సీఈఓ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్
కోల్డ్‌వార్
⇒ పనుల మంజూరులో పట్టింపులు
⇒ ప్రతిపాదనలు తిరస్కరించిన సునీత
⇒ బదిలీ చేయాలని ప్రభుత్వానికి లేఖ
⇒ నిలిచిన అభివృద్ధి పనులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రజాపరిషత్‌లో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, సీఈఓ చక్రధర్‌రావు మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
జెడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనుల మంజూరు విషయమై ఇద్దరి మధ్య అంతరానికి దారితీసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.2.51 కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడింది.
ప్రతి మండలానికి సగటున రూ.15 లక్షల చొప్పున (దాదాపు 130 పనులు) నిధులు మంజూరు చేయాలని నిర్ణయించిన జిల్లా పరిషత్ పాలకవర్గం.. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కోరింది. ఈ క్రమంలోనే సీఈఓ చక్రధర్‌రావు ఆయా మండలాల జెడ్పీటీసీ సభ్యుల సిఫార్సు లేఖలకు అనుగుణంగా ప్రతిపాదనలను పాలనాపరమైన అనుమతి కోసం చైర్‌పర్సన్‌కు పంపారు.ఈ ఫైలును పరిశీలించిన సునీత.. తాను సూచించిన పనులు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే పనులు కూడా పూర్తయిన వాటికి కొత్తగా ప్రొసిడింగ్స్ ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫైలును తిప్పిపంపారు. మళ్లీ తాజాగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఈ పరిణామంతో నొచ్చుకున్న సీఈఓ చక్రధర్‌రావు.. నిబంధనల మేరకే న డుచుకున్నానని, తన విచక్షణాధికారాన్ని కూడా అధ్యక్షురాలు హరించేలా వ్యవహరించడమేమిటనీ.. ఫైలును పక్కనపెట్టారు. ఈ ఇరువురు పట్టింపులకుపోవడంతో రెండు నెలల క్రితం మంజూరు కావాల్సిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. అభివృద్ధి పనులేకాకుండా బిల్లుల చెల్లింపులోనూ సీఈఓ ఏకపక్ష వైఖరిపై సునీత అసంతృప్తితో ఉన్నారు. మంత్రులు, జెడ్పీ సర్వసభ్య సమావేశాల సమయంలో నాసిరకం భోజనం వడ్డించి.. భారీ మొత్తంలో బిల్లులు డ్రా చేసినట్లు గుర్తించిన ఆమె ఈ వ్యవహారంపై కూడా నిలదీసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
సాగనంపాల్సిందే..!
జిల్లా పరిషత్ కార్యకలాపాల్లో తనను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఈఓను సాగనంపేందుకు సునీత తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన ఆమె.. సీఈఓగా బీసీ సంక్షేమశాఖ ఉపసంచాలకులుగా పనిచేస్తున్న వి.వి రమణారెడ్డికి పోస్టింగ్ ఇవ్వాలని సిఫార్సు కూడా చేశారు. ఈ పరిణామంతో అవాక్కయిన చక్రధర్‌రావు.. బదిలీ అయినా పరవాలేదు.. నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేసేదిలేదని భీష్మించుకుకూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సునీత కూడా ఈ వ్యవహారంలో మెట్టుదిగేదిలేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఫైలు అట్టిపెట్టుకుంటారో చూస్తానని, అప్పటివరకు వేచి చూస్తానని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా, ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపడం అధికారులు, జెడ్పీటీసీ సభ్యులకు తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పనులు మంజూరు చేయకుండా నెలల తరబడి ఫైలును పెండింగ్‌లో పెట్టిన చైర్‌పర్సన్‌ను ఏమీ అనలేక.. తిప్పి పంపిన ఫైలును మళ్లీ పంపక అట్టిపెట్టుకున్న సీఈఓను నిలదీయలేక సతమతమవుతున్నారు.