరకు పరుగున వచ్చి పడ్డాడు. విషయం చెప్పి...‘‘మా ఇద్దరికీ స్వర్గం దక్కే మార్గం ఏమిటి భగవాన్’’ అని అడిగాడు. ‘‘నాయనా నీటిలో రాళ్ళు మునగడం వాటి ప్రకృతిధర్మం. నీటిపై తేలడం వెన్న సహజ ధర్మం. అవి వాటి సహజ ధర్మాల్ని తప్పి ఎప్పుడూ ప్రవర్తించవు. అలాగే... మంచి పనులు చేస్తే మనిషికి మనశ్శాంతి. సుఖ నిద్ర, సుఖ జీవనం. అదే స్వర్గం. చెడ్డపనులు చేస్తే మనస్సుకు అశాంతి. దుఃఖం. నిద్రకు దూరం. మనోవ్యధ. అదే నరకం. మంచిగా మానవునిగా, మానవతతో జీవించు. దుఃఖాన్ని ఇచ్చే అకుశల కర్మలు ఆచరించకు. అదే స్వర్గం. ...’’ అని చెప్పాడు.మణిమాలుని మనస్సు తేటపడింది. మట్టికుండ మహోపదేశాన్ని అందించింది. ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. దానాలు చేస్తూ, ధర్మకార్యాలు నెరవేరుస్తూ జీవితం ఆనందంగా కొనసాగించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధవాణి...సమజీవనం
వసంత రుతువు వచ్చేసింది. వనమంతా పూలతో పరిమళిస్తోంది. హిమాలయ ప్రాంంతంలో కోలియులకు చెందిన కక్కరవస్తు నగరం అది. ఆ నగర సమీప వనంలో విశాలమైన రావిచెట్టు కింద కూర్చొని ఉన్నాడు బుద్ధుడు తన భిక్షు సంఘంతో. కోలియ యువకుడు దీర్ఘజాణుడు కూడా వచ్చి బుద్దుని దగ్గరే కూర్చుని తన సందేహాలు తీర్చుకుంటున్నాడు. ‘భగవాన్! లోకంలో హితకారి, సుఖకారి అయిన నాలుగు ధర్మాల గురించి చెప్పండి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నతో అక్కడ ఉన్న భిక్షువులందరూ సర్దుకు కూర్చున్నారు. అంతలో కొద్దిదూరంలో రైతులు లయబద్ధంగా అరిచే అరుపులు వినిపించాయి. కావళ్ళకు ధాన్యం మోపులు కట్టుకుని, భుజాన మోస్తూ, వేగంగా నడుస్తూ ఉన్నా రైతులు ‘ఓహోం.. ఓహోం..’’ అంటూ అరుస్తూ, ఆ వూపులో వేగంగా పోతున్నారు. వారి మధ్యలో ఉన్న రైతు కావడిని కాస్త ముందుకు సర్దుకున్నాడు. దానితో వెనుక బలం పెరిగింది. గట్టు దాటే సమయంలో వెనక్కు పడిపోయాడు. మరలా లేచి కావడిబద్దను భుజానికి ఎత్తి, ముందూ, వెనుకల బరువులు సర్దుకుని వారితో నడక సాగించాడు. కానీ, వెనుకపడ్డాడు. రైతులు వెళ్ళిపోయారు. ‘‘దీర్ఘజాణా; ఈ లోకంలో హితాన్ని, సుఖాన్ని కూర్చే ఉత్థాన సంపద, ఆరక్ష సంపద, కళ్యాణ మిత్రత, సమజీవనం– అనే నాలుగు సంపదలు ఉన్నాయి’’ అన్నాడు. ‘‘భగవాన్! వాటి గురించి చెప్పండి’’ అడిగాడు దీర్ఘజాణుడు నమ్రతగా. ‘‘దీర్ఘజాణూ! వృత్తి ద్వారా సంపాదించేది ఉత్థాన సంపద. పశుపాలనం, వ్యవసాయం, వాణిజ్యం, శిల్పకళ, ఉద్యోగం... సోమరితనాన్ని వీడి ఈ వృత్తులు నిర్వహించడంలో నేర్పరి అవుతారు. ఇలా సాధించుకున్నదే ఈ సంపద’’ ‘‘అలాగే! ఒకరు తమ కండబలాన్ని ఉపయోగించి, నిరంతరం శ్రమించి, కష్టపడి చమటోడ్చి, సంపద కూర్చుకుంటాడు. తాను శ్రమించి పొందిన ఈ సంపదని రాజులు, దొంగలు కాజేయకుండా, అగ్నికి ఆహుతి కాకుండా, వరదపాలు కాకుండా రక్షించుకుంటాడు. దీన్నే ఆ రక్ష సంపద అంటారు. ‘‘మరి, దీర్ఘజాణూ! మిత్రులు కూడా మనకు సంపదే! శీలవంతులు, సదాచారులు, శ్రద్ధావంతులు, ప్రజ్ఞానులు, త్యాగబుద్ధి కలిగిన మిత్రులు ఉంటే... మనం కూడా వారిలా శీలసంపద పొందుతాం. శ్రద్ధాసంపద సాధిస్తాం. సదాచారులై జీవిస్తాం. ఇలా శీల, జ్ఞాన సంపదలు మనకు మంచి మిత్రుల వల్ల వస్తాయి. అందుకే కల్యాణ(మంచి) మిత్రులు కూడా మనకు ఒక సంపదే. ఇక, సమజీవనం అంటే అన్నింటికంటే మనకు హితకారి. కొందరు ఆడంబరాల కోసం తమ ఆదాయానికి మించి వ్యయం చేస్తారు. ఇంకొందరు ఎక్కువ ధనం ఉన్నప్పటికీ పిసినారితనం చూపుతారు. వీరిద్దరూ మోసే కావడి ఏదో ఒకవైపు బరువు పెరిగో, తరిగో సమతుల్యత కోల్పోతుంది. దానివల్ల మోసేవాడి భుజం పట్టు తప్పుతుంది. కావడి పడిపోతూ... మోసేవారినీ పడేస్తుంది.’’ ‘‘దీర్ఘజాణూ..! అలా కాకుండా ఆదాయ వ్యయాలను సరితూచుకుంటూ జీవించే వారే ‘సమజీవనం’ సాగించేవారు. విలాసాలూ, విందులూ, ఇతరులతో పోల్చుకుని అతిగా వ్యయం చేయడం మాని, అవసరాల మేరకు జీవిస్తే... కొద్దిగా ఆదాయం కూడా సమకూరుతుంది. వారి జీవితం నిశ్చింతగా సాగుతుంది; దీర్ఘజాణూ! సకల గృహస్తులకు ఈ సమజీవనం చాలా అవసరం! ఎందుకంటే... ఇదే హితం! ఇదే సుఖం!’’ అన్నాడు బుద్ధుడు. దూరం నుండి రైతులు కావళ్ళు మోస్తూ లయబద్ధంగా అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి! ధీర్ఘజాణు వంగి బుద్ధుని పాదాలకు నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
'సమ్యక్ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!
మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు. ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు. ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... ‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. ‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు. బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: గంగే మాం పాహి! -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్‌లాండ్‌లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. రెండోసారి థాయ్‌లాండ్‌కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు. -
"పెనిస్ విలేజ్"! ఆ గ్రామంలోని ఏ గోడపై చూసినా..!
అత్యంత విచిత్రమైన గ్రామం. ఇక్కడ ఏ గోడ చూసినా విస్తుపోతాం. ప్రతి ఇంటి గోడపైనే ఆ చిత్రమే ఉండటం విశేషం. గోడలపై చిత్రించే ఆ చిత్రాలు ఎంతలా అవి భాగమంటే ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలపై కూడా అదే చిత్రం. కొత్తగా వచ్చినా పర్యాటకులు ఈ గ్రామం తీరుని చూసి ఖంగుతింటారు. ఆ ఆకృతి పట్ల ఉన్న నమ్మకం వింటే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఆ చిత్రాలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అక్కడ ప్రజలు దీన్ని ఓ ఆచారంగానే గాక అవే తమకు మంచి చేశాయని ప్రగాడంగా నమ్మడం మరింత విచిత్రంగా ఉంటుంది. ఇంతకీ అక్కడ గోడలపై ఎలాంటి చిత్రాలు ఉంటాయంటే.. భూటాన్‌లోని థింపు నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే ఈ పునాఖా లోయలోని సోప్సోఖా అనే గ్రామానికి వెళ్లగలుగుతాం. అక్కడ కనిపించే ప్రతి గోడపై నిటారుగా 'మానవ పురుషాంగం" ఆకృతి దర్శనమిస్తుంది. వినేందుకు ఇబ్బందిగా ఉన్న ఇది నిజం. ఆ గ్రామంలో ప్రతి ఇంటి మీదే కాదు! దేవాలయాలు, ప్రభుత్వ సంస్థల గోడలపై కూడా ఆ ఆకృతి ఉంటుంది. ఇది వారి ఆచారం, నమ్మకాలకు సంబంధించింది. ఈ ఆకృతిలో ఉండే హస్తకళ దుకాణాలు కూడా ఎక్కువే. ఎలాంటి నిషేధం లేకుండా యథేచ్ఛగా ఈ ఆకారంలోని బొమ్మలు, శిల్పాలు అక్కడ అముమ్మతుండటం విశేషం. ఆఖరికి టీ షర్టు, పోస్టర్లపై కూడా ఈ ఆకృతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంప్రదాయనికి మూలం 15వ శతాబ్దపు బౌద్ధ సన్యాసి ద్రుక్పా కున్లేకి చెందినదని చెబుతారు అక్కడి ప్రజలు. అతను బౌధ్ధమతాన్ని వ్యాప్తి చేసే సాంప్రదాయేతరు పద్ధతులకు అత్యంత ప్రసిద్ధి. లోతైన ఆధ్యాత్మక సందేశాలను తెలియజేయడానికి ఇలా ఫాలస్(పురుషాంగం ఆకృతిలో)లో ఉండే వాటిని వినియోగించడంతో ఇలా అక్కడ వాళ్లంతా తమ ఇంటి గోడలపై ఆ చ్రితాన్ని తప్పనిసరిగా వేయించుకుంటారు. అంతేగాదు ఆయనకు చెందిన మఠం ఆగ్రామంలోనే ఉంది. దీంతో ప్రజలు ఆ గ్రామాన్ని ప్రముఖ తీర్థక్షేత్రంగా భావించి తండోపతండాలు వచ్చి ఆ మఠాన్ని దర్శించుకుంటారు . ముఖ్యంగా మహిళలు, సంతానలేమితో బాధపడే జంటలు ఈ గ్రామంలోని మఠాన్ని సందర్శించడానికి వస్తారు. దీన్ని సంతానోత్పత్తి క్షేత్రంగా చెబుతారు. అక్కడకు వచ్చిన భక్తులను ఫాలస్ ఆకృతిలో ఉన్న చెక్కతోనే ఆశ్వీరదించడం మరింత విచిత్రం. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత ఆ జంటలకు తప్పనిసరిగా సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అలా సంతానం కలిగిన జంటల గాథలు కూడా అక్కడ దేవాలయంలో ఉంటాయి. ఆఖరికి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఆ మఠం లేదా ఆ సన్యాసి పేరు మీదగా పేర్లు పెడుతారు. ఈ చిహ్నం వారిని దుష్టశక్తులకు దూరం చేసి, సంతానోత్పత్తిని కలిగించే అదృష్ట గుర్తుగా విశ్వసిస్తారు అక్కడి ప్రజలు. అక్కడ భూటాన్‌లోని ప్రతి ఇంట్లో ఈ గ్రామం నుంచి కొనగోలు చేసిన ఫాలస్(పురుషాంగం ఆకృతి)లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నమ్మకం కాస్త నవ్వు తెప్పించినప్పటికీ.. అక్కడ అడుగు పెట్టాలంటే కఠిన నిబంధనలు అనుసరించాల్సిందే. అంతేగాదు భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం కూడా. అందుకు ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
పని ఒకటే... పాపాలు ఐదు..
ఒక సమయంలో బుద్ధుడు రాజగృహానికి వచ్చి, జీవకుని మామిడితోటలో ఉంటున్నాడు. అది వేసవికాలం కావడంతో ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ తోటలో చల్లగానే ఉంటుంది. చెట్లన్నీ మామిడిపండ్లతో నిండుగా ఉన్నాయి. బుద్ధుడు అక్కడ ఉన్నాడని తెలిసి ఎందరెందరో అక్కడికి వచ్చి చేరేవారు. బుద్ధుని ప్రసంగాలు వింటూ ఉండేవారు. భిక్షువులు ఉదయం పొద్దు బాగా పైకెక్కాక నగరంలో భిక్షకు వెళ్ళేవారు. మధ్యాహ్నం వేళకు ముందే తిరిగి వచ్చేవారు. మామిడి చెట్లకింద చేరి తమ తమ అనుభవాలను చర్చించుకుంటూ ఉండేవారు. ఆ రోజు... ఇద్దరు భిక్షువులు తీసుకున్న భిక్ష మీద చర్చ జరిగింది. వారు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు ఆరోజు మాంసాహారం మాత్రమే వండుకున్నారు. అదే వారికి భిక్షగా వేశారు. ఆ ఇద్దరూ భిక్షను స్వీకరించారు. కానీ, వారిలో ఒకరు మాత్రమే దాన్ని తిన్నారు. రెండోవారు దాన్ని తెచ్చి కూరను జంతువులకు వేసి, ఉత్త చప్పిడి అన్నాన్నే భుజించాడు. మాంసాహార విషయంలో బుద్ధుడు అనేక నియమాలు పెట్టాడు. భిక్షువులు కూర్చొని భిక్ష విషయాలు మాట్లాడుకోవడం జీవకుడు విన్నాడు. బుద్ధుడు చెప్పిన పంచశీలలో మొదటిదే జీవహింస విషయం. ఆ విషయం జీవకునికి బాగానే తెలుసు. జీవకుడు మెల్లగా బుద్దుని దగ్గరకు వెళ్ళాడు. బుద్ధుడు ఆరామం ముందున్న పెద్ద మామిడి చెట్టు కింది అరుగు మీద కూర్చొని ఉన్నాడు. జీవకుడు వెళ్ళి నమస్కరించాడు. ‘‘జీవకా! అలా కూర్చో’’ అన్నాడు బుద్ధుడు. జీవకుడు కూర్చొన్నాడు. తాను విన్న భిక్షువుల సంభాషణలు చెప్పాడు. ‘‘జీవకా! జీవహింసకు పాల్పడే వారికి అపుణ్యం (పాపం) ఐదుచోట్ల కలుగుతుంది. ‘‘చంపడం కోసం.. అదిగో ఆ ప్రాణిని తీసుకొని రండి’’ అని ఆదేశించినప్పుడు మొదటి పాపం తగులుతుంది. ఆ ప్రాణిని చంపడానికి దాని మెడకు తాడు వేసి వధించే చోటుకు లాక్కొని తీసుకుపోతున్నప్పుడు ఆ జంతువు భయపడుతుంది. దుఃఖపడుతుంది. అప్పుడు ఆ యజమానికి రెండోసారి పాపం కలుగుతుంది. ‘‘వెళ్ళి దాన్ని చంపు. వధించు’’ అన్నప్పుడు ఆ యజమానికి మూడోసారి పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే.. ప్రాణభీతితో ఆ జంతువు అల్లాడిపోతుంది. భయంతో గింజుకుంటుంది. దుఃఖంతో విలవిల్లాడుతుంది. ఇక ఆ జంతువుని వధిస్తున్నప్నుడు అది మరింత రోదిస్తుంది. అప్పుడు నాలుగోసారి పాపం వచ్చిపడుతుంది. అలాంటి మాంసాన్ని ఇతరులకు పెట్టినప్పుడు, భిక్షగా వేసినప్పుడు ఐదోసారి ఎంతో అపుణ్యం అంటుకుంటుంది. జీవకా! తెలిసి, తన కోసమే వండిన ఈ ఆహారాన్ని తిన్న వారికి ఇంతకుమించిన అపుణ్యం కలుగుతుంది.’’ అన్నాడు. ఒక్క జీవహింసలోనే కాదు.. ఏ చెడ్డ పనికైనా ఇలాంటి పాపాలు కలుగుతాయని తెలుసుకుని బుద్ధునికి వినమ్రంగా ప్రణమిల్లాడు జీవకుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!
బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు. ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు. బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..
వారణాసి పట్టణంలో సుప్రబుద్ధి అనే వ్యాపారి ఉన్నాడు. దేశవిదేశాల్లో వ్యాపారం చేసి ఎంతో ధనం సంపాదించాడు. అతనికి సుజాత అనే పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉంది. సుగుణాల రాశి. అందాల బొమ్మ. అందానికి అందం. సంపదకి సంపద పుష్కలంగా ఉండటంతో ఎందరో ఆమెను పెళ్ళాడలనుకున్నారు. తమ తమ ఆస్తి వివరాలు, చిత్రపటాలూ పంపారు. సుప్రబుద్ధి భార్యకు వారిలో ధననందుడు నచ్చాడు. ఎందుకంటే ఆ పెళ్ళి కుమారులందరిలో అతనే అందగాడు. రంగూ, రూపం చాలా బాగుంది. ‘‘ధననందుని తల్లిదండ్రులకి కబురు పంపండి’’ అంది ఆమె. సుప్రబుద్ధుని తండ్రికి మాత్రం విక్రముడు నచ్చాడు. అతను అవంతీనగర శ్రేష్ఠికుమారుడు. ధనం, వంశగౌరవం కలవాడు కాబట్టి ‘‘విక్రముని కుటుంబంతోనే వియ్యమందుదాం’’ అన్నాడు పెద్దాయన. ధనం కంటే వంశం కంటే ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నాడు సుప్రబుద్ధి. కాబట్టి అతనికి ఉజ్జయినీ యువకుడు ఉదయనుడు నచ్చాడు. తన కుమార్తెను చేపట్టేవాడు ఆరోగ్యంతో దీర్ఘాయువుగా ఉండాలి. పెళ్లంటే నూరేళ్ళ పంట. కాబట్టి ఉదయనుడే తనకు అల్లుడైతే చాలు అనుకున్నాడు. అలా ఆ ముగ్గురి అభిప్రాయాలూ వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి తన కుమార్తె అభిప్రాయం అడగాలనుకున్నాడు. వెంటనే పిలిచి తమ తమ అభిప్రాయాలు చెప్పి–‘‘అమ్మా! సుజాతా! మా ముగ్గురి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వీరిలో ఎవరు అయితే నీకిష్టం?’’ అని అడిగాడు. సుజాత చిరునవ్వు నవ్వింది. మౌనం వహించింది. ‘‘సందేహించక చెప్పు తల్లీ!’’ అన్నాడు. ‘‘నాన్నా! నాకు ఈ మూడు రకాల వారూ వద్దు. గుణవంతుడు, శీలవంతుడు అయితే చాలు’’ అని లేచి అక్కడి నుంచి మేడ మీదికి పరుగు తీసింది సిగ్గుపడుతూ. ఆ వచ్చిన వారిలో అలాంటి యువకుడు మగధకు చెందిన శీలభద్రుడున్నాడు. ఈ విషయంపై ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. ఎటూ తేల్చుకోలేకపోయాడు సుప్రబుద్ధి. మధ్యాహ్నం దాటాక సారనాథ్‌లోని జింకల వనానికి చేరాడు. అక్కడ వెదురు చెట్ల కింద కూర్చొన్న బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. నమస్కరించి, విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘సుప్రబుద్ధీ! ఒకడు చాలా అందగాడు. మంచి శరీర వర్ణం గలవాడు. కన్నూ, ముక్కు తీరు బావుంటుంది. కానీ వాడు ఒక దొంగ అనుకో. అందగాడని దొంగను ఇష్టపడతావా?’’ ‘‘లేదు భగవాన్!’’ ‘‘అలాగే.. ఒకడు సోమరి. అజ్ఞాని. కానీ, ఆరోగ్యవంతుడు. అతణ్ణి ఇష్టపడతావా?’’‘‘ఇష్టపడను భగవాన్!’’ ‘‘ధనవంతుడు, గొప్ప వంశం కలవాడు. కానీ.. వాడు జూదరి. తాగుబోతు. తిరుగుబోతు. అతను నీకు ఇష్టమేనా?’’ ‘‘కాదు భగవాన్! ఇష్టం కాదు’’‘‘చూశావా! అందగాడైనా, ఆయుష్షు గలవాడైనా, ధనవంతుడైనా ఇష్టం కాదు అనే అంటున్నావు. అవునా! సుప్రబుద్ధీ! వీటన్నిటి కంటే గుణమే ప్రధానం. నీ కుమార్తె కోరినట్లు గుణవంతుడు, శీలవంతుడు నీకు అల్లుడైతే, నీవూ, నీ కుమార్తె, నీ కుటుంబం, నీ బంధువర్గం అందరికీ గౌరవం.’’ అన్నాడు. ‘‘భగవాన్! నా కుమార్తె ఇష్టం ప్రకారమే ఆమె పెళ్ళి చేస్తాను పెద్ద మనస్సుతో అంగీకరిస్తాను’’ అంటూ సుప్రబుద్ధి సంతోషంతో లేచి వెళ్ళాడు. అలాగే చేశాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: క్షమయే దైవము) -
దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలూ అలాంటివే! కాబట్టి..
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. అప్పటినుంచి బుద్ధుడి పట్ల ద్వేషం, అసూయ పెంచుకుంటాడు దేవదత్తుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృవు పంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాత శతృవు దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు – ‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వులాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తుంది. వెదురు చెట్టు ఒక్క పూతతోనే తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – బొర్రా గోవర్ధన్ -
స్థిరచిత్తం అంటే అదే!
అది గంగానదీ తీరం. లోతు తక్కువ ప్రదేశం. నది మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నదీ తీరంలో గట్టు వెంట గొర్రెల మంద మేస్తోంది. ఆ మందను చూసింది ఒక తోడేలు. మందలో చివరిలో మందకు కొద్దిదూరంలో ఒంటరిగా మేస్తోంది ఒక పొట్టేలు. తోడేలు చూపు దాని మీద పడింది. ‘ఈ బలిసిన పొట్టేలు అయితే రెండు రోజులకు సరిపోతుంది’ అనుకుంది. మాటు కాచి, పొంచి పొంచి దాని దగ్గరకు వచ్చింది. ఎండుటాకుల ధ్వనిని బట్టి ఏదో తనవైపు వస్తున్నట్లు గుర్తించింది పొట్టేలు. తల పైకెత్తి చూసింది. తన మీదికి దూకి వస్తున్న తోడేలు కనిపించేసరికి నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీదికి పరుగుతీసింది. అలా రెండు మూడు తిన్నెలు దాటి తీరాన్నుండి దూరంగా పోయాయి రెండూ. అంతలో వరదనీరు ఉరకలేస్తూ ఉరవడిగా వచ్చిపడుతోంది. పొట్టేలు ప్రాణ భయంతో ఇసుక దిబ్బ మీదినుండి నది నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలు మాత్రం దిబ్బమీదే నిలబడిపోయి, పొట్టేలు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వరద నీరు హెచ్చింది. మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు మునిగిపోసాగాయి. తోడేలు పొట్టేలు మీదినుంచి చూపు తిప్పుకునేసరికే అది నిలబడ్డ దిబ్బ చాలా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఆ దిబ్బమీది కొద్ది ఎత్తైన ప్రదేశం మాత్రమే మిగిలింది. తోడేలు ఆ ఎత్తు ప్రదేశానికి చేరింది. ఆ వరద అలా రెండురోజులు ఉంది. వేటాడటం అటుంచి, కనీసం ఒడ్డుకు చేరే మార్గం కనిపించలేదు. అది తనలో తనే ‘ఈ ప్రమాదాన్నుండి బయట పడతానో లేదో, ఇప్పటిదాకా ఎంతో హింస చేశాను. ఎన్నో జీవుల్ని చంపాను. ఆ కర్మ ఫలం నాకు మంచిని చేకూర్చదు. కాబట్టి బతికినన్ని రోజులు ఇక అహింసను, మైత్రిని, మంచితనాన్ని పాటించాలి’ అనుకుంది. ఆ దిబ్బమీదికి చేరి, కూర్చొని ధ్యానం చేయసాగింది. కొంత సమయం గడిచింది. ఎక్కడో సన్నగా మేక అరుపు దాని చెవులబడింది. తపస్సు భగ్నం అయ్యింది. మెల్లగా కళ్లు తెరిచింది. అటూ ఇటూ చూసింది. వరద కొద్దిగా తగ్గింది. తాను ఉన్న ఇసుక దిబ్బ ఇంకొద్దిగా బైట పడింది. దాని మీదకు చేరి అరుస్తూ ఉన్న మేకపిల్ల కనిపించింది. తోడేలు మెల్లగా లేచి మేక పిల్లకేసి వంగి వంగి నడవసాగింది. దాదాపు దగ్గరగా పోయి ఒక్క ఉదుటున దూకింది. కానీ.. గురి తప్పి నీటిలో పడడంతో శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని అటు చూసిన మేకపిల్లప్రాణభయంతో నది నీటిలోకి ఎగిరి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలుకు మరలా నిరాశ.‘లేదు. మరలా నేను నా మనస్సును కుదుట పరచుకోవాలి. హింసను విడనాడాలి. అహింసతో జీవించాలి. తపస్సు చేసి, చేసినపాప ఫలాన్ని రూపు మాపుకోవాలి’ అనుకుంది. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు శాంతంతో, అహింసతో, జీవ కారుణ్యాన్నీ, ధర్మాన్నీ ఆచరించడం కాదు. కోపం రావడానికి కారణాలు ఉన్నప్పుడూ, హింస చేసే అవకాశం వచ్చినప్పుడూ తప్పు చేసే పరిస్థితులు కలిగినప్పుడు అవి చేయకుండా ఉండటమే గొప్పతనం. అలా ఉంచగలిగిందే ధ్యానం. అలా మన చిత్తాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా మార్గం మనస్సును అలా దృఢంగా మలుస్తుంది’’అని చెప్పాడు. స్థిర చిత్తం అంటే అదే మరి! – డా. బొర్రా గోవర్ధన్ -
వ్యక్తి కంటే సంఘమే శ్రేష్ఠం
బుద్ధుడు దోషాలు చేసేవారిని సంస్కరించడానికి శతవిధాలా ప్రయత్నం చేసేవాడు. అప్పటికీ, ఎప్పటికీ ఇక వీరు మారరు అనుకుంటే వారిని సంఘానికి దూరం పెట్టేవాడు. సంఘానికి ఇచ్చే గౌరవం వ్యక్తికి ఇచ్చేవాడు కాదు. భిక్షువులందరూ కుటుంబాల్ని, ఆస్తిపాస్తుల్ని వదిలి వచ్చినవారే! కానీ తాము మాత్రమే త్యాగం చేశామని గప్పాలు కొట్టుకునేవారు, విహారానికి దానాలు చేసే ఉపాసకులు (గృహస్తులు) దగ్గర ఇతరుల మీద లేనిపోని అపవాదులు వేసేవారు. అలాంటివారిలో చంపావిహారంలోని కణ్ణథేరుడు ఒకడు. విహారానికి ఎవరైనా దానాలు సమర్పిస్తే... అవి నావల్లే వారు సమర్పించారు..’’ అని ప్రగల్భాలు పలికేవాడు. భోజనాల్ని పంచే పదవిలో ఉంచితే, కొన్నాళ్లు ఉండి ‘‘ఈ పదవి నేను తప్ప మరొకరు నిర్వహించలేరు. నా సామర్థ్యం ఈ సంఘానికి తెలియాలి’’ అనుకొని దానినుండి ఏవో సాకులు చెప్పి వైదొలగేవాడు. మరొక భిక్షువు ఆ పదవిని చేపట్టి ఎంతో సమర్థవంతంగా నిర్వహించడంతో తట్టుకోలేకపోయేవాడు. ఈర్ష్య చెందేవాడు. ఆ ఈర్ష్యని సంఘం మీద రుద్దేవాడు. పదవినుండి తానే దైదొలగి, వచ్చినా ఉపాసకులతో–‘‘నన్ను బలవంతాన తొలగించారు’’ అని అబద్ధాలు చెప్పేవాడు. అలా ఆ కణ్ణ భిక్షువు తోటి భిక్షువుల మీదే కాకుండా, సంఘం మొత్తం మీద విమర్శలు చేస్తుండేవాడు. వారు నిర్వాకుల్లో కొందరినే కీర్తిస్తూ వారి ప్రాపకం కోసం ఆరాటపడేవాడు. వారిలో ‘‘నేను ఈ విహార నిర్మాణం నుండి ఉన్నాను. దీని నిర్వహణకు నేను తగునా?’’ అని నర్మగర్భితంగా అడిగేవాడు. వారు ఎవరూ పట్టించుకోకపోతే ‘‘ఈ విహార స్థాపకుణ్ణి నేనే.. నేనే మొదటి నుండి ఉన్నాను. నన్ను గౌరవించరా?’’ అంటూ వచ్చిన ప్రతివారి దగ్గర ఏకరువు పెట్టేవాడు. ఇలా.. సంఘం ఐక్యతకి చేటుగా తయారయ్యాడు. తోటి భిక్షువులు, అనేక సార్లు బుద్ధుడు కూడా చెప్పి చూశాడు. కొంతకాలం బాగానే ఉంటాడు. మరలా కువిమర్శలు మొదలు పెట్టేవాడు. ఆ విరామంలో భిక్షువులు అతని విచిత్ర మనస్తత్వాన్ని తట్టుకోలేకపొయారు. అప్పుడు బుద్ధుడు చంపావద్ద గల గగ్గిరా పద్మాల పుష్కరణ్ తీరంలో ఉన్నాడు. అదే సమయంలో చంపా విహార భిక్షువులు సమావేశమై కణ్ణ భిక్షువుని పిలిచి అతని తప్పులు చెప్పి, వివరణ అడిగారు. వారు అడిగిన విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయం మీద చర్చ పెట్టుమన్నాడు. ఇలా అడిగిన దానికి కాకుండా పొంతన లేనిది వాగుడు వాగడంతో వారి మీద కోపాన్ని, ద్వేషాన్నీ, తిరస్కారాన్నీ చూపడంతో వారంతా పద్మాల పుష్కరిణికి దగ్గరకు వెళ్ళి, బుద్ధునికి వివరించాడు– అప్పుడు బుద్ధుడు కణ్ణభిక్షువు ఇది తెలియజేసిన దోషాలు కాదు. కావాలనే చేస్తున్నాడు. అతని మనస్తత్వం మార్చలేనిది. ఇది అతని సహజాత స్వభావంగా భావించి... ‘‘భిక్షువులారా! ఒకరైతు బార్లీ పంట వేస్తాడు. ఆ మొక్కల మధ్య తెగులు సోకిన ఒక బార్లీ మొక్క ఉంటుంది. దానితో తెగులు మొదట్లో బయటకు వ్యక్తం కాదు. ఆరోగ్యకరమైన బార్లీ మొక్కల్లానే పెరుగుతుంది. దాని కాండం, వేర్లు, అకులు ఎంతో ఆరోగ్యంగానే కనిపిస్తాయి. పైకి ఎలాంటి తేడా వ్యక్తం కాదు. కానీ అది కంకి తొడిగినప్పుడు దాని తలను చూస్తే అది తెగులు సోకిన మొక్క అని రైతుకు తెలుస్తుంది. ఇక అప్పుడు ఆ రైతు దీని కాండం బాగుంది, అకులు బాగున్నాయి, వేరు బలంగా ఉంది అని ఆలోచించడు. దానివల్ల ఆ తెగులు ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది అని భయపడి వెంటనే దాన్ని పీకేస్తాడు. చేనులోంచి తొలగిస్తాడు.’’ అలాగే మరో రైతు తాను పండించిన వరి ధాన్యాన్ని నూర్చి, తూర్పారబోస్తాడు. అప్పుడు తుక్కు ధూళి దూరంగా పోయి పడతాయి. కానీ, తాలుగింజలు, తప్పలు మంచి విత్తనాల రాశి పక్కనే పడతాయి. అప్పుడు ఆ రైతు ఇవి చూడ్డానికి మంచి గింజల్లానే ఉన్నాయని వాటిని రాశిలోకి నెట్టడు. పొలికట్ట (చీపురు) తీసుకుని వాటిని రాశికి దూరంగా ఊడ్చేస్తాడు. రాశి నుండి తొలగిస్తాడు’’. కాబట్టి... ఈ కణ్ణ భిక్షువు ఇక సంఘంలో పనికిరాడు. మారడు. ఇలాంటి వారు చాలా చాలా అరుదు. ఇతని వల్ల సంఘం మొత్తం నిందల పాలవుతుంది. కాబట్టి ఇతన్ని మీ సంఘం నుంచి బహిష్కరించండి’ అని చెప్పాడు. ఎలాంటి దోషాలు లేని ఒక వ్యక్తి కంటే కొద్దో గొప్పో దోషాలతో ఉన్నప్పటికీ సంఘమే గొప్పది అని చెప్పిన బుద్ధుడు గొప్ప ప్రజాస్వామ్యవాది. ఐక్యతకు మించిన బలం మరొకటి లేదని చెప్పిన సమైక్యతావాది. -
దశావతారాల్లో అమితాభ బుద్ధుడు
సాక్షి, హైదరాబాద్: దశావతారాల్లో అమితాభ బుద్ధుడి విగ్రహాన్ని వెయ్యేళ్ల కిందే ఓ దేవాలయంలో చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. బౌద్ధం జాడలు అరుదుగా కనిపించే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో, సరిగ్గా బుద్ధుడి 2,566 జయంతి సమయంలో కొంత లోతైన పరిశోధనా వివరాలు వెలుగుచూశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలం పురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో బుద్ధుడి జాడలపై తాజాగా చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశోధించారు. ఈ దేవాలయాల్లో బుద్ధుడి జాడలపై గతంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు బీఎస్ఎల్ హనుమంతరావు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు. ఆదివారం శివనాగిరెడ్డి వాటిని పరిశీలించి లోతుగా విశ్లేషించారు. పద్మాస నంలో, ధ్యానముద్రలో మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధ శిల్పరీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్యనారాయణ ఆలయ రంగ మండపం కప్పు మీద విష్ణు దశావతారాల్లో భాగంగా చెక్కిన బుద్ధుడు, బోధివృక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు ఉన్నట్టు కనిపిస్తోంది. అలంపురం ఊరి వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద ఇదే నేపథ్యంలో ఉన్న బుద్ధుడి కుడి పక్కన బోధివృక్షం, ఎడమ పక్కన ఒక స్త్రీ శిల్పాలున్నాయి. వజ్రాయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణం కలిగిన బుద్ధుడి రూపాన్ని అమితాభ బుద్ధుడిగా పేర్కొంటారు. ఈ విగ్రహాలపై పరిశోధన అవసరమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. -
అమితా ‘బుద్ధుడి’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: పులికాట్ సరస్సులోని ఓ దీవిలో ఉన్న అమితాభ బుద్ధుడి రహస్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుంతూరు పల్లె శివారులో నాలుగడుగుల బుద్ధుడి విగ్రహం చాలాకాలంగా ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తోంది. తధాగతుడి రూపాల్లో అమితాభుడి అవతారం ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో అమితాభ బుద్ధుడి ఆరాధన ఎక్కువ. పులికాట్ దీవిలో అమితాభ బుద్ధుడి విగ్రహం పరిశోధకులను ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఈ తరహా శిల్పాలు అరుదు. ఈ ప్రాంతం ఇసుక దిబ్బలతో ఆర డుగుల ఎత్తుతో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధ స్థూపం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ శాతవాహనుల కాలానికి చెందిన పెద్దపెద్ద ఇటుకలు వెలుగుచూశాయి. ‘1991 ప్రాంతంలో నేను శ్రీవెంకటేశ్వర వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిశోధించి బుద్ధుడి విగ్రహాన్ని గుర్తించా. ఆ సమయంలో కొన్ని ఇటుకలూ వెలుగుచూశాయి. అవి క్రీ.శ. 1–2 శతాబ్దాల కాలానికి చెందినవిగా అనిపించాయి’అని హెచ్‌సీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేపీరావు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఏడాది క్రితం మళ్లీ కుంటూరుకు వెళ్లాం. బుద్ధుడి విగ్రహం అలాగే ఉంది. అక్కడి దిబ్బ ప్రాంతంలో ఈనెల 24 నుంచి దాదాపు నెలన్నరపాటు తవ్వకాలు జరపాలని నిర్ణయించాం’అని తెలిపారు. ఇటుక గోడ నిర్మాణ జాడలు ‘బుద్ధుడి విగ్రహమున్న ప్రాంతంలో గతంలో భారీ ఇటుకలతో గోడ ఉండేదని, కొందరు త వ్వి ఇటుకలు తీసుకెళ్లారని స్థానికులు చెప్పా రు. అమితాభ బుద్ధుడి శిల్పం ఇక్కడ ఎందుకుందో తవ్వకాల్లో తెలుస్తుంది. ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి సంబంధముందా కూడా తెలుస్తుంది’ అని కేపీరావు చెప్పారు. -
మనస్సు వడ్లగింజ లాంటిది..
మనస్సు వడ్లగింజ లాంటిది అన్నాడు బుద్ధుడు. బియ్యపుగింజల నాణ్యతల్ని చూడ్డానికి వడ్లగింజల్ని అరచేతులతో నలుపుతారు. అప్పుడు కొన్ని గింజలు చేతికి గుచ్చుకుంటాయి. కొన్ని గుచ్చుకోవు. కారణం వడ్లగింజకు ఒక చివర చిన్నసూదిలాంటి ముక్కు ఉంటుంది. అది గురిలో ఉంటే చర్మాన్ని ఛేదిస్తుంది. లేకుంటే తానే నలిగిపోతుంది. అలాగే గురిలో ఉన్న మనస్సు అవిద్యను, అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి గురిలో లేని గింజ అవిద్యలో పడి నలిగిపోతుంది. అలాగే మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నాడు బుద్ధుడు. మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి. మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి. అలాగే... మనస్సు చెట్టు కలపలాంటిది అని కూడా బుద్ధుడు చెప్పాడు. మంచి మనస్సు చందనవృక్షపు కలపలాంటిది. దానికి పరిమళం ఉంటుంది. ఆ కలప మెత్తగా ఉంటుంది. కావలసిన రూపంలోకి తేలిగ్గా మలచుకోవచ్చు. పెద్ద వస్తువులుగా చిన్న చిన్న వస్తువులుగానూ, తయారు చేసుకోవచ్చు. చక్కని శిల్పాలుగానూ, మలచుకోవచ్చు. ఇలాంటి మనస్సుగల మనిషి తనను తాను చక్కగా తేలిగ్గా సంస్కరించుకోగలడు. ఇలా మనస్సుని వడ్లగింజతో... మడుగుతో చెట్టు కలపతో పోల్చి గొప్ప సందేశంగా అందించాడు బుద్ధుడు. అందుకే ఆయన మహా మనో వైజ్ఞానికుడు. – బొర్రా గోవర్ధన్ -
పాక్‌లో బయటపడిన బుద్ధుడి విగ్రహం.. కానీ
ఇస్లామాబాద్ : బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్లో బయటపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మర్ధాన్ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని సంప్రదించారు. అయితే ఇస్లామిక్ బోధనలకు అనుగుణంగా లేదని సదరు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ముల్లా నిర్ణయించారు. అనంతరం విగ్రహాన్ని తొక్కుతూ, సుత్తితో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విగ్రహం బయటపడిన ప్రాంతం ఒకప్పటి గాంధార నాగరికతకు సంబంధించినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. గౌతమబుద్దుడి విగ్రహాన్ని మతపరమైనదిగా చూడకుండా, కనీసం పురాతన విగ్రహంగా భావించి గౌరవిస్తే బాగుండని సామాజికమాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్లో మతపరమైన విషయాల్లో అసహనం శృతిమించుతుందనడానికి ఇదో ఉదాహరణ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ టూరిజం శాఖ దృష్టికి వచ్చిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాము గుర్తించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఖైబర్- పఖ్తుంఖ్వా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్ సమద్ చెప్పారు. ధార్మిక వికాసంతో కూడిన వ్యక్తిత్వమే నిజమైన వ్యక్తిత్వమని ఆచరించి, నిరూపించిన వాడు బుద్ధుడు. ప్రపంచంలోమొట్టమొదటగా మానవతా వాదాన్ని ప్రవేశపెట్టింది బౌద్ధమే! ప్రకృతిసిద్ధమైన సూత్రాలు మనిషిని నియంత్రింప చేస్తాయనీ, వాటిని అర్థం చేసుకుని, అవగతం చేసుకుని సాలోచనగా నడుచు కోవటం వలన సమాజ శ్రేయస్సు కలుగుతుందనీ బౌద్ధం చెబుతుంది. Disgusting intolerance in Pakistan. A life size statue of Lord #Buddha was discovered at a construction site in Takhtbhai, Mardan, KPK but before the Archaeologists could restore it, local Maulvi ordered to destroy it to pieces. Repeat of Bamiyan. God! 🤦♂️ pic.twitter.com/BMdVDGWjWN — Aditya Raj Kaul (@AdityaRajKaul) July 18, 2020 -
పాపమా? పుణ్యమా?!
శ్రావస్తి బౌద్ధ సంఘంలో విమలుడు మంచి భిక్షువు. బుద్ధుని ప్రబోధాల్ని చక్కగా ఆచరిస్తాడని పేరు. పంచశీల పాటించడంలో మేటి. ఒకరోజున ఒక అడవిమార్గంలో వెళ్తున్నాడు విమలుడు. అతని చెవికి ఒక జింక రోదన వినిపించింది. వెంటనే విమలుడు ఆ ఆర్తి, అరుపు వినిపించే వైపుకు నడక సాగించాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ ఒక జింక, దాని పిల్లలు కనిపించాయి.అవి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. అది గింజుకుంటూ మోర పైకెత్తి అరుస్తోంది. విమలుడు దగ్గరకి వెళ్లాడు. తల్లి జింక భయంతో మరింత బిగ్గరగా అరిచింది. పిల్ల జింకలు రెండూ దూరంగా పారిపోయాయి. ఎవరో వేటగాడు ఉచ్చులు పన్నాడు. ఆ ఉచ్చులో తల్లి జింక కాలు తగిలించుకుంది. అది ఎప్పటినుండి బలవంతాన లాక్కుంటోందో గానీ, ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. కాలి చర్మం కూడా చీరుకుపోయి ఉంది. విమలుడు వెంటనే ఆ ఉచ్చు తొలగించాడు. తల్లి జింక విమలుడి వంక మెరిసే కళ్లతో చూస్తూ తన పిల్లల దగ్గరకు గెంతుతూ అరుస్తూ వెళ్లిపోయింది. ఈసారి దాని అరుపులో ఆనందం వినిపిస్తోంది. విమలుడు వాటివైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అంతలో.. అతని వెనుకనుండి... ‘‘ఓరీ! బోడిగుండూ! దుర్మార్గుడా! ఎంత పని చేశావు?’’అనే అరుపు వినిపించి వెనక్కి తిరిగాడు. వేటగాడు కోపంతో తన దగ్గరకు వేగంగా వస్తున్నాడు. ‘‘నేను ఆహారం కోసం ఉచ్చులు పన్నాను. నాకు దొరికిన ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. నీవు చేసిన ఈ పనివల్ల ఈ రోజు నా కుటుంబం పస్తుండాలి. మా నోటికాడ కూడు తీసిన పాపం నీదే...’’ అని తిట్టుకుంటూ ఉచ్చులు తీసుకుని భిక్షువు వంక చుర చుర చూస్తూ చరచరా వెళ్లిపోయాడు. విమలుడు దారిలోకి వచ్చి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. ‘‘నేను పాపం చేశానా?పుణ్యం చేశానా?’’ అనే సందేహంలో పడ్డాడు. ఆరామానికి వచ్చి, బుద్ధుని దగ్గరకు వెళ్లి, నమస్కరించి, విషయం చెప్పాడు. ‘‘విమలా! నీవు చేసింది పాపం కాదు. జీవ కారుణ్యానికి మించిన ధర్మం లేదు. నీవు శీల భ్రష్టుడివి కావు. నిందితుడివి కావు’’ అని మెచ్చుకున్నాడు.ఒక మంచిపని చేయడం వల్ల కొందరు నిందించినా బాధపడకూడదని విమలునికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధ వర్ధనుడు
వైశాఖ పున్నమి రోజున పుట్టిన సిద్ధార్థుడు తన పదహారో ఏట యశోధరను వివాహమాడాడు. ఆయనకు 29వ ఏట సంతానం కలిగింది. రాహులుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే ధర్మమార్గాన్ని, దుఃఖ నివారణ మార్గాన్నీ వెతుక్కుంటూ, తల్లిదండ్రులని, భార్యాబిడ్డల్నీ, మిత్రుల్నీ, అన్నదమ్ముల్నీ, ఆస్తిపాస్తుల్నీ రాజ్యాధికారాన్నీ వదిలి వనాలకు వెళ్లిపోయాడు. ఆరేళ్లు అనేక చోట్ల తిరిగి, అనేకమందితో చర్చించి చివరికి వైశాఖ పున్నమి నాడే బోధగయలోని రావి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత సారనాథ్‌లో తొలిసారిగా ఐదుమంది అనుయాయులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలల్లోనే ఆ సంఘం మహా సంఘంగా విస్తరించింది. ఎందరో వేలాదిమంది ఆ సంఘంలో చేరారు. ఎవరో తాత్వికులు కాదు. గృహస్థులు కూడా. రాచకుటుంబాలకు చెందినవారు, వ్యాపారులు, పనీపాటలు చేసే కూలినాలీ జనం, అంటరాని కులాలవారు– అందరూ సంఘంలో చేరారు. నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోయినట్లు సంఘంలో చేరిన వారంతా తమ తమ కులం, గోత్రం, నామం, ప్రాంతీయతలు అన్నింటినీ కోల్పోయారు. బౌద్ధ సంఘంలో అందరూ సమానులే! అందరూ భిక్షాటన మీదే బతకాలి. అందరూ కాషాయ చీవరాలే ధరించాలి. నేలమీదే నిద్రించాలి.ఈ నిరాడంబర జీవితానికి, సంఘంలో చేరి బంధువులుగా గడపడానికీ బుద్ధుడు చెప్పిన ధర్మవ్యక్తికి తమ వంతు కర్తవ్యాన్ని జోడించడానికి అందరిలాగే .. బుద్ధుని కుటుంబ సభ్యులు, శాక్యరాజ్యం వంశీకులు దాదాపుగా అందరూ ముందుకొచ్చారు. వారిలో మొదటివాడు ఆయన తండ్రి శుద్ధోదనుడే!శాక్యరాజవంశంలో ప్రముఖులు ఐదుగురు. వారు శుద్ధోదనుడు, అతని నలుగురు సోదరులు శుక్లోదనుడు, శాక్యోదరుడు, ధోతోదనుడు, అమితోదనుడు. వారికి ఒక చెల్లి, అమితాదని. ఐదుగురు అన్నదమ్ములకూ ఎనిమిది మంది సంతానం. సిద్ధార్థుడు, నందుడు, ఆనందుడు, మహానాముడు, అనిరుద్ధుడు, భద్దియడు, భాడవుడు, కింబిలుడు.అమితాదనికి ముగ్గురు సంతానం. తిష్యుడు, దేవదత్తుడు, యశోధర.వీరిలో తొలుత బుద్ధోపదేశం విని బౌద్ధాభిమానిగా మారిన తొలి వ్యక్తి శుద్ధోదనుడే!సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాక శుద్ధోదనుడు తమ నగరం కపిలవస్తుకు రమ్మని బుద్ధుని బాల్యమిత్రుడు కాలు ఉదాయితో కబురు పెడతాడు.బుద్ధుడు కపిలవస్తు నగరం వదిలిన తర్వాత ఏడేళ్లకు తిరిగి అక్కడికి వెళ్తాడు.అనారోగ్యంతో మంచి పట్టిన తండ్రికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంతో ఆయనలో అంతకుముందు ఉన్న దుఃఖం తీరిపోతుంది. తననూ బౌద్ధునిగా అనుమతించమని వేడుకుని నమస్కరిస్తాడు తండ్రి. అలా శుద్ధోదనుడు శాక్యవంశ తొలి బౌద్ధ ఉపాసకుడయ్యాడు. ఆ తర్వాత యశోధర తన ఏడేళ్ల బిడ్డను బుద్ధుని దగ్గరకు పంపుతుంది. ‘వారే నీ తండ్రిగారు. నీకు రావలసిన ఆస్తి, అధికారానికి సంబంధించిన హక్కుల్ని అడిగి తెచ్చుకో’ అని రాహులుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపుతుంది యశోధర.‘‘నాయనా! నాకున్న ఆస్తి ఇదే’ అని ఏడేళ్ల కొడుకు చేతిలో భిక్షాపాత్ర పెడతాడు బుద్ధుడు. ‘‘నాకుంది ధర్మాధికారమే. అది నీవూ గ్రహించు’’ అని బౌద్ధసంఘంలో చేర్పించుతాడు. అలా తొలి బౌద్ధ సంఘం బాలభిక్షువు రాహులుడయ్యాడు!ఆ తర్వాత బుద్ధుని మిత్రుడు కాలు ఉదాయి, అతని సోదరులు, మేనత్త బిడ్డలు దాదాపుగా కాస్త వెనకాముందుగా అందరూ బౌద్ధసంఘంలో చేరి భిక్షువులుగానే జీవితాంతం జీవించారు.తన భర్త శుద్ధోదనుడు మరణించాక సిద్ధార్థుని పెంచిన తల్లి, పిన్నమ్మ గౌతమి కూడా కపిలవస్తు నుండి రాజగృహకు కాలినడకన వెళ్లింది. తనతోపాటు కోడలు యశోధరను, మిగిలిన కోడళ్లనూ, మరికొంతమంది శాక్య స్త్రీలనూ వెంటబెట్టుకుని వెళ్లింది.‘తమకూ భిక్షుసంఘంలో అర్హత కల్పించమని అడిగింది.బుద్ధుడు అందుకు అనుమతించి తొలిగా తన తల్లినే భిక్షుణిగా మార్చాడు. భిక్షుణీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలా బౌద్ధభిక్షువుగా మారిన తొలి మహిళా మూర్తి గౌతమే!శాక్యవనం ఆస్థాన క్షురకుడు ఉపాలీ, రథచోదకుడు చెన్నుడూ– ఎందరెందరో బౌద్ధ సంఘంలో చేరారు. ఉపాలికి ఎంత గౌరవ సంస్కారం దక్కిందంటే బుద్ధుని పరినిర్యాణం తర్వాత మూడు నెలలకి ఏర్పాటైన మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఆయనే!తానా కాకుండా తన కుటుంబాన్ని, తన శాక్యవంశాన్ని మొత్తం రాచరిక వ్యవస్థ నుండి బైటకు రప్పించి ధర్మమార్గంలో నడిపించిన ఆదర్శ దార్శనికుడు గౌతమ బుద్ధుడే!బుద్ధుని జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ఆయన లుంబినీవనంలో పుట్టిందీ, బుద్ధగయలో బుద్ధత్వం పొందిందీ, చివరకు కుసీనగరంలో నిర్వాణం చెందిందీ వైశాఖ పున్నమి రోజునే! అందుకే ఈ వైశాఖ పున్నమి ఒక బుద్ధ జయంతి... ఒక బుద్ద వర్ధంతి! అంతేకాదు.. యశోధర జయంతి కూడా ఈనాడే! – డా. బొర్రా గోవర్ధన్ బుద్ధుణ్ణి సంసార చక్ర విధ్వంసకుడు అంటారు. సుఖదుఃఖాల గానుగ మరలాంటి సంసార చక్రాన్నుండి మానవాళిని బైట పడేసి, రక్షించిన ధార్మికునిగా బుద్ధుని కీర్తిస్తారు. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, పదవి, అధికారం, శాసనం, యుద్ధం... ఇవన్నీ ఒకే ఒరలో దాగిన రకరకాల కత్తులు. వీటివల్ల హింస, ఉన్మాదం కలిగి చివరికి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మానవ జీవితం. ఈ దుఃఖ మహాసాగరాన్నుండి బైటకు వచ్చి, యోగం, ధ్యానం, సమాధి, ఇలాంటి స్థితుల్ని సాధించి ముక్తి, కైవల్యం లేదా నిర్వాణ మార్గాన సాగితే శాశ్వతంగా దుఃఖం నుండి మనిషి విముక్తుడవుతాడని భారతదేశంలో పుట్టిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు చెప్పాయి. వాటిలో బౌద్ధం కూడా ఒకటి. దుఃఖ నివారణ మార్గంలో నిర్వాణాన్ని అది చెప్పింది. సంసారాన్ని త్యజించి భిక్షువులుగా, సంసారంలోనే ఉంటూ, ఉపాసకులుగానూ ఈ నిర్వాణ స్థితుల్ని పొందవచ్చునని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరించే వారందరికీ ఒక సంఘాన్ని స్థాపించాడు. అదే బౌద్ధ సంఘం. ఆ సంఘంలో చేరి ధర్మాచరణ ద్వారా, ధర్మాన్ని ప్రచారం చేసే వారే భిక్షువులు. వీరికి కుటుంబం ఉండదు. ఆస్తిపాస్తులుండవు. వ్యక్తిగత వస్తువులు ఉండవు. అన్నీ సంఘానివే. అన్నీ ఉమ్మడివే! నియమ నిబంధనల రూపకల్పనలో కూడా ఉమ్మడి నిర్ణయమే తుది నిర్ణయం. -
ఫణిగిరి బుద్ధప్రతిమను పరిశీలించిన శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఫణిగిరిలో వెలుగుచూసిన అరుదైన బుద్ధ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచిన భారీ గార ప్రతిమను (డంగు సున్నంతో రూపొందించిన) సోమవారం మ్యూజియానికి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందని, ఆదిమానవుని అవశేషాలు రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పురావస్తు శాఖ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లభించాయని, ఆరు అడుగుల పొడవుతో డంగు సున్నంతో రూపొందించిన ప్రతిమ వెలుగుచూడడం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు
వట వృక్షానికి గొప్పదనం కృష్ణుడు దాన్ని ఆశ్రయించినందు వల్ల. బోధి వృక్షానికి గొప్పదనం బుద్ధుడు తపస్సుని దాన్ని ఆశ్రయించి చేసినందువల్ల. మద్ది (పాల) చెట్లకి గొప్పదనం రామచంద్రుడు ఆ జాతికి చెందిన 7 చెట్లని వధించి తన శక్తిని నిరూపించుకుని సుగ్రీవునితో సఖ్యాన్నిపొంది రావణవధకి అవకాశాన్ని ఏర్పరచుకున్నందువల్ల. శింశుపావృక్షానికి గొప్పదనం సీతమ్మ ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాదాపు సంవత్సర కాలం ఉన్నందు వల్ల. నైమిశారణ్యానికున్న గొప్పదనం ఇలాంటి అనేక వృక్షాలతో కూడిన ఆ అరణ్యాన్ని ఆశ్రయించుకుని సూతమహర్షి ఉంటూ శౌనకుడూ మొదలైన మహర్షులకి అనేక పురాణేతిహాసాలని బోధించి నందువల్ల. పూవులు చిన్నవి అవుతూనూ, ఆకర్షణ ఏ మాత్రమూ లేకపోతూనూ, వాసన ఏ మాత్రమూ లేకుండానూ, కాండమంతా జిగురు కలిగిన కారణంగా ఏ ఒక్కరికీ ఆశ్రయాన్ని ఈయలేకపోతూనూ, తన ముళ్లు నేల మీద పడుతూ ఉండే కారణంగా ఎవరినీ తన దగ్గరికి రానీయకుండా చేసుకుంటూనూ, ఎలాగో వచ్చినా తన మీద నిరంతరం సంచరిస్తూ ఉండే నల్ల చీమల కారణంగా ఎవరికీ ఆశ్రయాన్నీయలేకపోతూనూ కనిపించే తుమ్మచెట్టుక్కూడా ఉన్న గొప్పదనం – ఎవరికీ ఇష్టం ఉండని భూత ప్రేత పిశాచ సంతతిని తన మీద ఉంచుకుంటూన్నందువల్ల. ఇలా ప్రతి వృక్షానికీ ఓ గొప్పదనం ఉంటూ ఉంటే అలా ఆ వృక్షాన్ని కేవలం ఆశ్రయించి ఉండటమే కాక, దాన్ని తీపిదనం కలదాన్నిగానూ, కోరికల్ని తీర్చే శక్తీ ఉన్నదిగానూ మార్చివేయడం ఎంత ఆశ్చర్యకరం! ఆనందదాయకం!! సాయి ఆ చెట్టుకింద దక్షిణ భాగంలో కూచుండే వాడు. ఆ కారణంగా దక్షిణపు వైపు ఆకులన్నీ తీపిదనంతో ఉంటూ ఉండేవి. ప్రతి వస్తువుకీ సహజలక్షణమంటూ ఒకటుంటుంది. సముద్రానికి కెరటాలతో ఉండటం, నిప్పుకి మండేతనం ఉండటం, వర్షానికి తడిసేలా చేసే గుణం, చలికి వణుకు పుట్టించేతనం ఉండటం ఎలాగో అలా, వేపకి చేదుతనమనేది సహ+జం(తనతో పుట్టిన గుణం) దాన్ని సాయి తాను కూర్చున్న కారణంగా మార్చేసాడనే విషయం లోకానికర్థం కావాలనుకుంటూ ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇంతర్థం వచ్చేలా రాశాడు. కేవలం ఆ చెట్టుని మార్చేసాడనేది దాని భావం కాదు. లోకంలో ఎందరో వేపచెట్లలా ఏ విధమైన ప్రయోజనమూ లేనివాళ్లుగా జీవిస్తూ ఉంటే, ఆ అందరినీ తనని ఆశ్రయిస్తే చాలు ప్రయోజనం కలిగిన వాళ్లుగా చేశాడనేది మరో లో అర్థం. అంతేకాదు. ఎందరో ఎందరో నిరుత్సాహంతో అణగారిన ఆశలతో ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి సాయిని ఆశ్రయించుకున్నారు కూడా కదా! అలా మార్చేసిన లక్షణం కలవాడు సాయి –అనే అర్థం లోకానికి తెలియాలనే ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇలా రాశాడు. లోగడ మనం చదువుకున్న ఘట్టాల్లో అనేక విధాలుగా రక్షింపబడ్డవాళ్లూ, ఆత్మహత్యలని విరమించుకున్నవాళ్లూ, తమ ప్రవర్తనలోని దోషాలని గమనించుకున్నవాళ్లూ.. ఇలా ఎందరెందరు రాలేదు! అదుగో ఆ ఉదాహరణలన్నీ కళ్లకి కట్టినట్టుగా వివరించగల శ్లోకం ఇది! కాబట్టి పాదుకల్ని చూస్తూ చేతిలో స్పృశిస్తూ ఆ పాదుకల మీద అరచేతులతో బలంగా రుద్దేస్తూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ఇంక కొద్ది భక్తులైతే ముద్దులు పెట్టడం వంటి కొన్ని చేష్టల్ని కూడా చేస్తూ కనిపిస్తారు. అది సరికాదు. పాదుకల్ని స్పృశిస్తూ ఆ పాదుకలు తమ శిరసు మీద సాయినాథుడు ఉంచినట్లు భావిస్తూ పైన అనుకున్న శ్లోకాన్నే ధ్యానించుకుంటూ ఆ సాయినాథుని కారణంగా ఆ వేపచెట్టు ఎంత గొప్పది కాగలిగిందో ఆ చరిత్రని తెలుసుకుంటూ ఆ గొప్పదనమే తనకీ కలిగేలా చేయవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అది మాత్రమే పాదుకాదర్శన కాలంలో చేయవలసిన పని. ఇంతటి గొప్పదనం తమలో దాగి ఉన్న ఆ పాదుకల ప్రతిష్ఠ ఎలా అయిందో, పాదుకలకి మాత్రమే ఆ గొప్పదనం ఎందుకుంటుందో ఇక తెలుసుకుందాం!ఎన్నెన్నో దైవక్షేత్రాలున్నాయి లోకంలో. అయితే అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే ఏడింటికే మోక్షాన్నిచ్చే క్షేత్రాలున్న పురాలుగా గుర్తింపు వచ్చింది. ధర్మస్వరూపుడనే పేరు (రామో విగ్రహవాన్ ధర్మః) ఆ రామచంద్రునికి మాత్రమే సొంతమయింది. ఎందరెందరో అవతారమూర్తులున్నారు భక్తి సామ్రాజ్యంలో. అయితే భగవానుడనే మాట (కృష్ణ స్తు భగవాన్ స్వచుమ్) కేవలం కృష్ణునికే వచ్చింది. అదే తీరుగా పర్వతాలెన్ని ఉన్నా హిమాలయానికీ, నదులెన్ని ఉన్నా గంగకీ.. ఇలా కొన్నింటికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి కారణమేమిటని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విశేషాలు గోచరిస్తాయి.లౌకికం – అలౌకికంఏ విధంగానూ లోలోతు పరీక్షలని చేయకుండా కేవలం భౌతిక దృష్టితో చూడటమనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికదర్శనం అంటారు. ఓ చెట్టుని చూస్తే అది ఎంత ఎత్తుంది? ఎంత లావైన కాండాన్ని కలిగి ఉంది? ఎన్నాళ్ల వయసుదానికి?... ఈ తీరు వివరాల సేకరణ లౌకికం. అదే మరి ఆ చెట్టు కింద ఏ యోగి కూర్చుంటూ ఉండేవాడు? పెద్ద గాలివాన వచ్చి అన్ని చెట్లు పడిపోయినా కూడా.. ఆ చెట్టే ఎందుకు పడిపోకుండా నిలవగలిగింది? చెట్టు మొదట్లో ఉన్న పాముపుట్టని ఎందరు దర్శించి పూజిస్తూ ఉండేవాళ్లు! ఆ తీరు అర్చనలు ఎన్నేళ్ల నుండి సాగుతూ వస్తున్నాయంటూ ఆలోచించడం, తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అలౌకిక దర్శనం. భారత దేశానికి అప్రాచ్యుడు (పశ్చిమ దేశాల వాడు) వచ్చాక మనందరికీ వాడు నేర్పింది కేవలం లౌకిక దర్శనాన్ని మాత్రమే. దాంతో అలౌకిక దర్శన దృష్టితో ఎవరు మాట్లాడినా దాన్నంతటనీ – ‘చాదస్తం, మూఢవిశ్వాసం, పిచ్చితనం’ – వంటి మాటలతో మనం కొట్టిపడేసే తీరు అలవాటైపోయింది మనకి. అయితే ఒక్కసారి తలని మరో వైపుకి తిప్పి దృష్టిని మరో తీరుకి మళ్లించి చూస్తే చాలు – అలౌకికదర్శనం మనకి అబ్బి తీరుతుంది. ఇదంతా ఎందుకంటే ఆ తీరు అలౌకిక దృష్టితో చూడలేని పక్షంలో ద్వారకామాయి అనేది ఒక మసీదులాగా, సాయి కేవలం ఒక మహమ్మదీయునిగా, షిర్డీ అనేది ఒక ప్రసిద్ధ ఆలయమున్న ప్రదేశంలాగా, ఆయన్ని సేవించినవారంతా కేవలం భక్తులనే జాతికి చెందిన మనుషులుగా మాత్రమే కనిపిస్తారు. అలా కాక అలౌకిక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ పాదుకలూ – వాటి గొప్పదనమూ మనకి అర్థమవుతుంది. కానీ పక్షంలోనూ అప్రాచ్యదృష్టితోనూ చూస్తే పాదుకలు కేవలం ‘చెప్పులు’గానే కనిపిస్తాయి. కాబట్టి ఆ తీరు అలౌకిక దర్శనానికి కదులుదాం! అక్కల్కోట నుండి షిర్డీకా? అమృతాన్నైనా సరే చిల్లు ఉన్న పాత్రలో పోస్తే.. ఎలా చుక్క చుక్క చొప్పున తరిగిపోతూ కొంతసేపటికి మొత్తం శూన్యమైపోతుందో.. అలాగే తపశ్శక్తిని సాత్త్వికంగా గానీ, రాజసంగా గానీ సంపాదించినా మళ్లీ అసూయ, పగ, ద్వేషం అనే వీటిని ప్రదర్శిస్తే తపశ్శక్తి కాస్తా ఒకనాటికి క్షీణించిపోతుంది. మళ్లీ ఆ శక్తి రావాలంటే... పోయిందాన్ని పూరించాలంటే మళ్లీ తపస్సుని చేసి ఆ లోటుని పూరించాల్సిందే.ఇదంతా ఎందుకంటే, సాయిది ఏనాడూ పగ, ద్వేషం, అసూయ అనేవి ఏ కోశానా లేకుండా సాధించిన తపస్సుతో కూడిన శక్తి మాత్రమే అని చెప్పడం కోసమే.అక్కల్కోటలో మహారాజ్ గారు ఉన్నంతవరకూ ఆ తపశ్శక్తి అనేదాన్ని శూన్యం కాకుండానూ, లేదా తగ్గిపోతూ ఉండకుండానూ ఆయన తపస్సు చేసి నింపుతూ ఉండేవారు. వారి పిమ్మట ఆ శక్తిని నింపగల శక్తి, సమర్థత కలవారు దాదాపుగా లేకపోయారు. ఆ విషయాన్ని గమనించిన అక్కల్కోట(కర్) మహారాజ్ కృష్ణజీ అనే ఆయనకి న్రిత్యం అక్కల్కోటకి అతి భక్తి శ్రద్ధలతో నిర్వా్యజంగా (ఈ పని అయితే ఇక్కడికొస్తాననే తీరు బుద్ధితో కాకుండా) వచ్చి దర్శించే వ్యక్తి కలలో కనపడి – నువ్వు షిర్డీకి వెళ్లు! నేను అక్కడున్నాను’ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నంత పవిత్రతా తపశ్శక్తి స్థితీ ప్రస్తుతం షిర్డీలో కనిపిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమనే దానర్థం. దాంతో కృష్ణజీ షిర్డీకే వచ్చాడు. ఇంతకాలమూ తాను దర్శిస్తూ ఉన్న అక్కల్కోట శక్తి ఇక్కడ షిర్డీలో ఉన్నదీ లే నిదీ గమనిస్తూ.. ప్రతినిత్యం అంతటి శక్తి అనుభవాన్ని పొందుతూ.. ఆనందంగా జీవిస్తూ.. ఒకటి కాదు రెండు కాదు 6 నెలల పాటు షిర్డీలోనే ఉండిపోయాడు. అందుకే అక్కల్కోట నుండి తన రాకపోకలు షిర్డీకే సాగించదలిచాడు ఈ భక్తుడు.మొదట్లో అక్కల్కోట మహారాజ్లోనే స్థిరంగా ఉన్న ఆ తపశ్శక్తీ ఆకర్షణా క్రమంగా వారి పిమ్మట వారి చిత్రపటంలోకీ ఆ పిమ్మట అక్కడున్న మహారాజ్గారి పాదుకలలోకీ ప్రవేశించాయి. ఆ మీదట అక్కడి పాదుకలలోనికి ఆ శక్తిని ఆ స్థాయిలో పూరించగలవారు లేకపోయిన కారణంగా, ఆ స్థాయి శక్తి ఉన్న క్షేత్రంగా అక్కల్కోట మహారాజ్ గారే షిర్డీని నిర్ణయించిన కారణంగా మొత్తం తపశ్శక్తి అంతా షిర్డీకి చేరిపోయిందన్నమాట. ఇది అలౌకిక దృష్టితో ఆలోచించడమంటే. పాదుకలు ఈ స్థితిలో కృష్ణజీ ఆలోచించాడు ఈ షిర్డీ ఇంతటి పవిత్రత కలిగినది కాబట్టీ, ఆ విషయాన్ని అక్కల్కోట మహారాజ్ గారే నిర్ణయించి చెప్పారు కాబట్టీ, ఆ శక్తిని చిరకాలం స్థాపించి ఉంచడం కోసం– పాదుకలని అక్కడ అక్కల్కోటలో స్థాపించిన తీరుగా ప్రతిష్ఠించాలని. ఇదే విషయాన్ని తనతో పాటు సమానస్థాయి కల భక్తి విశ్వాసాలున్న మిత్రులతో సంప్రదించాడు. వాళ్లూ అంగీకరించారు మొదటి మాటతోనే– మొదటి మాటలోనే. ‘ఏకైకస్యాపి నిర్ణయాభ్యుపగమో దోషాయ భవతి’ అని సంస్కృతంలో ఓ మాట. ‘ఎంతగా తానాలోంచినా, ఎంతగా దాన్ని పరిశీలించి తప్పుకాదని అనుకున్నా కూడా, ఏ విషయాన్నీ ఒక్కనిగా ఉంటూ ఓ నిర్ణయాన్ని చేస్తే తప్పక అందులో దోషం ఉండి తీరుతుందని దాని భావం. ఆ కారణంగా కృష్ణజీతో పాటు మిగిలిన అందరూ కలిసి మంత్రోపాసన నిరంతరం చేస్తూ ఉండేవారూ – లౌకిక దృష్టి ఏ మాత్రమూ లేనివారూ అయిన ఉపాసనీ మహారాజ్ (పేరులోనే ఉంది ఆయన మంత్రోపాసనలో ఎంత ప్రసిద్ధిని పొందినవాడో) గారికి ఈ పాదుకా ప్రతిష్ఠ ప్రతి పాదనని తెలియజేస్తూ తమ బుద్ధికి తోచిన విధంగా పాదుకల నమూనాని వారి ముందుంచారు. అంతే! ఆ ఉపాసనీ మహారాజ్ గారు ఆ పాదుకల్లో ఉండబోయే తపశ్శక్తినీ, పాదుకలనీ, రాబోయే ఖ్యాతినీ మానసికంగా తమ బుద్ధితో గ్రహించి– వీటిని ప్రతిష్ఠించడం ఎంతో గొప్పవిషయం, అంతే కాక తగిన విధంగా గౌరవించడమే అని భావించి వెంటనే ఆ పాదుకల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే నాల్గింటినీ కూడా చేర్చారు. శంఖమనేది ధ్వనిని పుట్టించేది కాబట్టి ధ్వనిని పుట్టించగల శక్తి ఆకాశానిది కాబట్టీ (శబ్ధగుణక మాకాశమ్) ఆకాశశక్తి ఈ పాదుకలలో ఉంచదలిచారన్నమాట. దాంతో ఆకాశంలో ఉండే సర్వగ్రహాలూ ఈ శంఖం గుర్తులో ఉన్నాయని పరోక్షంగా తెలియజేయడమన్నమాట. ఆ కారణంగానే పాదుకలని భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తే చాలు గ్రహబాధలు తొలుగుతాయి, తొలుగుతున్నాయి.ఇక చక్రమనేది కాల చక్రానికి (నడుస్తున్న కాలగతి జీవితం) సంకేతం. అందుకే ఈ చక్రం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే చాలు జీవితగమనంలో వచ్చే ఒడిదుడుకులు సర్దుకుంటాయి – సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి – లభిస్తున్నాయి.ఇక గద అనేది శత్రుసంహారానికి సంకేతం. ఈ చిహ్నం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే మనని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉండే ఆ శత్రువులు దూరంగా వెళ్లిపోతారు.నిరంతరం మానసికక్షోభ తొలిగిపోతుంది. తొలిగిపోతుంది కూడా.ఆ మీదట పద్మమనేది ప్రశాంతతకీ బుద్ధి వికాసానికీ సంకేతం. గ్రహబాధలు శంఖం ద్వారా, శత్రుబాధలు గద ద్వారా తొలిగిపోయాక ఇక వ్యక్తికి ఉండేదీ కలిగేదీ మనశ్శాంతే కదా! ఆ మనశ్శాంతికి సంకేతం పద్మం. అలాగే ఇన్ని అనుభవాలు కలిగాక వ్యక్తి ఏవిధంగా జీవించాలో చెప్పగల బుద్ధి వికాసమనేది కూడా పద్మం ద్వారానే కలుగుతుందని చెప్పడం దీని లోభావం(అంతరార్థం).ఇంతటి అర్థవంతమైనవి పాదుకలనే దృష్టితో ఆలోచనతో ఉపాసనీ మహారాజ్ వారు పాదుకలకి ఈ చిహ్నాలని జతచేశారు. ఇంతటి తపశ్శక్తీ ఇన్ని తీరుల ఇబ్బందుల నివారణలూ కలిగేలా పాదుకలని ఏర్పాటు చేసినా కూడా ఆ ఉపాసనీ మహారాజ్ గారికి సంతృప్తి కలగలేదు. ఏదో ఓ లోటు అనిపించనే అనిపించింది. దాంతో సాయికి ఏ అమోఘమైన తపశ్శక్తి అనేది లభించడానికి వేపచెట్టు సాక్షిగా ఉందో, ఆ వేపచెట్టు ఏ ద్వారకామాయికి దక్షిణ ప్రదేశంలో ఉందో, అంతేకాక సాయి నిరంతరం (12 ఏండ్ల పాటు) తపస్సులో గడిపిన గురుస్థానం సమీపంలో ఉందో ఆ విశేషం లోకానికి భక్తజనానికి) తెలియాలనీ తెలియజేయాలనీ భావించిన ఉపాసనీ మహారాజ్ ఆ వేపచెట్టు శక్తినీ, దానికి సాయి కలిగించిన అసాధ్యశక్తినీ (తియ్యదనం కోరికలు తీర్చేతనం..) బహిరంగపరుస్తూ ఓ శ్లోకాన్ని చెక్కించి ఆ ఫలకాన్ని కూడా ఆ పాదుకలవద్దే ఉంచాలని నిర్ణయించారు. నిజానికి ఆ పాదుకలూ వాటిలో ఈ చిహ్నాలు, ఆ శ్లోకమూ గనుక ఉండని పక్షంలో ఇన్ని విశేషాలు లోకానికి తెలిసుండేవా? మహాత్ములది ఎప్పుడూ లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి– దాంతో పాటు ఆ అనుగ్రహం లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి – దాంతో పాటు ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో ఆ ఉపాయాన్ని అందరికీ వివరించి చెప్పాలనే దృష్టీను. ఆ కారణంగా పాదుకలని ఇంతటి లోభావం కల దృష్టితో మనం దర్శించాలన్నమాట. చాలా మంది భక్తులు పాదుకల మీద అరచేతుల్ని పెట్టి అరగదీస్తూ, తలని వాటికి మోదుకుంటూ, ఇంకకొందరైతే చుంబిస్తూ... ఏమేమో చేసేస్తుంటారు. పాదుకా దర్శనం అనుగ్రహాన్ని పొందడమనేది పై తీరు భావనతో కళ్లతో దర్శిస్తే చాలు లభిస్తుంది నిజానికి.వ్యాధితో బాధపడుతున్న రోగికి పైకి కనిపించే రోగం మాత్రమే కాక ఇంకా ఏమైనా కూడా లోపల దాగున్నాయేమోనని గ్రహించి ఆ అన్ని రోగాలూ తొలగిపోయేలానూ, వచ్చి ప్రధానంగా కనిపిస్తున్న ప్రధాన రోగానికి సంబంధించిన మూలకణాల నిర్మూలనానికి ఎలా వైద్యుడు ఆయా ఔషధాలని కలిపి ఓ ఔషధాన్ని సిద్ధం చేస్తాడో అలా ఉపాసనీ మహారాజ్ గారు ఈ పాదుకలని అంతటి శ్రద్ధతోనూ చేసి ఉంచడమే కాక, ఏ ఔషధాన్ని ఎంత చలి లేదా వేడి ప్రదేశంలో ఉంచాలో ఆయనకాయనే మనకి చెప్పినట్టుగా ఈ పాదుకలు ఆ వేప చెట్టు కిందనే ఉండాలని ఓ నిర్ణయాన్ని కూడా చేశారు. దాంతో భక్తులందరికీ పాదుకాప్రతిష్ఠ అనేది ఓ ఆనందదాయకమైన ఉత్సవంగా అనిపించింది.