ఉల్లిగడ్డల కోసం రూ.40 కోట్లు
ధర దిగేవరకు ఉల్లి కేంద్రాలు: హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉల్లిగడ్డల సబ్సిడీ కోసం ఇప్పటి వరకు రూ.40 కోట్లు ఖర్చు చేశామని, ఉల్లిగడ్డ ధర దిగివచ్చే వరకు రాష్ట్రంలో ఉల్లిగడ్డ కేంద్రాలను కొనసాగిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన ఎస్ఆర్ఎన్ అనే లోకల్ చానల్ ఆవిష్కరణలో ఆయన ప్రసంగిం చారు. గతంలో ఎన్నోసార్లు ఉల్లిగడ్డ ధరలు పెరిగాయని, కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రజల కోసం సబ్సిడీ ఉల్లి కేం ద్రాలు పెట్టలేదని, ఒక్క కేసీఆర్ మాత్రమే ఇది చేయగలిగారని చెప్పారు.
గత ప్రభుత్వం 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తే... తెలంగాణ ప్రభుత్వం 37 లక్షల మందికి పింఛన్లు ఏకకాలంలో మంజూరు చేసిందన్నారు. ఈ వాస్తవ లెక్కలను పక్కనపెట్టి ప్రతిపక్షాలు పింఛన్లో కోతపెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మీడియా ప్రచారం తగినంతగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.