ఓటర్ల జాబితా సవరించాలి : కలెక్టర్
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో ఒకే వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓటును నమోదు చేసుకున్నట్లయితే వాటిని జాబితాలో సవరించాల్సి ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.రాంగోపాల్ అభిప్రాయపడ్డారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు తన ఓటు హక్కును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 3175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో మరిన్ని చేర్పులు మార్పుల కోసం రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, సలహాలు తెలియజేయాలన్నారు. బూత్‌లెవల్ ఏజెంట్ల వివరాలు సైతం ఇవ్వాలని కోరారు. నవంబర్ 4న జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని, అభ్యంతరాలు, విజ్ఞప్తులను నవంబర్ నెలాఖరు వరకు స్వీకరిస్తామన్నారు. 12, 20 తేదీల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఓటరు జాబితాలోని పేర్లను సరిచూస్తామని చెప్పారు.
10, 17, 24 తేదీల్లో బూత్ లెవల్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 12వ తేదీ వరకు వీటిపై ఆక్షేపణలు, అభ్యంతరాలు స్వీకరించి విచారణ చేపడతామ ని, 30వ తేదీన ఓటర్ల జాబితాను ఫొటో ఐడెంటిటీతో అప్డేషన్, అనుబంధ జాబితాల తయారు, ముద్రణ జరుగుతుందని చెప్పారు. 2014 జనవరి 6వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్, మదనపల్లె సబ్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా , డీఆర్వో శేషయ్య, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు పెంచల్ కిషోర్, రామచంద్రారెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి జగదీష్‌కుమార్, టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ కార్యదర్శి రామానాయుడు, సీపీఎం కార్యదర్శి చైతన్య, తహశీల్దార్లు పాల్గొన్నారు.
పెరిగిన పోలింగ్ బూత్‌ల సంఖ్య
జిల్లాలో పోలింగ్ బూత్‌ల సంఖ్య పెరిగింది. జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 3125 పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటి సంఖ్య 3175కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ గురువారం కలెక్టరేట్లో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో విడుదల చేశారు.
నియోజకవర్గాల వారీగా పెరిగిన పోలింగ్ బూత్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లెలో 210 నుంచి 213 చేరుకోగా పీలేరు నియోజకవర్గంలో 221 నుంచి 230కి, మదనపల్లె నియోజకవర్గంలో 203 నుంచి 221కి, పుంగనూరు నియోజకవర్గంలో 213 నుంచి 215కు, చంద్రగిరి నియోజకవర్గంలో 263 నుంచి 270కి, చిత్తూరు నియోజకవర్గంలో 187 నుంచి 190కి, పలమనేరు నియోజకవర్గంలో 228 నుంచి 231కి, కుప్పం నియోజకవర్గంలో 205 నుంచి 210కి చేరుకున్నాయి.
కాగా శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఎలాంటి మార్పు లేదు. తిరుపతి నియోజకవర్గం పరిధిలో 262 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఇంటి నెంబర్లు కొత్తగా ఇచ్చినందున చేర్పులు, మార్పులకు సమయం పడుతుందని ఆర్డీవో రామచంద్రారెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.