మార్క్‌ఫెడ్.. మోసం!
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మార్క్‌ఫెడ్ జారీ చేసిన చెక్కు బౌన్స్ కావడంతో రైతన్న నివ్వెరపోయాడు. సాక్షాత్తు ప్రభుత్వ సంస్థే ఇలా మోసం చేస్తే ఎలా అని వాపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన హలావత్ తుకారాం.. తాను పండించిన 71 క్వింటాళ్ల మక్కలను గత డిసెంబర్లో రామాయంపేట మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఇందుకు సంబంధించిన డబ్బు కోసం రైతు నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ అధికారులు రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ శాఖకు చెందిన ఖాతా ద్వారా చెల్లించేలా రైతు తుకారం పేరున మార్చి28న 92,355 రూపాయల చెక్కును అందించారు.
రైతు చిన్నశంకరంపేట ఎస్బీఐలోని తన ఖాతాలో చెక్కును జమచేశారు. నెల రోజులుగా వేచి చూసినా మార్క్‌ఫెడ్ ఖాతాలో డబ్బులు చేరకపోవడంతో రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ అధికారులు చెక్కును వెనక్కి పంపారు. దీంతో శుక్రవారం ఎస్బీఐ శంకరంపేట అధికారులు చెక్కు బౌన్స్ అయిందని ఇచ్చేశారు. దీంతో రైతుకు ఎటు పాలుపోని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోగా.. తీరా చెల్లని చెక్కు ఇచ్చారని రైతు తుకారాం వాపోయాడు. తనకు వెంటనే డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ స్పందించాలి
రైతుకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ స్పందించాలని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజ్ రమణ, కామారం మాజీ సర్పంచ్ సుధాకర్‌లు డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా అందించిన చెక్కు బౌన్స్‌కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై నమ్మకం సడలకముందే కలెక్టర్ స్పందించాలని కోరారు.