ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
► పెద్ద నోట్ల రద్దుతో అంతా నష్టం
►సీపీఐ ఆధ్వర్యంలో ఎస్బీఐ వద్ద ధర్నా
ఒంగోలు టౌన్ :పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంకు మెరుున్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి బ్యాంకు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా బడుగు జీవులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ డబ్బులు మార్చుకునేందుకు అనేకమంది రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
చిన్న వ్యాపారాలు, వీధి అమ్మకందారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ఏటీఎంల వద్ద నో క్యాష్ అనే బోర్డులు ఉండటంతో ప్రజలు ఎక్కడ ఉంటాయా అని చక్కర్లు కొడుతూనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన పెడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అభ్యుదయ వేదిక గౌరవాధ్యక్షుడు షంషీర్ అహ్మద్, సీపీఐ జిల్లా నాయకుడు ఎస్డీ సర్దార్, నగర నాయకులు కే వెంకటేశ్వర్లు, ఎస్కే మస్తాన్, కే నాగేశ్వరరావు, కే లక్ష్మయ్య, కే అజయ్, పీవీ కృష్ణ, సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో సిండికేట్ బ్యాంకు వద్ద నిరసన...
పెద్దనోట్లను రద్దు చేసి తగినంత చిన్న నోట్లను అందుబాటులో ఉంచకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక భాగ్యనగర్లోని ఎల్డీఎం కార్యాలయం, సిండికేట్ బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నగర నాయకుడు దామా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మూతపడుతూనే ఉన్నాయన్నారు. తక్కువ మొత్తంలో నగదు జమచేస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయన్నారు. కొత్త నోట్లు వచ్చేంత వరకు పాత నోట్లు చలామణిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఏటీఎంలలో ప్రజలకు సరిపడా నోట్లు ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర నాయకులు కే బాలచంద్రం, ఎం.సుబ్బారావు, కేఎఫ్ బాబు, ఏ శ్రీనివాసులు, ఏ సీతామహాలక్ష్మి, సీహెచ్ రమాదేవి, శ్యామ్, ఎస్కే హరికృష్ణ, బీ వెంకారెడ్డి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం ఎల్డీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు.