వైవీయూలో ‘ఫలితాల’ గోల
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయంలో డిగ్రీ పరీక్షా ఫలితాలకు సంబంధించి రీ వాల్యుయేషన్ రగడ మొదలైంది. వైవీయూ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్–మే నెలలో నిర్వహించిన డిగ్రీ పరీక్షా ఫలితాలకు సంబంధించిన ఫలితాలను జూన్‌లో విడుదల చేశారు. ఇందులో ఉత్తీర్ణత సాధించని, మంచి మార్కులు వస్తాయని భావించిన అభ్యర్థులు ఎవరైనా వారి ఫలితాల పట్ల సందేహం ఉంటే రీ వాల్యుయేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్, రీ టోటలింగ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ కమ్ రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందు కు వైవీయూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ జారీ అయిన సమయంలో పరీక్షల నియంత్రణ విభాగంలో పని చేస్తున్న కొందరు కింది స్థాయి అధికారులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం విద్యార్థులను తప్పుతోవ పట్టిం చాయి. మీరు రీవాల్యుషన్‌కు దరఖాస్తు చేయండి.. పాస్ చేయిస్తామన్న భరోసా వారికి ఇచ్చా యి. దీంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
3409 మంది దరఖాస్తు..
పరీక్షా ఫలితాల్లో సందేహాలు ఉన్నాయంటూ ఏకంగా 3409 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. రీ వాల్యుయేషన్‌కు 3300, పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు 104, రీ టోటలింగ్‌కు 5 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.
పరీక్షల విభాగంపై పట్టుకు ఓ పాలకమండలి సభ్యుడి ఆరాటం..
గతంలో పరీక్షల నియంత్రణ విభాగం అధికారులతో తగువు పెట్టుకున్న ఓ పాలకమండలి సభ్యుడు పరీక్షల విభాగంపై పట్టుసాధించేందుకు ప్రయత్నం ప్రారంభిం చారు. గతంలో గొడవ పడిన అధికారిపై ఆరోపణలు సంధించడంతో సదరు అధికారి స్వచ్ఛందంగా పరీక్షల నియంత్రణ విభాగంలో పనిచేయలేమని రాజీ నామా సమర్పించాడు. అంతటితో ఆగకుండా ఇన్చార్జి వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య కె. రాజగోపాల్ బాధ్యతలు స్వీకరించిన రోజున సాక్షాత్తు రెక్టార్ ఛాంబర్‌లోనే పరీ క్షల నియంత్రణ విభాగం అధికారులను పిలి పించి.. పరీక్షా ఫలితాల్లో చూసుకుని వెళ్లాలని హుకుం జారీచేసినట్లు సమాచారం.
విద్యార్థులు వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవాలి...
విద్యార్థులు రీవాల్యుయేషన్, టోటలింగ్, పర్సనల్ ఐడెంటిఫికేషన్‌లలో ఉన్న నిబంధనలను అర్థం చేసుకోవాలి. కళాశాల యాజమాన్యాలు చెప్పారని పాసవుతారనుకుంటే పొరపాటే. బాగా రాసి ఆశించిన ఫలితాలు రాని అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న అంశాల ఆధారంగా వారిని అనుమతిస్తాం. రీ వాల్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధిం చని వారికి కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేం దుకు అవకాశం కల్పిస్తాం.
– ఆచార్య శ్రీనివాస్ బాయినేని, పరీక్షల విభాగం,నియంత్రణాధికారి, వైవీయూ