chowdeshwari temple
-
కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి
భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా హిందూపురం మండలంలోని కొటిపి చెరువు వద్ద వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయం విరాజిల్లుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చాలని చీర, సారే, గాజులు సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో ఆలయం వద్ద భక్తులు నిద్ర చేస్తుంటారు. ఈ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చోళులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి సమర్పించిన కానుకలను బహిరంగంగా పెట్టి ఉంటారు. వీటిని ఎవరూ తీసుకెళ్లారు. సంవత్సరాల తరబడి ఆలయం ముఖద్వారం వద్ద ఎడమవైపున ఉన్న నాగుల కట్ట వద్ద గుట్టగుట్టలుగా గాజులు, చీరలు పడేసి ఉంటారు. ఆలయానికి చేరుకోవాలంటే హిందూపురం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి కొటిపి చెరువును చేరుకోవాల్సి ఉంటుంది. హిందూపురం నుంచి ప్రత్యేకంగా ఆటోలు తిరుగుతుంటాయి. లేదంటే సొంత వాహనాల్లో వెళ్లి రావచ్చు. - హిందూపురం రూరల్ -
కనుల పండువగా చౌడేశ్వరీ జ్యోతి
అమడగూరు(పుట్టపర్తి) : చల్లని తల్లి చౌడేశ్వరమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ అనేక మంది భక్తులు శనివారం అమ్మవారిని వేడుకున్నారు. గత ఐదు రోజులుగా మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ జ్యోతి ఉత్సవాన్ని కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. జ్యోతి ఉత్సవంలో ఎప్పటిలాగానే పొట్టా పురుషోత్తమరెడ్డి రథసారథిగా అమ్మవారిని ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి దగ్గర వరకూ తీసుకెళ్లి భక్తుల సౌకర్యార్థం కొలువుదీర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కొబ్బరికాయలను సమర్పించారు. ఊరేగింపులో చౌడేశ్వరీ అమ్మవారు దేదీప్యమానంగా కాంతులను విరజిమ్ముతున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులంతా జై చౌడేశ్వరీ మాతా అంటూ హోరెత్తించారు. అనంతరం కోలాటాలు, భజనలు, హరికథల వంటి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో చండీయాగం నిర్వహింపజేశారు. ఉత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శివరాముడు, ఎస్ఐలు చలపతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమాదేవి, జయదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
అమడగూరు : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రారంభమైన కుంభకూడు కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దొనకొండ వెంకటరమణ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ముత్యాల జొన్నలతో వండిన కూడును అమ్మవారి ఎదుట ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కుంభం వలే రాశిగా పోసి. పూల కుచ్చును ఏర్పాటు చేశారు. ఆనవాయితీ ప్రకారం జంతు బలి ఇచ్చారు. కుంభకూడు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
భక్తుల కొంగు బంగారం చౌడేశ్వరీదేవి
సందర్భం : రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు భక్తుల కొంగుబంగారంగా అమడగూరులోని చౌడేశ్వరీదేవి విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఛైత్ర మాసంలో ఈ ఆలయంలో చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాలను ఎనిమిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. - అమడగూరు (పుట్టపర్తి) క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం అమరావతి పట్టణంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యే సోదరులు కిష్టప్ప, శ్రీనివాసులు తమ బంధువులతో కలిసి రూ. కోటి వెచ్చించి, మూడు గోపురాలతో జీర్ణోద్ధరణ గావించారు. ఆలయం పేరిట ఓ కల్యాణమంటపాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఇటీవల మరో రూ. 10 లక్షలు వెచ్చించి ఆలయం చుట్టూ రేకుల షెడ్ వేశారు. అమ్మవారి ఉత్సవాలు ఇలా.. ప్రతి ఏటా ఛైత్రమాసంలో ఉగాది సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల్లో ఊరేగింపునకు తీసుకెళ్తారు. తర్వాత వచ్చే పున్నమితో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 11న ప్రారంభం కానున్నాయి. 11న కొత్తపల్లి దొనకొండ వెంకటరమణ కుటుంబీకులు కుంభకూడు, 12న శీతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలచే ఉయ్యాలసేవ, 13న చీకిరేవులపల్లి, రెడ్డివారిపల్లికి చెందిన పెద్దక్క, రాజు కుటుంబీకులచే సూర్యప్రభ, 14న అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టిబలిజ సంఘం వారిచే చంద్రప్రభ, 15న కొత్తపల్లికి చెందిన పొట్టా కుటుంబీకులచే శ్రీజ్యోతి, 16న రెడ్డివారిపల్లికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబీకులచే అశ్వ వాహన, 17 న కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులచే సింహ వాహన, 18న గాజులపల్లికి చెందిన సుబ్బరాయప్ప కుటుంబీకులచే హంస వాహన సేవలు ఉంటాయి. కాగా ఈ ఉత్సవాల్లో 15న జరిగే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. -
వైభవం.. జ్యోతి మహోత్సవం
నందవరం(బనగానపల్లె రూరల్) : గ్రామంలోని చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, రథ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం ఆలయ ఈఓ రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి భాస్కరయ్య ఆచారి ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవి అమ్మవారికి దిష్టి చుక్కపెట్టు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయ ఆవరణ నుంచి జ్యోతి మహోత్సవం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చౌడేశ్వరిదేవి భక్తులు, తొగట వీరక్షత్రియులు అవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం పాకంతో తయారు చేసిన సుమారు 460 జ్యోతులను తలపై పెట్టుకుని చౌడేశ్వరిదేవి భక్తిగీతాలు పాడుతూ, కాళిక నృత్యం చేసుకుంటూ అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. భక్తులు గుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారికి పట్టుచీర, నైవేద్యం సమర్పించారు. పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం(పోవడం) జరిగింది. గ్రామంలోని ఆలయ ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. -
ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం
హిందూపురం రూరల్ : మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గొర్రెలు, మేకలను బలి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకువచ్చి రథోత్సవంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి నామస్మరణల నడుమ భక్తులు రథాన్ని ముందుకు లాగారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు బెంగళూరు, గౌరిబిదనూరు తమిళనాడు నుంచి అమ్మవారు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారికి చీర, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం
లేపాక్షి/ చిలమత్తూరు (హిందూపురం) : ఉగాది పండుగను పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామంలో చౌడేశ్వరీదేవి రథోత్సవం వైభవంగా జరిగింది. గ్రామస్తులంతా కలిసి అమ్మవారిని గర్భగుడి నుంచి పల్లకీ సేవ ద్వారా ఊరేగించి రథంలో కొలువుదీర్చారు. అనంతరం రథాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు లాగారు. కార్యక్రమంలో సర్పంచ్ కదిరప్ప, ఉప సర్పంచ్ నాగరాజు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నారాయణస్వామి, నాయకులు కూతుల శీనా, యు.మూర్తి, మోహన్, బి.మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు నానెప్ప, చౌడప్ప, కేశప్ప, టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జయచంద్ర, బీజేపీ నాయకుడు చౌడప్ప, సీపీఐ నాయకుడు శివప్ప, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. చిలమత్తూరులో గ్రామ దేవత చౌడేశ్వరీ మాతా గ్రామోత్సవం బుధవారం కనులపండువగా సాగింది. ఉత్సవ విగ్రహాన్ని పలు రకాల పూలతో రమణీయంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. -
చౌడేశ్వరిదేవిదేవి ఉత్సవాలు ప్రారంభం
నందవరం(బనగానపల్లె రూరల్): మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శక్తిమాత చౌడేశ్వరిదేవి మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ఈవో రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు రాయబారాది, జ్యోతి రథ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. చెరువుపల్లె, తిమ్మాపురం, జిల్లెల్ల, నందవరం గ్రామాల నుంచి భక్తులు పన్నేరపు బండ్లపై ఆలయానికి చెరుకొని చౌడేశ్వరిదేవికి మొక్కులు తీర్చుకున్నారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు
నందవరం(బనగానపల్లె రూరల్): గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, మహోత్సవాలు బుధవారం నుంచి ఏప్రిల్ 4 వరకు ఉంటాయని ఆలయ కార్య నిర్వాణాధికారి రామానుజన్ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి అంకురార్పణ, పంచాగ శ్రవణం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పన్నేరపు బండ్లు తిప్పడం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాల సందర్భంగా పాణ్యం సీఐ పార్థసార««థిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్లు నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. -
వేంపల్లి చౌడేశ్వరీ ఆలయంలో చోరీ
వేంపల్లి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని చౌడేశ్వరీ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పిరమిడ్ నగర్ లో వున్న ఈ ఆలయంలోని విలువైన వెండి కిరీటం, హుండీని దొంగలు దోచు కెళ్లారు. ఆలయ పూజారి ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన సమయంలో.. చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. -
వైభవం..జ్యోతి ఉత్సవం
ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. మహాలయ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో తొగటవీర క్షత్రియులు జ్యోతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచే ఉత్సవాలు ప్రారంభమై 9.30 వరకు జరిగాయి. గ్రామ చావిడి నుంచి ఉరేగింపు ప్రారంభం కాగా.మహిళలు, చిన్నారులు కలశాలతో వెళ్తుంటే భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకొని ‘ శాంభవి మమ్ముల్ని కాపాడు’ అంటూ నాట్యం చేస్తు, పాటలు పాడారు. వీరితో మరి కొందరు యువకులు, బాలికలు.. నాలుక, పెదవులు, దవడలు, చేతులు, స్వరం మీద కడ్డీలతో గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. అలాగే మరి కొందరు భక్తులు ‘ అమ్మా శాంభవి’ అంటూ కత్తులతో కడుపు, నడుముకు కోసుకుంటూ రక్త తర్పణం చేశారు. -
చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కోస్గి (కర్నూలు) : కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్పవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. -
నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి
చిత్తూరు(చౌడేపల్లి): అడవి జంతువులను హతమార్చేందుకు పెట్టిన నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి చెందాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెదకొండమూరు పరిధిలోని అటవీప్రాంతంలో అడవి జంతువుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ గొర్రెల కాపరికి చెందిన పెంపుడు కుక్క చనిపోయింది. అలాగే నాగిరెడ్డిపల్లిలో కొన్ని రోజుల కిందట ఓ ఆవు మృతి చెందింది.