కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై సివిల్ సఫ్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు కొనసాగిస్తున్నారు. శుక్రవారం స్థానిక గడియారం చౌరస్తాలో ఉన్న రక్షిత రైస్‌మిల్‌పై డీఎస్‌ఓ సయ్యద్ యాసిన్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. రైస్‌మిల్‌లో ఎలాంటి రికార్డులు లేకపోవడంతో పాటు ఎఫ్‌డీఐ లెసైన్స్ రెన్యువల్ లేని కారణంగా మిల్లులో నిల్వ ఉన్న సరుకును అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ధాన్యంలో హంస వడ్లు 192.75క్వింటాళ్లు, హంస బియ్యం 97.75క్వింటాళ్లు, సోనా బియ్యం 17.5 క్వింటాళ్లు, నూకలు 26.75 క్వింటాళ్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ. 5.24లక్షల వరకు ఉండవచ్చునని అధికారులు పేర్కొన్నారు. రికార్డులు లేకుండా ధాన్యం సేకరించినందుకే సీజ్ చేసినట్లు తెలిపారు.
అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు
జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్‌లో ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే సహించేది లేదని డీఎస్‌ఓ సయ్యద్ యాసిన్ తెలిపారు. ప్రస్తుతం తమ బృందంతో పాటు, విజిలెన్స్ బృందం జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై మెరుపుదాడులు నిర్వహిస్తుందన్నారు. ప్రతి మిల్లు యజమాని మిల్‌లో ఉండే స్టాక్‌కు సంబంధించి రికార్డుల నిర్వహించాలని, అలాగే వడ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎఫ్‌డీఐ లెసైన్స్ కలిగి ఉంటూ, యేటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉందన్నారు.
మిల్లర్లు ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే తాము దాడులు చేపడుతున్నామని, ఈ దాడుల మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. రక్షిత రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మిల్‌లో ఉన్న బియ్యం, వడ్లు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చినవని మిల్ యజమానికి సంగప్ప తెలిపారు. అందుకే వాటికే రికార్డుల విషయాన్ని చేపట్టలేదని, ఈ విషయం అధికారులకు చెప్పిన వినిపించుకోకుండా సీజ్ చేశారని చెప్పారు.
మిల్లర్లలో దడ
ఓ వైపు విజిలెన్స్ బృందం, మరోవైపు డీఎస్‌ఓ బృందాలు జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులపై మెరుపుదాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ నిల్వలు ఉంచుకొన్న మిల్లు యజమానుల్లో భయం మొదలైంది. అధికారులు దాడులు ఇలాగే కొనసాగిస్తే బియ్యం ధరలు అదుపులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాడుల్లో ఏఎస్‌ఓలు దయాకర్ రెడ్డి, మోహన్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటీ వెంకటయ్య, కృష్ణమాచారి, స్పెషల్ అర్‌ఐ రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లుపై మెరుపు దాడి
Published Sat, Sep 14 2013 4:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement