నిజంగా ‘బువ్వ’మ్మే
► రూ. 20కే ఫుల్‌మీల్స్
► కమ్మనైన అమ్మ భోజనం బువ్వమ్మకే సాధ్యమంటున్న నిరుపేదలు
డోన్(కర్నూల్): అసలే కాయకష్టం చేసిన చేతులు.. ఉదయం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూరగాయలు, సరుకుల భారాన్ని మోసిమోసి అలసిపోతుంటారు. ఇదే సమయంలో కాసింత కమ్మనైన ముద్ద కడుపులో పడితేకాని కష్టమైన పని చేతకాదు. హోటల్‌కు వెళ్లి తిందామంటే తెల్లవార్లు కష్టపడి పని చేసిన సొమ్మంతా టిఫెన్‌కే పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే టిఫెన్ కోసం రూ.60 దాకా ఖర్చు పెట్టినా కడుపు నిండదు.
కానీ, డోన్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్రామాల నుంచి వచ్చే కూరగాయలు, సరుకులను దుకాణాలకు తరలిస్తూ కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ దాదాపు వందకు పైగా కూలీలు పనిచేస్తూ ఉంటారు. కాయాకష్టం చేసిన చేతులకు పడిగడుపున కాసింత ముద్ద కోసం రోజూ ఉదయం ఎదరుచూస్తుంటారు. తమకు బువ్వమ్మ ఉన్నంత వరకు పస్తులుండాల్సిన పరిస్థితే రాలేదంటున్నారు ఇక్కడి హమాలీలు, రైతులు. కేవలం రూ.20 కే కొర్రన్నం, రాగిసంగటి, చపాతి, కర్రీ, విజిటెబుల్ పలావ్, కుర్మా, కిచడీ, టమోటా చట్నీ, సాంబారుతో కలిపిన భోజనం, ఇలా రోజుకో వెరైటీ చొప్పున రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తూ ఆనందంగా ఉంటున్నామంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఏ రోజైనా బువ్వమ్మ రాకపోయినా.. అన్నం పెట్టే ఆ అమ్మపై అందరూ అలకబూనుతారు. కాలేకడుపుతో ఉన్న హమాలీలను, పేద రైతులను అక్కున చేర్చుకొని రుచికరమైన భోజనం వడ్డించగానే అలకమాని చకచకా పనులకు సాగుతారు.
ఇంతకు ఎవరబ్బా అందరి మనస్సుల చూరగొన్న ఆ బువ్వమ్మ అనుకుంటున్నారా... అసలు కథ చదవాల్సిందే..
పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసముండే 65 ఏళ్ల వృద్ధురాలు మహబీ, అలియాస్ బువ్వమ్మ తన భర్త ఇమాంసాహెబ్తో కలిసి ఇప్పటికీ నిత్యం కష్టపడుతూ ఎందరో నిరుపేద కూలీల కడుపులు నింపుతోంది. ఉదయమే ఇంట్లోని కట్టెల పొయ్యి మీదనే రకరకాల టిఫెన్లు తయారు చేస్తూ తెల్లవారగానే మార్కెట్‌కు తీసుకొస్తుంది. నిరుపేదకూలీలందరూ ఆమె ముంగిట వాలిపోయి కడుపునిండా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదీ కొన్నా రూ.20కి పైమాటే ఉంది కాదా.. ఎలా ఇంతటి నాణ్యమైన భోజనం పెడుతున్నావు అవ్వా అని ఎవరైనా అడిగితే దేవుడిస్తున్నాడు.. భోజనం పెడుతున్నా.. అంతే.. అంటూ చిరునవ్వుతో సమాధానమిస్తుంది.
మనుమరాళ్లకు ఆమెనే అమ్మ...
బువ్వమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. రెండో కుమార్తె జుబేదా అకాలంగా మతి చెందింది. ఆమె భర్త ఖాజాహుసేన్ కూడా అడ్రస్ లేకుండా పోయాడు. వారి సంతానం బాధ్యత కూడా ప్రస్తుతం అవ్వే మోస్తోంది. తన కుమార్తెకు చెందిన నలుగురు సంతానాన్ని అవ్వే చదివిస్తూ అదనపు భారాన్ని మోస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం పెద్ద మనుమరాళ్లు షర్మిళ, మహబూబ్‌జాన్ నర్సు ట్రై నింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. మరో మనుమరాలు షాజాన్ ఇంటర్మీడియట్, మనుమడు అమీన్‌బాషా 8వ తరగతి చదువుతున్నారు. వారందరి బాధ్యత బువ్వమ్మవ్వే తీసుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
కాసింత గూడు కల్పించండి... మహబీ, (బువ్వమ్మ)
సొంత స్థలం ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నాం. అధికారులు స్పందించి ప్రభుత్వ పథకంలో ఓ ఇంటికి మంజూరు చేయిస్తే బాగుంటుంది.