పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది
ముల్తాన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడిన పాకిస్థానీ మహిళా ఉగ్రవాది తష్ఫీన్ మాలిక్.. గతంలో పాకిస్థాన్లోని ముల్తాన్లో గల ఓ మదర్సాకు వెళ్లి, అక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. మహిళలకు ఖురాన్ గురించి అవగాహన కల్పించే అల్- హుదా మదర్సాలో తష్ఫిన్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో తష్ఫిన్ కోర్సును పూర్తి చేయకుండా మధ్యలోనే మానేసినట్లు మదర్సా సిబ్బంది విచారణ అధికారులకు తెలిపారు.
అల్- హుదా మదర్సా అమెరికాతో పాటు పలు దేశాల్లో శాఖలను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థ తాలిబాన్ బావజాలాన్ని వ్యాప్తి చేస్తుందనే విమర్శలు ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు లేవు. తాజా సమాచారంతో సంస్థ కార్యకలాపాలను నిఘా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.