తెలంగాణ, తమిళనాడు సరైన పనిలో పడ్డాయి...
ఇటీవల దాశరథి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరున ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రతి ఏటా ఇస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి వైతాళికుల కృషి, తెలంగాణ నుంచి వెలువడ్డ ప్రాచీన సాహిత్యం... వీటన్నింటి పరిరక్షణ కోసం కూడా పనులు జరగనున్నాయి. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తాజాగా తమిళ ప్రాచీన సాహిత్యం కోసం విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా లక్ష రూపాయల పురస్కారం ప్రకటించింది.
దీనిని ప్రాచీన తమిళ ఇతిహాసకారుడు ‘ఇలంగో అడిగల్’ పేరున ఇవ్వనున్నారు. అంతే కాదు తమిళ భాష వ్యాప్తికి కృషి చేసేవారి కోసం ప్రతి ఏటా ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరికి 25 వేల నగదు కలిగిన ‘తమిళ సెమ్మల్’ పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. ప్రాచీన తమిళ సాహిత్యం కోసమే ప్రత్యేకంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని కోసం హుండీల ఏర్పాటులో తలమునకలుగా ఉంది. దీని నుంచి తెలుగు సాహిత్యం ప్రస్తుతానికి ఆశించేది ఏముంది?