వేతనాలు చెల్లించకుంటే ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వయోజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సాక్షరభారత్ కో ఆర్డినేటర్లకు ఏడాది నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కో ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇనపకుర్తి పోతన్నదొర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం సంవత్సరం నుంచి వేతనాలు ఇవ్వక పోవడం విచారకరమన్నారు. సంక్రాంతి పండుగకైనా జీతాలు చెల్లించాలని కోరారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం పండగపూట పస్తులు లేకుండా చూడాలన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి దుబ్బ కోటేశ్వరరావు మాట్లాడుతూ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలవవ్వడంతో 2,202 మంది కోఆర్డినేటర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. అప్పులు చేసి కేంద్రాలకు వార్తపత్రికలు వేస్తున్నామన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు కొన్ని శ్రీనివాసరావు, అప్పలనాయుడు, కె. చిరంజీవి పాల్గొన్నారు.