వంద సినిమాలకు వందనం
పుస్తక పరిచయం
వందేళ్ల తెలుగు సినిమాను, వంద సినిమాల విశేషాలతో చెప్పడం అరుదైన ప్రయత్నమే. అయినా ఆ సంక్లిష్టతను సరళతరం చేయడంలో చాలా వరకు సఫలం అయ్యారు పులగం చిన్నారాయణ. సినీ జర్నలిస్టుగానే కాకుండా, సినిమా మీద పెంచుకున్న విపరీతమైన ఆసక్తి కూడా ఆయనను ఈ పుస్తకం రాయడానికి ప్రోత్సహించి ఉండొచ్చు. పాఠకుడికి ఆసక్తి కలిగించే తెర వెనుక విశేషాలు పులగం తప్ప ఇంకెవరూ ఇంత బాగా చెప్పలేరేమో అనిపిస్తుంది.
1932లో విడుదలయిన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ నుంచి 2002లో వచ్చిన ‘హృదయాంజలి’ వరకు ఎంచుకున్న వంద సినిమాల గురించిన వందల కొద్దీ ఆసక్తి కలిగించే విశేషాలతో వెండితెరలాగే పుస్తకంలోని ప్రతిపేజీ కూడా తళతళలాడుతుంది. టూకీగా కథని పరిచయం చేయడమే కాకుండా, సినిమాలో కీలకంగా వ్యవహరించిన వారి ఇంటర్వ్యూలను సైతం ప్రచురించారు. సినిమాలో ఆ పాత్రలు, వాటి నేపథ్యం, ఆయా సినిమాలు సృష్టించిన రికార్డులు, వసూలు చేసిన కలెక్షన్లు కూడా శ్రద్ధగా అక్షరబద్ధం చేశారు. పాత సినిమాల పోస్టర్లు, నటులు, దర్శకుల అరుదైన ఫొటోలు అదనపు ఆకర్షణ. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ప్రియులకు ఇది పసందైన ‘పులగం’!
పసిడితెర; రచన: పులగం చిన్నారాయణ; పేజీలు: 512; వెల: 350; ప్రచురణ: విజయా పబ్లికేషన్స్, విజయా గార్డెన్స్, 317, ఎన్.ఎస్.కె. శాలై, వడపళని, చెన్నై–600026. రచయిత ఫోన్: 8897798080
వాసవీ మోహన్