కలల బండి కదిలివస్తోంది!
– నేడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం
– నంద్యాలకు వచ్చిన డెమో రైలు
– రేపటి నుంచి రైళ్ల రాకపోకలు
నంద్యాల: కర్నూలు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు శుభవార్త. నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం ప్రారంభమవుతోంది. బుధవారం నుంచి నంద్యాల–కడప మధ్య రైళ్లు పరిగెత్తనున్నాయి. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ పనులు కేంద్ర మాజీ హోంశాఖా మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చొరవతో కార్యరూపం దాల్చాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాక పనులు గత నెల పూర్తయ్యాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా దాదాపు రూ.650 కోట్లు మంజూరు చేసింది. ప్రతి రైల్వే బడ్జెట్లో రూ.40 నుంచి రూ.60 కోట్లు మంజూరు చేస్తుండటంతో పనులు ముందుకు కదల్లేదు. నరేంద్రమోడీ ప్రభుత్వం పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు విడతలుగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. 2016 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌ను నిర్దేశించింది. దీంతో పనులు త్వరితంగా పూర్తయి నిర్ణీత టార్గెట్ కంటే నెల ముందే పూర్తయ్యాయి. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో రైల్వే రాకపోకలకు క్లియరెన్స్ వచ్చింది. నంద్యాల–కడప మధ్య బుధవారం నుంచి రెగ్యులర్ రైళ్లు తిరగనున్నాయి.
విజయవాడ నుంచి రిమోట్‌తో ప్రారంభం
నంద్యాల–ఎర్రుగంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం 2.00– 2.03 గంటల మధ్యలో విజయవాడ నుంచి రిమోట్ ద్వారా నంద్యాలలోని రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. చెన్నైలో తయారైన డెమో రైలు సోమవారం తెల్లవారుజామున నంద్యాలకు చేరింది. కేంద్ర మంత్రి ప్రారంభించిన అనంతరం రైలు 3.30 గంటలకు కడపకు బయల్దేరుతుంది. ఈ రైలులో 8 క్యాబిన్లు ఉన్నాయి. ఒక్కో క్యాబిన్లో దాదాపు 80మంది కూర్చుకొనే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారంపై ఈ ప్రారంభోత్సవ వేడుకలను తిలకించడానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, ఇన్చార్జి మంత్రి అచ్చెంన్నాయుడు, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, ఎస్పీవైరెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, కడప, కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఏర్పాట్లను రైల్వే గుంటూరు, గుంతకల్లు డీఆర్ఎంలు విజయశర్మ, గోపినాథ్మాల్య పర్యవేక్షిస్తున్నారు.
నంద్యాల–కడప రైలు మార్గం వివరాలు
దూరం: 160కి.మీ
రైళ్ల వేగం : 42కి.మీ(గంటకు)
స్టేషన్లు : నంద్యాల, మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఎస్.ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుడిపాడు, కమలాపురం, గంగాయపల్లె, క్రిష్ణాపురం, కడప
నంద్యాల నుంచి వెళ్లే రైళ్ల సమయం..
బనగానపల్లెకు 33 నిమిషాలు, కోవెలకుంట్ల 49 నిమిషాలు, సంజామలకు 60 నిమిషాలు, నొన్సం 1.27 గంటలు, జమ్మలమడుగు 1.51గంటలు, ప్రొద్దుటూరు 2.17గంటలు, ఎర్రగుంట్ల 2.20గంటలు, కడప 3.45 గంటలు.
చార్జీలు...
నంద్యాల – బనగానపల్లె, కోవెలకుంట్లకు రూ.10, సంజామలకు రూ.15, నొస్సం రూ.20, జమ్మలమడుగు రూ.20, ప్రొద్దుటూరు రూ.25, కడప రూ.40.