civil supply officers
-
వెంబడించి పట్టుకున్నారు..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్మూర్ నుంచి శుక్రవారం రాత్రి నిజామాబాద్‌కు 24.30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బస్తాలతో వస్తున్న టీఎస్16 యూబీ 3872 నంబరు గల వ్యాన్‌ను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్, జిల్లా సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఆర్మూర్ నుంచి వ్యాన్‌ను వెంబడించగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు వరకు వచ్చిన డ్రైవర్ అధికారుల రాకను గమనించి రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. అయితే వ్యాన్‌లో 55 బస్తాలతో ³పీడీఎస్ బియ్యం ఉండగా, బస్తాలను నిజామాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. వ్యాన్‌ను నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అయితే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ మీదుగా పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న వ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది? సంబంధిత వ్యక్తులెవరు? వ్యాన్ ఎవరిది..? డ్రైవర్ ఎవరనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో విచారించి వివరాలను తెలుసుకుంటామని డీఎస్వో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. పీడీఎస్ బియ్యంను పట్టుకున్న వారిలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ డీటీ శంకర్, సిబ్బంది ఉన్నారు. -
రేషన్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు
నల్లగొండ : రేషన్ దుకాణాల్లో సివిల్ సప్లయీస్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పండుగ సీజన్ కావడంతో దుకాణాల్లో బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదని స్థానికులు సివిల్ సప్లయీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డైరక్టరేట్నుంచి ఆదేశాలు రావడంతో గురువారం ఉదయం డీఎస్ఓ ఆధ్వర్యంలో ఆరుగురు డీటీలు నల్లగొండ పట్టణంలోని ఏడు రేషన్ దుకాణాలు, ఒక ఆయిల్ ఏజెన్సీని తనిఖీ చేశారు. అనుమతి లేకుండా బొట్టుగూడలో వం టనూనెల ఏజెన్సీ నిర్వహిస్తున్న దుకాణాన్ని డీఎస్ఓ సీజ్ చేశారు. దుకాణంలోని రూ.3.28 లక్షల విలువ చేసే స్టాక్‌ను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీ ఏర్పాటు చేసినందున 6 ఏ కింద కేసు నమోదు చేశారు. దేవరకొండ, బొట్టుగూడలోని రేషన్ దుకాణాలు తనిఖీ చేసిన అధి కారులు బియ్యం నిల్వలో స్వల్ప తేడాలు ఉన్న ట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో బియ్యం నిల్వలు తేడాల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో వాటిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు రిపోర్ట్ రాశారు. ఈ తనిఖీల్లో డీఎస్ఓ ఉదయ్ కుమార్, డీటీలు సత్యనారాయణ, రఘు, స యీద్, సంఘమిత్ర, ఇంతియాజ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘సంక్షేమం’లో ‘సన్న’ అన్నం
* జిల్లా వ్యాప్తంగా 146 హాస్టళ్లలో అమలు * రెండు,మూడు రోజుల్లో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి ఇందూరు : ఎప్పుడెప్పుడా అని సంక్షేమ విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. ఇన్ని రోజులుగా తిన్న దొడ్డు అన్నానికి బదులు సన్న అన్నాన్ని గురువారం నుంచి తినబోతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి సంక్షేమ వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు సన్న బియ్యం ద్వారా అన్నం వండిపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 146 వసతి గృహాలకు సివిల్ సప్లయ్ అధికారులు సన్న బియ్యాన్ని సరఫరా చేశారు. 15,114మంది విద్యార్థులకు ప్రతి రోజు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెడతారు. అయితే నెలకు సరిపడా రేషన్ అందుబాటులో లేని సందర్భంగా ప్రస్తుతానికి వారం పది రోజులకు సరిపడే విధంగా రేషన్ సరఫరా చేశారు. మిగతా మొత్తాన్ని త్వరలో సరఫరా చేయనున్నారు. గురువారం నుంచి సన్న బియ్యం వండి పెట్టనున్న నేపథ్యంలో సంబంధిత వసతిగృహ వార్డెన్లు విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా, సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం వండిపెట్టాలని, ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధికారింగా మంత్రిచే ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిచే ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
రైస్ మిల్లుపై మెరుపు దాడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై సివిల్ సఫ్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు కొనసాగిస్తున్నారు. శుక్రవారం స్థానిక గడియారం చౌరస్తాలో ఉన్న రక్షిత రైస్‌మిల్‌పై డీఎస్ఓ సయ్యద్ యాసిన్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. రైస్‌మిల్‌లో ఎలాంటి రికార్డులు లేకపోవడంతో పాటు ఎఫ్‌డీఐ లెసైన్స్ రెన్యువల్ లేని కారణంగా మిల్లులో నిల్వ ఉన్న సరుకును అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ధాన్యంలో హంస వడ్లు 192.75క్వింటాళ్లు, హంస బియ్యం 97.75క్వింటాళ్లు, సోనా బియ్యం 17.5 క్వింటాళ్లు, నూకలు 26.75 క్వింటాళ్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ. 5.24లక్షల వరకు ఉండవచ్చునని అధికారులు పేర్కొన్నారు. రికార్డులు లేకుండా ధాన్యం సేకరించినందుకే సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్‌లో ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే సహించేది లేదని డీఎస్ఓ సయ్యద్ యాసిన్ తెలిపారు. ప్రస్తుతం తమ బృందంతో పాటు, విజిలెన్స్ బృందం జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై మెరుపుదాడులు నిర్వహిస్తుందన్నారు. ప్రతి మిల్లు యజమాని మిల్లో ఉండే స్టాక్‌కు సంబంధించి రికార్డుల నిర్వహించాలని, అలాగే వడ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎఫ్‌డీఐ లెసైన్స్ కలిగి ఉంటూ, యేటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉందన్నారు. మిల్లర్లు ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే తాము దాడులు చేపడుతున్నామని, ఈ దాడుల మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. రక్షిత రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మిల్లో ఉన్న బియ్యం, వడ్లు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చినవని మిల్ యజమానికి సంగప్ప తెలిపారు. అందుకే వాటికే రికార్డుల విషయాన్ని చేపట్టలేదని, ఈ విషయం అధికారులకు చెప్పిన వినిపించుకోకుండా సీజ్ చేశారని చెప్పారు. మిల్లర్లలో దడ ఓ వైపు విజిలెన్స్ బృందం, మరోవైపు డీఎస్ఓ బృందాలు జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై మెరుపుదాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ నిల్వలు ఉంచుకొన్న మిల్లు యజమానుల్లో భయం మొదలైంది. అధికారులు దాడులు ఇలాగే కొనసాగిస్తే బియ్యం ధరలు అదుపులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాడుల్లో ఏఎస్ఓలు దయాకర్ రెడ్డి, మోహన్‌రావు, ఎన్ఫోర్స్మెంట్ డిటీ వెంకటయ్య, కృష్ణమాచారి, స్పెషల్ అర్ఐ రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.