వనరుల ఖిల్లా జయశంకర్ జిల్లా
భూపాలపల్లి/ములుగు : ఆచార్య జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, అపారమైన అడవులు, బొగ్గు నిక్షేపాలు, థర్మల్ విద్యుత్ కేంద్రం, కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, గిరిజన దేవతల జాతర ఇక్కడి ప్రత్యేకత. భౌగోళికంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, గోదావరి నదీతీరం కలిగి ఉండి 20 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో జిల్లా అవతరించింది. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అభివృద్ధికి ఇక తిరుగులేదని చెప్పవచ్చు.
సిరులు కురిపించే సింగరేణి
భూపాలపల్లి మండలం కాశీంపల్లి గ్రామ సమీపంలో 1983 జూలై 15న అప్పటి ముఖ్యమంత్రి ఎ¯ŒSటీ.రామారావు కేటీకే–1 గని తవ్వకాలను ప్రారంభించారు. అప్పుడు 250 మంది కార్మికులతో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. ప్రస్తుతం కేటీకే–1, 2, 5, 6, లాంగ్వాల్ భూగర్భగనులు, ఒక ఓపె¯ŒSకాస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. కేటీకే–3 భూగర్భగని, కేటీకే ఓసీపీ–2, కేటీకే–5 స్థానంలో లాంగ్వాల్ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. మొత్తం 25 డిపార్ట్మెంట్లతో కలిపి 6,619 మంది కార్మికులు, 171 మంది అధికారులు మొత్తం 6,790 మంది సింగరేణి ఉద్యోగులు, 960 అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నారు.
అపారమైన బొగ్గు నిల్వలు
మల్హర్ మండలం తాడిచర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీకే–1 ఇంక్లై¯ŒS వరకు, గణపురం మండలంలోని లాంగ్వాల్ ప్రాజెక్ట్ నుంచి మల్యాలపల్లి వరకు, వెంకటాపూర్, పస్రా మండలాల్లో అపార బొగ్గు నిక్షేపాలున్నాయి. కొత్త గనుల తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసింది.
సూపర్ పవర్ స్టేషన్ కేటీపీపీ
గణపురం మండలం చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లో 500, 600 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా సాగుతోంది. రెండు ప్లాంట్లలో అధికారులు, సిబ్బంది, కార్మికులు సు మారు 3 వేల మంది వరకు పని చేస్తుంటారు. సింగరేణి, కేటీపీపీలతో జిల్లా కేంద్రం పరిశ్రమల ఖిల్లాగా మారింది. బొగ్గు, గోదావరి నీరు, విద్యుత్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తుండటంతో భవిష్యత్లో మరిన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పడనున్నాయి.
విస్తీర్ణం, అడవుల్లో ఫస్ట్..
విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అతి పెద్దది. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం 6175.21 చదరపు కిలో మీటర్లు ఉంటుంది. ఇక్కడ అటవీ ప్రాంతం నాలుగు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ములుగు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలు, ఇటీవల చేరిన భద్రాచలం నుంచి చేరిన వాజేడు, వెంకటాపుం(ఎం), మంథని నియోజకవర్గంలోని కాటారాం, మహదేవపూర్, మల్హల్రావు, ముత్తారం, భూపాలపల్లిలో వేలాది కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి.
ఆధ్యాత్మిక శోభ
జాతర మేడారం : ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ ఈ జిల్లాకు ప్రత్యేకం. మేడారం జాతరను 1967లో దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1968 నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. జాతరను 1996 జనవరి 1న అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా భక్త జనుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2016లో సుమారు కోటి మంది భక్తులు వన దేవతల సన్నిధికి వచ్చారు.
కాళేశ్వరం త్రివేణీ సంగమం
దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఈ జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలువనుంది. గోదావరి నది ఒడ్డున, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు అత్యంత దగ్గరలో కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయానికి మూడు రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగా లున్నాయి. ఒకటి కాలుడు(యముడు), ముక్తీశ్వరుడిగా(శివుడు) పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరినది, అంతర్వాహిణి నుంచి సరస్వతీ నదులు కలసిన చోట త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది. ఈ మూడు నదులకు పుష్కర కాలంలో మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పుష్కరాలు నిర్వహించడం మరో విశేషం.
పర్యాటక అందాలకు నిలయం
వెంకటాపురం మండలం పాలంపేట పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ని లక్నవరం సరస్సులు నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటాయి. ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించడానికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. వీటితో పాటు గణపురం మండలంలోని గణపసముద్రం, రేగొండలోని పాండవులగుట్టలు, తాడ్వాయి అడవుల్లోని వనకుటీరాలు, వాజేడు మండలంలోని బొగత జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
జాతీయ రహదారితో రవాణా సులువు
సహజ వనరుల ఖిల్లాగా ఉన్న భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారితో మరింత అభివృద్ధి చెందనుంది. గుడెపహడ్ నుంచి భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాటారం నుంచి మహాముత్తారం మీదుగా మణుగూరు, కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. జమ్మికుంట నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలై¯ŒS ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. ఇది పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు సులువై పలువు కానున్నాయి.
వ్యవసాయానికి ఇరిగేషన్ దన్ను
రామప్ప, లక్నవరం, మల్లూరు ప్రాజెక్టు, గణపసముద్రం కింద వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మహదేవ్పూర్, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే మహదేవపూర్, కాటారం, మల్హల్రావు, మహాముత్తారం మండల పరిధీలో, వెంకటాపురం(ఎ) పాలెం ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక దేవాదుల(చొక్కారావు) ప్రాజెక్టు, గోవిందరావుపేట గుండ్లవాగు ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగు నీరందుతుంది. ఏటూరునాగారం గోదావరి నదీ పరవాహక ప్రాంతాలు మిరప పంటకు ప్రత్యేకం. మల్హర్ మండలంలో పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో ప్రాధాన్యత ఉంది. వీటితో పాటు జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలు ప్రధాన పండిస్తారు.
గోదావరి పరివాహక ప్రాంతాలు
గోదావరి నది కాటారం మండలం దామెరకుంట వద్ద ప్రారంభం అయి మహదేవపూర్ మండలం అన్నారం, కాళేశ్వరం, అంబట్పల్లి మీదుగా సుమారు 25 కిలో మీట ర్లు ప్రవహించి వాజేడు మండలం సరిహద్దుల నుంచి ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మంగపేట మీదుగా భద్రాద్రి జిల్లాలోకి అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతుంది.