ఎకానమీ విమాన టికెట్ గరిష్టంగా రూ. 20 వేలే!
న్యూఢిల్లీ: ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎయిర్‌లైన్స్ ఇష్టారీతిగా విమాన ప్రయాణ చార్జీలను పెంచేయకుండా నియంత్రించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎకానమీ తరగతి టికెట్లపై గరిష్టంగా రూ. 20,000 పరిమితి విధించాలని యోచిస్తోంది. ఎకానమీ తరగతి చార్జీలకు కనిష్ట, గరిష్ట స్థాయులు నిర్ణయించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన శాఖ అంతర్గతంగా పంపిన నోట్లో పేర్కొంది.
ఎకానమీ తరగతిలో గరిష్ట చార్జీని సుమారు రూ. 20,000 స్థాయిలో నిర్ణయించవచ్చని, అంతకు మించి వసూలు చేసేందుకు ఎయిర్‌లైన్స్‌ను అనుమతించరాదని అభిప్రాయపడింది. అలాగే, ఇతర సంస్థలతో పోటీ పడే క్రమంలో తమ సొంత ఆర్థిక పరిస్థితి సైతం దెబ్బతినే విధంగా కొన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, కనీసం నిర్వహణ వ్యయాలను కూడా ఆర్జించుకోలేకపోతున్నాయని పౌర విమానయాన శాఖ నోట్లో పేర్కొంది.
ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే సమీప భవిష్యత్‌లో కొన్ని దేశీయ ఎయిర్‌లైన్స్ మూతబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. సర్వీసును బట్టి కిలోమీటరుకి లాభనష్ట రహిత చార్జీకి సముచిత స్థాయిలో లాభం చేర్చి వసూలు చేసుకునేలా ఎయిర్‌లైన్స్‌ని నిర్దేశించవచ్చని పేర్కొంది.