నిద్ర తగ్గితే సమస్యలు పెరుగుతాయి
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే-షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - నాగ కిశోర్, హైదరాబాద్
మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువరావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన కొన్ని లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన శారీరకంగా వచ్చే మార్పులు చికాకులు చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం దీర్ఘకాలిక వ్యాధులు వంశపారంపర్యం అంతులేని ఆలోచనలు
లక్షణాలు: నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం
నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ)
చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్‌వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 - 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్
పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు నాలుగు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్గారికి చూపించి మందులు తీసుకున్నా సమస్య తిరగబెడుతోంది. పాపకు తలలోని కొన్ని భాగాలలో జుట్టు సరిగా రావడం లేదు. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి? ఇది ఏవైనా ఇతర అనారోగ్యాలకు సూచనా? భవిష్యత్తులో పాపకు చుండ్రు వస్తుందా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - సుజాత, అమలాపురం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, దీనికి ఇన్ఫెక్షన్ కూడా తోడైనట్లు తెలుస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్య. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి నిర్దిష్టంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు కొంతవరకు ఎమ్. పర్పూరా అనే సూక్ష్మజీవి కారణం కావచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం.
కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపించవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదే విధంగా కనిపించవచ్చు.
ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. ఇంత చిన్న వయసులో ఇలా రావడం వల్ల భవిష్యత్తుల్లో పాపకు చుండ్రు (డాండ్రఫ్), ఇతరత్రా చర్మసమస్యలు వస్తాయని చెప్పడానికి లేదు. మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్