సీజ్ చేసిన వాహనాలు మే1న వేలం
ఉప రవాణా కమిషనర్ రాజారత్నం
నిజామాబాద్ కల్చరల్ :వివిధ కారణాలతో, రవాణాశాఖ అధికారులు సీజ్ చేసిన, జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్లు,ఇతర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 140 వాహనాలను మే 1 న వేలం వేయనున్నట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ జి.సి. రాజారత్నం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం వేయనున్న వాహనాలలో 101 ఆటోరిక్షాలు, 23 గూడ్స్ వాహనాలు, 2 టాటా మాజిక్లు, ఒక టాటాఏస్, 2 మ్యాక్సీకాబ్, 11 ఇతర వాహనాలు ఉన్నాయని వివరించారు. ఎక్కడి వాహనాలు అక్కడే వేలం వేస్తామని పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనే అభ్యర్థులు రూ. 55 ఫీజు చెల్లించి, ఉప రవాణా కమిషనర్, నిజామాబాద్ కార్యాలయంలో ఈ నెల 20 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తును పొందవచ్చని తెలిపారు. వేలంలో కొనబోయే వాహనాన్ని ముందుగా చూసి ఎక్కువగా కోట్ చేయాలని, సీల్డ్ కవర్లో దరఖాస్తుతోపాటు సంబంధిత వ్యక్తి గుర్తింపుకార్డు జిరాక్సు కాపీ, చిరునామా ధ్రువపత్రం, డీడీ జతపరిచి, ఉప రవాణా కమిషనర్, నిజామాబాద్ వారి కార్యాలయంలోని డ్రాఫ్ బాక్సులో మే 1 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు వేయాలని ఆయన సూచించారు. దరఖాస్తులను అదేరోజు సాయంత్రం 4 గంటలకు తెరిచి, అధిక ధర కోట్ చేసిన వారికి వాహనం అందజేస్తామని తెలిపారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.