అనుచరుడే కాలయముడు
నందిగామలో చందాపురం మాజీ సర్పంచి దారుణహత్య
తుపాకీతో కాల్చి చంపిన అనుచరుడు
నివ్వెరపోయిన పశ్చిమ కృష్ణా
నందిగామ : జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు, చందాపురం గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు(42) మంగళవారం తుపాకీ తూటాలకు బలయ్యారు. నందిగామలో జరిగిన ఈ ఘటన పశ్చిమ కృష్ణా ప్రజలను నివ్వెరపరిచింది. సేకరించిన సమాచారం ప్రకారం.. పట్టణంలో జాతీయ రహదారి పక్కనే శ్రీరామలింగేశ్వరనగర్లో ఉన్న ట్రాక్టర్ షోరూంలోని తన కార్యాలయానికి శ్రీశైలవాసు ఉదయాన్నే వచ్చారు. తరువాత కొద్దిసేపటికి ఇటీవలి వరకు ఆయన అనుచరుడుగా ఉన్న ఉన్నం హనుమంతరావు, అతని స్నేహితుడు, హైదరాబాద్‌కు చెందిన పాషా అక్కడకు వచ్చారు. వాసు గదిలోకి వారు వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ నవీన్, మరొక అనుచరుడు విష్ణు అక్కడ ఉన్నారు. హనుమంతరావు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడనే ఉద్దేశంతో వారిద్దరూ బయటకు వచ్చారు. వాసు తన ఇంటి దగ్గర ఉన్న ఫైల్‌ను తీసుకురావాలని చెప్పడంతో నవీన్ చందాపురం వెళ్లారు. తరువాత కొద్దిసేపటికి గదిలోనుంచి పెద్ద శబ్దం రావడాన్ని బయట వేచి ఉన్న విష్ణు విన్నాడు. అతడు లోపలికి వెళుతుండగా.. టీవీ పేలిందని చెప్పుకుంటూ హనుమంతరావు, పాషా బయటకు పరుగులు నందిగామ ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద వాసు మరణ వార్త తెలియగానే పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు, ప్రజలు .
వివరాలు సేకరించిన క్లూస్‌టీమ్
వాసు హత్య జరిగిన ప్రాంతాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు పరిశీలించాయి. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. నందిగామ సీఐ భాస్కరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ డీఎస్పీ రాజేష్ మురళి పర్యవేక్షణలో రూరల్ సీఐ రామ్‌కుమార్, నందిగామ ఎస్ఐలు తులశిరామకృష్ణ, ఏసుబాబు, నందిగామ డివిజన్లోని ఎస్ఐలు పట్టణంలో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ విజయకుమార్ పరిశీలించారు. నందిగామ మార్చూరీలోని ఆయన మృతదేహాన్ని కూడా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాసు హత్యకు కోటి రూపాయల ఆర్థిక లావాదేవీలే కారణమని తెలిపారు. జిల్లాలో తుపాకీ హత్యలు పెరుగుతున్నాయని, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. స్పెషల్ డ్రైవ్ ద్వారా లెసైన్స్ లేని తుపాకీలు ఉన్న వారిని గుర్తిస్తామని ఎస్పీ బదులిచ్చారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వాసు హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
కుట్ర దాగి ఉంది : సారథి, ఉదయభాను
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే బొగ్గవరపు శ్రీ శైల వాసు హత్య జరిగిందని ఎస్పీ విజయకుమార్ ప్రకటించడం తగదని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నాయకుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల వైఫల్యం కారణంగానే జిల్లాలో హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడను రాజధానిగా ప్రకటించిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు తుపాకుల హత్యా సంస్కృతిని జిల్లాలో ప్రారంభించారని పేర్కొన్నారు. బొగ్గవరపు శ్రీశైల వాసు తమ పార్టీలో సీనియర్ నాయకుడని, ఆయన సేవాభావం కలవారని కొనియాడారు. వాసు హత్య వెను కుట్ర దాగి ఉందన్నారు. ఎస్పీకి సారథి ఫోన్ చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, వాసు హత్య వెనుక ఉన్న కుట్రను వెలికితీయాలని కోరారు. వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ తన ఆత్మీయుడు వాసు హత్యకు గురవడం కలచివేసిందని చెప్పారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.