చికెన్ వండలేదని భార్యపై ఘాతుకం
శివమొగ్గ: చికెన్ వండటంలో ఆలస్యం చేసిందని ఆగ్రహిస్తూ ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్య చేయడానికి యత్నించిన ఘటన సోమవారం సాయంత్రం కర్ణాటక శివమొగ్గ నగరంలోని సోళేబైలూ లేఔట్లో ఉన్న ఈద్గా నగర్లో చోటు చేసుకుంది. బాధితురాలి ఇక్కడి మొగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుంగా నగర పోలీసుల వివరాల మేరకు... సురేశ్, ఆశారాణి(33) దంపతులు నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన సురేశ్ సోమవారం సాయంత్రం చికెన్ తీసుకుని ఇంటికి వచ్చి కూర వండమని చెప్పి బయటకు వెళ్లాడు.
కొద్దిసేపు అనంతరం ఇంటికి వచ్చాడు. భార్య చికెన్ వండకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సురేశ్ భార్యతో గొడవకు దిగాడు. చికెన్ వండకుండా ఏమీ చేస్తున్నావంటూ ఘర్షణ పడ్డాడు. ఆగ్రహంతో ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని భార్య గొంతుకోశాడు. దీంతో ఆశారాణి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కిందపడిపోయిన బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.