ఓటర్ల మెడలో గుడి‘గంట’!
అడిగితే చాలు గ్రామాలకు తాయిలాలు
గుడుల నిర్మాణానికి మెటీరియల్
గ్రామ పెద్దలతో ప్రమాణాలు చేయించి మరీ సరఫరా
భీమిలిలో ప్రలోభాల ప్రహసనం
తగరపువలస, న్యూస్‌లైన్: భీమిలిలో ప్రతికూల పవనాలు వీస్తూ ఉండడంతో హతాశుడైన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనకు పరిచయమైన పాత బాట పట్టాలని నిశ్చయించుకున్నట్టు ఉంది. తాయిలాలు, పారితోషికాలతో ఓటర్లపై ప్రలోభాల వల విసరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఊళ్ల వారీగా, వీధుల వారీగా ఓటర్లకు గాలం వేసి తన పబ్బం గడుపుకోవాలని నిశ్చయించినట్టు తేటతెల్లవుతోంది.
నోట్లు వెదజల్లయినా తనపై గల వ్యతిరేకతను తొలగించుకోవాలని ఆరాటపడుతున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్ధమవుతోంది. మరీ ముఖ్యంగా స్థానికేతరుడన్న మచ్చ తొలగించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడేట్టు కనిపిస్తోంది. గ్రామానికో కమ్యూనిటీ హాలు, వార్డుకో గుడి నిర్మించుకోవడానికి ఇప్పటికే గంటా పచ్చజండా చూపారని తెలియవచ్చింది. ఇందుకోసం మెటీరియల్, డబ్బుతో ఆశ పెడుతూ ఓట్లు తనకే వేయాలని గ్రామపెద్దలతో ప్రమాణాలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుమారు పదేళ్ల క్రితం భీమిలి మున్సిపాల్టీకి చైర్పర్సన్ కావాలని భంగపడి టీడీపీ అధిష్టానాన్ని తిట్టిపోసి పార్టీకి దూరంగా ఉన్న నాయకురాలు మళ్లీ గంటా పుణ్యమాని టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు గంటా తరపున మళ్లీ వార్డు ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె 11,12 వార్డుల మహిళలతో గంటా తరపున బేరసారాలు సాగించారు. ఆయా వార్డులలో తెలుగు తమ్ముళ్లుగా పేరుపడ్డ నాయకులు వార్డుకో కమ్యూనిటీ హాలు,గుడిని నిర్మించాలని రాయబారం నడిపినట్టు తెలుస్తోంది.
దాంతో వార్డుకు రూ.5 లక్షలు ఇవ్వడానికి గంటా సమ్మతించినట్టు తెలిసింది. 25వ వార్డులో మూడురోజుల క్రితం భూమిపూజ జరిగిన రామాలయానికి గ్రామస్తులు ఇచ్చిన విరాళం కన్నా టీడీపీ అభ్యర్థి గంటా ఎక్కువ సమకూర్చారని వినవస్తోంది. ఎన్నికల ముందు లక్ష విలువైన మెటీరియల్ ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలియవచ్చింది. టన్ను ఇనుము,రెండు లారీల ఇటుక, నాలుగు యూనిట్ల పిక్క, వంద సిమెంటు బస్తాలు ఈ ‘ప్యాకేజీ’లో భాగమని తెలుస్తోంది.
హామీ ఇచ్చిన తక్షణం ఆఘమేఘాల మీద మెటీరియల్ పంపడంతో గ్రామ పెద్దలే ఆశ్చర్యపోతున్నట్టు తెలియవచ్చింది. మెటీరియల్ ఇప్పించిన మాజీ పట్టణ అధ్యక్షుడు గంటా తరపున రాముని ఫొటోపై గ్రామస్తులతో ఒట్లు వేయించుకున్నారని వెల్లడైంది. ఒక్క భీమిలిలోనే కాకుండా మూడుమండలాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇదే ధోరణి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ఆలయాల పేరుతో ఒట్లేయించి ఓట్లు కొట్టేయాలని గంటా అనుచరులు పథకం వేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇంత హడావుడి చేస్తున్న మంత్రి పదవిలో ఉన్నప్పుడు చిట్టివలస జ్యూట్ మిల్లు తెరిపించలేకోయారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.